- 2.8 కోట్లల్లో 53 లక్షలు బాధితుడికి అందజేత
- మరో 50 లక్షలు త్వరలో రిఫండ్ అవుతాయన్న సైబర్ క్రైమ్ పోలీసులు
బషీర్ బాగ్, వెలుగు : సీబీఐ అధికారుల పేరిట ఇటీవల వృద్ధుడి(84) వద్ద రూ.2.8 కోట్ల కాజేసిన సైబర్ నేరగాళ్ల నుంచి సొమ్ము రికవరీ అయ్యింది. మొత్తం రూ. 2.8 కోట్లల్లో రూ. 53 లక్షలను సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడికి అందజేశారు. మరో రూ. 50 లక్షలు కూడా త్వరలో రిఫండ్ అవుతాయని హామీ ఇచ్చారు. ఫిడెక్స్ కొరియర్ లో డ్రగ్స్ పార్సెల్ అవుతున్నాయని హైదారాబాద్ కు వృద్ధుడిని గతంలో సైబర్ నేరగాళ్లు చీట్ చేశారు. వృద్ధుడికి వాట్సాప్ వీడియో కాల్ చేసి సీబీఐ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు.
68 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నావని..అరెస్ట్ చేసి జైల్ కు పంపిస్తామని వృద్ధుడిని బెదిరించారు. కేసు నుంచి బయటపడాలంటే అకౌంట్స్ లో ఉన్న డబ్బులు పంపించాలని, వాటిని వెరిఫై చేసి మళ్లీ పంపిస్తామని నమ్మబలికారు. నిజమేనని నమ్మిన బాధిత వృద్ధుడు.. అతని అకౌంట్స్ లో ఉన్న రెండు కోట్ల 88 లక్షల రూపాయలను పంపించాడు. అనంతరం వారి నుంచి ఎలాంటి కాల్స్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు..
బాధితుడి నుంచి బదిలీ అయిన మొత్తం నగదును ఫ్రీజ్ చేశారు. బాధితుడితో న్యాయస్థానంలో పిటిషన్ వేయించారు. జరిగిన వ్యవహారాన్ని పరిశీలించిన న్యాయస్థానం..సైబర్ నేరగాళ్లకు చెందిన సూరత్ లోని యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.53 లక్షలు, కేరళలోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ. 50 లక్షలు బాధితుడికి రిఫండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
దాంతో బుధవారం సూరత్ యాక్సిస్ బ్యాంక్ నుంచి రిఫండ్ అయిన రూ.53 లక్షల నగదును బాధితుడికి పోలీసులు అందజేశారు. కేరళ ఎస్బీఐ నుంచి మరో 50 లక్షలు కూడా త్వరలో రిఫండ్ అవుతాయని సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని, బాధితుడికి డబ్బులు రిఫండ్ అయ్యేలా వ్యవహరించిన సిబ్బందిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అభినందించారు.