తె లంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సమాచార హక్కు చట్టం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇలా పలు రాజ్యాంగబద్ద సంస్థలలో బీఆర్ఎస్ ప్రభుత్వ నియామక నిర్ణయాలు వివాదాస్పదమౌతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నియామకాన్ని హై కోర్ట్ పునః పరిశీలించాలని ఆదేశించడం, అదే విధంగా రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పట్టుబడడం, హుజురాబాద్ ఎన్నికలలో విజయం సాధించాలనే తపనతో పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని హడావుడిగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం గవర్నర్ తిరస్కరించడం, వంటి సహా అనేక ఘటనలు తెలంగాణ ప్రభుత్వ పెద్దల తీరుతో రాజ్యాంగబద్ద సంస్థలు అపహాస్యం పాలవుతున్నాయి.
రాజకీయ నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి యువత ఆకాంక్షలు నెరవేర్చాల్సిన ప్రభుత్వం ఉద్యోగ కల్పనా కేంద్రమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసినా ఏడాది కాలం ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. తీవ్ర అలసత్వం ప్రదర్శించి నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే గాక, కొందరి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైంది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిరుద్యోగులను మోసగిస్తున్న తీరుపై విద్యార్థి, నిరుద్యోగుల ఆందోళనలు, కొంతమంది న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. పరిమిత కాల వ్యవధిలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ నియామకాలు పూర్తి చేయాలనే హైకోర్ట్ నిబంధనతో మేల్కొన్న ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యుల నియామకాలు చేపడుతూ 2021 మే 19 జీ ఓ 108 జారీ చేసింది. కానీ ఈ నియామకాల్లో లాబీయింగ్, ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన వ్యక్తులతో నింపారు. రోజుకో ఘటన, వార్తలతో అసలు ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా పైరవీలే అనే పరిస్థితి నెలకొంది.
ప్రజా జీవితంలో 30 ఏండ్ల నుంచి కొనసాగుతూ స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన వ్యక్తి రాజ్యాంగబద్ద సంస్థల విలువలను కాల రాశారు. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆరుగురు సభ్యుల నియామకాన్ని పునః పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరుగురు సభ్యులలో ఏ ఒక్కరికి అర్హతలు నిబంధనల మేరకు లేవని సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉండాలని హైకోర్టు ప్రభుత్వానికి హితవు పలికింది. మూడు నెలల్లోపు ఈ నియామకాల పునః సమీక్ష పూర్తి కావాలని ఆదేశించింది.
అడుగులకు మడుగులొత్తే నియామకాలు
ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ నిధులు విడుదల చేయకుండా, నియామకాలు చేపట్టక, మౌలిక వసతుల కల్పనలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తూ విశ్వవిద్యాలయాలను అధ:పాతాళానికి అణిచివేసింది. తొమ్మిది ఏళ్ల కాలంలో దాదాపు 5 ఏళ్లు ఇంచార్జ్ వీసీలతో కాలం వెళ్ళదీసి యూనివర్సిటీలను నీరుగార్చింది. విద్యార్థి సంఘాల సుదీర్ఘ పోరాటాలకు, కోర్టు మొట్టికాయలతో పాటు, గవర్నర్ ప్రశ్నించడంతో రెండున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు 2021లో యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైస్ ఛాన్స్లర్ నియామకాలలో యూజీసీ నియమ నిబంధనలను పూర్తిగా కాలరాస్తూ అకడమిక్ నాణ్యత, పరిశోధన ప్రమాణాలు, పరిపాలనా అనుభవం, గత చరిత్ర వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.
కేవలం తమ అనుయాయులతో కులానికొకటి ప్రాంతానికొకటి అని తన రాజకీయ ప్రయోజనాల నిగూఢ అజెండాతో లోప భూయిష్టమైన నియామకాలు చేపట్టింది. ప్రభుత్వానికి అడుగులకు మడుగులోత్తేవారిని నియమిస్తున్నారని ఈ నియామకాల ప్రకటనకు ముందే గవర్నర్కు సూచించడం జరిగింది .అయినా వారినే నియమించడంతో నేడు జరుగుతున్న దుష్ఫరిణామాలకు తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అవినీతి, అక్రమాలే సాక్ష్యం. ఆ వీసీ ఏసీబీకి పట్టుబడటంతో యూనివర్సిటీల ప్రతిభ మంటగలుస్తోంది.
వ్యవస్థలను బతికించుకోక తప్పదు
రాజ్యాంగ బద్ద సంస్థల నియామకాల్లో ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల, వ్యవస్థల పరిరక్షణగా ఉండాలి. కానీ అధికారం, విచక్షణ అధికారాలు వినియోగించి ఇస్టానుసారంగా చేసే నియామకాలతో వ్యవస్థలు నిర్వీర్యమై సంస్థల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇది తెలంగాణకు ఎంత ప్రమాదమో అందరూ గమనించాలి. ప్రభుత్వం వెంటనే టీఎస్పీఎస్సీ సహా ఇతర నియామకాల పట్ల పునః సమీక్షించి బంధు ప్రీతీ, ఆశ్రీత పక్షపాతం ఇతర అంశాలకు తావు లేకుండా ప్రతిభ, సమర్థత, విశిష్టత, చిత్తశుద్ధి వంటి ప్రమాణాల ఆధారంగా అర్హులను నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
లేదంటే, రాజ్యాంగబద్ద సంస్థల్లో అశ్రిత పక్షపాత, అవినీతి, అనర్హ నియామకాలతో తెలంగాణ ప్రతిభ, విద్యా నాణ్యత, ఉద్యోగ అవకాశాలు, పాలనా వ్యవస్థలు దెబ్బతినంటాయనడంలో సందేహం లేదు. రాజ్యాంగ బద్ధ సంస్థలను ఇలాగే నిర్వీర్యం చేస్తూ పోతే, ప్రజలకు మిగిలేది పాలకుడిని మార్చడమే!
- ప్రవీణ్ రెడ్డి, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏబీవీపీ-తెలంగాణ