జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ పోస్టులను భర్తీ చేయండి

జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ పోస్టులను భర్తీ చేయండి
  •     టీఎస్ఎస్పీడీసీఎల్‌‌ అప్పీళ్లపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: 2019లో జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ జాబ్ నోటిఫికేషన్‌‌ ద్వారా ఇంకా భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలను కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో ఫిలప్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లైన్‌‌మెన్‌‌ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ నోటిఫికేషన్‌‌లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో 25 పిటిషన్‌‌లు దాఖలయ్యాయి. 

వీటిపై విచారించిన సింగిల్‌‌ జడ్జి.. లైన్‌‌మెన్‌‌ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తింపజేయడం చెల్లదంటూ తీర్పు వెలువరించారు. దీన్ని సవాలు చేస్తూ టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ 25 అప్పీళ్లు దాఖలు చేయగా.. వీటిపై జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి, జస్టిస్‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..లైన్‌‌మెన్‌‌లకు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని, జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదని పేర్కొన్నారు. 

పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..రిజర్వేషన్‌‌ల ద్వారా పక్క జిల్లా వాళ్లకు కూడా అవకాశం లేకుండా పోయిందని సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. సింగిల్‌‌ జడ్జి తీర్పును సవరిస్తూ నోటిఫికేషన్‌‌లో రిజర్వేషన్‌‌లకు సంబంధించిన నిబంధనను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ప్రతివాదులతో (కోర్టుకు వచ్చినవారు) భర్తీ చేయాలని ఆదేశిస్తూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది.