- భయంతో చెరువులో దూకిన యువకుడు
- మునుగుతున్నా వదలకుండా బండలేయడంతో మృతి
- ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణం
- రూ.4 వేలు కట్టనందుకు సొంత వాహనం సీజ్
- పూచీకత్తుగా ఉన్న వెహికిల్ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి
- వెంటాడి వేధించి ప్రాణం తీసిండ్రు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. టూ వీలర్ కిస్తీ చెల్లించలేదని ఓ కస్టమర్ ను పరిగెత్తిస్తూ మీద రాళ్లేస్తూ వెంటపడడంతో భయంతో చెరువులో దూకాడు. అయినా వదలకుండా అలాగే రాళ్లేయడంతో బయటకు రాలేక ..ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..యూపీలోని ఆగ్రా సమీపంలో ఉన్న అయ్యేలా గ్రామానికి చెందిన వినీత్ బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి మార్బుల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని నెలల కింద వినయ్, ఇతడి మేస్త్రీ అజయ్ ఠాగూర్ కలిసి వైరా రోడ్డులోని టూ వీలర్ షోరూంలో కొంత డౌన్ పేమెంట్ కట్టి మోహనసాయి ఆటో ఫైనాన్స్‌లో రెండు టూ వీలర్లు తీసుకున్నారు.
మొదట్లో కిస్తీలు సరిగ్గానే కట్టినా ఈ మధ్య పని లేక కట్టలేదు. వినీత్ వాహనంపై రూ.4 వేలు, ఠాగూర్ వెహికల్‌పై రూ.14 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్ కుమార్ నాలుగు రోజుల కింద వినీత్ టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు. ఠాగూర్ కనిపించకపోవడంతో ఆయన వెహికల్‌కు పూచీకత్తుగా ఉన్నావని, అతడి డబ్బులు క్టటాలని ఒత్తిడి చేస్తున్నారు. నాలుగు రోజులుగా అతడి వెంటపడుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా వదలడం లేదు.
వెంటాడి రాళ్లదాడి..చెరువులో పడ్డా వదల్లే
రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించని వినీత్ భయంభయంగానే తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బల్లేపల్లి వద్ద వినీత్ ఓ బండిపై వస్తూ రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్ కుమార్ కంట పడ్డాడు. దీంతో వారు వినీత్‌ను పట్టుకోబోగా తప్పించుకుని టూ వీలర్ పై కొంతదూరం పారిపోయాడు. అయినా వదలకుండా వెంటాడడంతో వెహికల్ వదిలేసి పరిగెత్తాడు. అయినా చేతికి దొరికిన రాళ్లు విసురుతూ వెంబడించారు. భయంతో పరిగెత్తుతున్నా వెంటాడడం ఆపలేదు. చెరువు అడ్డం రావడంతో వినీత్ వేరే వైపు పరుగు తీశాడు.
అక్కడ కూడా రాళ్లేస్తుండడంతో భయపడి దిక్కుతోచక ఖానాపురం ట్యాంక్బండ్చెరువులో దూకాడు. చెరువులో దూకిన వినీత్‌ను కాపాడాల్సిన రికవరీ ఏజెంట్లు ఆ పని చేయకుండా మళ్లీ మీద బండలు విసిరారు. అప్పటికే పరిగెత్తి ఆయాసంతో ఉండడం, బయటకు రాకుండా రాళ్లేస్తుండడంతో ఊపిరాడక చనిపోయాడు. వినీత్ పరిగెత్తుతున్న దృశ్యాలతో పాటు ఏజెంట్లు వెంటపడి రాళ్లేసే విజువల్స్ స్థానికుల ఇండ్లలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఖానాపురం సీఐ భాను ప్రకాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.