- తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకు..
- టీవీ నుంచి సెల్‌ఫోన్, కంప్యూటర్ వరకు..
- కూలర్ల నుంచి ఏసీల వరకు..
పిల్లల డైపర్లు, కోడి ఈకలు, వరి పొట్టు, పండ్లు, పూలు, చింతపిక్కల నుంచి గాడ్జెట్స్ వరకు. ఇక ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ గురించి అయితే స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఒకసారి వాడాక చెత్తలోకే వెళ్తాయి. ఒక్కోటి ఒక్కో రకం చెత్త. అలా అలా భూమ్మీద చెత్త కుప్ప పేరుకుపోతోంది. అయితే ఏం చేయమంటారు? కాలం చెల్లిన వాటిని పడేయాల్సిందే కదా! అంటే... కాదు. కాలం చెల్లాక కూడా వాటిని వాడొచ్చు. కాకపోతే అప్పుడు వాటి రూపం, ఉపయోగం రెండూ మారిపోతాయంతే! అప్పుడు ఏదీ వేస్ట్ కాదు. వేస్ట్ అనుకున్నది ఏదీ వేస్ట్ కానే కాదు. అది ఎలాగో? ఎందుకో? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాలి.
ఈ – వేస్ట్, బయో వేస్ట్, ఫుడ్ వేస్ట్.. పేర్లు ఏవైనా అవన్నీ వ్యర్థాలే. కానీ, కాస్త బుర్రకు పదును పెడితే వేస్ట్‌ని కూడా వేస్ట్ కాకుండా చేయొచ్చు. చెత్తతో కూడా కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న బయోగ్యాస్, కంపోస్ట్ వంటి ఆవిష్కరణలు గుర్తు చేసుకుంటే నిజమే అనిపిస్తుంది. అయితే, అవి అక్కడితో ఆగిపోకుండా మరెన్నో అద్భుతాలను ఇన్వెంట్ చేసేలా ప్రపంచదేశాలను ప్రేరేపించాయి. అవి వట్టి ఆవిష్కరణలు మాత్రమే కాదు.. పర్యావరణాన్ని కాపాడడంలో కీలకమైనవి కూడా.
మొదటగా.. ఇళ్లు తీసుకుందాం. ఇల్లు కట్టేందుకు వాడే కాంక్రీట్కి చాలా ఖర్చవుతుంది. అందులో వాడే ఇసుక, సిమెంట్, నీళ్లు, కంకర వంటి వాటికి వేల రూపాయల డబ్బు కావాలి. అయితే, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇసుక, నీటి కొరత ఎక్కువ. అలాంటప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు? అనే ఆలోచన నుంచి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అవేంటంటే...
కాఫీతో కాంక్రీట్!
ప్రపంచం మొత్తం మీద నీళ్ల తరువాత అత్యధికంగా వాడేది కాంక్రీట్ మెటీరియల్! మరి ప్రపంచమంతటా అంతగా వాడుతున్న ఈ కాంక్రీట్‌ను ఇసుక, సిమెంట్, కంకర, నీళ్లు కలిపి తయారుచేస్తారు. వాటిలో ఇసుక, సిమెంట్ వల్ల ఎన్విరాన్మెంట్కి నష్టం. మరి ఈ నష్టం జరగకుండా ఆపేదెలా? ఒక పక్కనేమో నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాంక్రీట్‌కు ప్రత్యామ్నాయం ఏంటి? ఆ ప్రత్యామ్నాయమే వాడి పారేసిన కాఫీ పొడి అంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎమ్ఐటీ యూనివర్సిటీ ఇంజనీర్లు.
‘వాడి పడేసిన కాఫీ పొడి(కాఫీ గ్రౌండ్)ని వాడితే కాంక్రీట్30 శాతం స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాఫీ పొడిని బయోచర్గా మార్చి వాడాలి. ఈ ప్రాసెస్‌కు ఆక్సిజన్‌తో సంబంధం లేదు. 350 డిగ్రీల సెల్సియస్ వద్ద తక్కువ ఎనర్జీతో కాఫీ గ్రౌండ్ ప్రాసెస్ చేయొచ్చు’ అంటున్నాడు డాక్టర్ రాజీవ్ రాయ్‌చంద్. ఇవ్వాళరేపు ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఎన్విరాన్మెంట్కు హాని కలగకుండా ఆర్గానిక్ వేస్ట్‌ను డిస్పోజ్ చేయడం.
లేకపోతే పెద్ద మొత్తంలో మీథేన్, కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ గ్యాసెస్ విడుదలై వాతావరణంలో విపరీత మార్పులకు కారణం అవుతున్నాయి. ఆస్ట్రేలియాలో ప్రతి ఏడాది75 మిలియన్ కిలోగ్రాములు కాఫీ గ్రౌండ్ వేస్ట్‌లో ఎక్కువభాగం భూమ్మీద చెత్తలా పేరుకుపోతోంది. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ఏడాదికి పది బిలియన్ కిలోగ్రాములు వాడి పడేసిన కాఫీ వేస్ట్ వస్తోంది. ఆ వేస్ట్‌ను వాడడం వల్ల భవన నిర్మాణాలకు కావాల్సిన ఇసుక కోసం నదీ తీరాలు, నదుల్లో తవ్వకాలకు ఫుల్స్టాప్ పెట్టొచ్చు. ఇసుక తవ్వకాలు ఎక్కువ అవడం వల్ల ఎన్విరాన్మెంట్లో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వ్యర్థాలు ఎక్కువయ్యేకొద్దీ భూమికి గ్రీన్హౌస్ ఎఫెక్ట్ పెరుగుతోంది. అంటే పగటిపూట ఎండవేడికి ఎక్స్పోజ్ అయిన భూమి రాత్రి వేళల్లో చల్లబడుతుంది. కానీ, గ్రీన్ హౌస్ గ్యాస్‌ల వల్ల వేడి అలానే ఉండిపోయి భూమి చల్లబడడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే సముద్రాలు, మంచు పర్వతాలు కరిగి నీటి మట్టం పెరిగిపోయి ఊళ్లు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ గ్యాస్‌లు వాతావరణంలో ఉండేవే అయినప్పటికీ వ్యర్థాలు పెరిగి, వాటి ద్వారా వచ్చే వాయువులు ఎక్కువై... అవి వాతావరణంలో కలిసిపోయి ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్విరాన్మెంట్ను భద్రంగా ఉంచేందుకు చాలా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ భూమిపై పడకుండా ఏం చేయాలని ప్రపంచవ్యాప్తంగా బోలెడు ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు. అలాంటిదే ఈ కాఫీ పొడి రీసెర్చ్ కూడా.
కాంక్రీట్ తయారీ
కాఫీ పొడి వేస్ట్‌ని కాల్చి బయోచర్ అనే పదార్థంగా మార్చారు. ఇది సిమెంట్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర తయారవుతుంది. ఒక ప్రత్యేకమైన ఒవెన్‌లో ఆక్సిజన్ లేకుండా 350 డిగ్రీల సెల్సియస్ వరకు రెండు గంటలపాటు వేడి చేస్తే బయోచర్ రెడీ అవుతుంది. కాంక్రీట్‌లో15 శాతం ఇసుక బదులు బయోచార్ వాడొచ్చు. దాంతో ఇసుక, సిమెంట్ వాడకం కొంతవరకు తగ్గుతుంది. మామూలుగా కాంక్రీట్‌తో కట్టే నిర్మాణాలు తడి ఆరితే పగుళ్లు వస్తాయి.
కానీ, కాఫీ వేస్ట్‌తో చేసిన కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడవు. బయోచర్ కాంక్రీట్‌తో కలిసినప్పుడు దాని కణాలు కాంక్రీట్ అంతా వ్యాపించి, చిన్న నీటి రిజర్వాయర్లా పనిచేస్తాయట. తయారైన కాంక్రీట్ గట్టిపడడం మొదలైనప్పుడు, బయోచార్ నెమ్మదిగా నీటిని విడుదల చేసి పదార్థాన్నంతటినీ రీహైడ్రేట్ చేస్తుంది. దాంతో పగుళ్ల ప్రభావం తగ్గుతుంది. బయోచార్ సాయంతో ఒక మోస్తరు భూకంపాలను ఎదుర్కొనే శక్తి ఉన్న ఇండ్లను కట్టుకోవచ్చు. పటిష్టమైన రోడ్లు, వంతెనలు, భవనాలు కట్టొచ్చు అంటున్నారు ఆస్ట్రేలియన్ రీసెర్చర్లు.
పాడైన టైర్లతో..
పాడైన టైర్లతో నాణ్యమైన కాంక్రీట్ తయారుచేయడం మరో కొత్త ఇన్నొవేషన్. ఈ కాంక్రీట్ మిక్చర్ మొత్తం కూడా టైర్ పార్టికల్స్‌తో నిండి ఉంటుంది. పాడైన టైర్లను కొంతమేర రీసైకిల్ చేస్తున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో కాల్చేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోంది. దీంతో, రీసెర్చర్లు కాంక్రీట్ తయారీలో ఇసుక లేదా కంకరకు బదులు కొంతమేర పాత టైర్స్ వాడారు. ఇది మామూలు కాంక్రీట్ కంటే గట్టిగా ఉంటుంది.
కానీ, ఇందులో సిమెంట్ రబ్బరు ముక్కలతో తగినంత బాండింగ్ ఏర్పరచుకోక తర్వాత కాలంలో కాంక్రీట్‌లో లోపాలు వస్తున్నాయి. ఈ సమస్యపై రీసెర్చ్ చేసిన ఆస్ట్రేలియన్ ఆర్ఎంఐటీ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు.. టైర్ రబ్బర్‌కు ఉన్న పోరోసిటీ కారణంగా సమస్య ఏర్పడిందని చెప్పారు. అంటే... కాంక్రీట్‌ను మొదట కలిపినప్పుడు రబ్బరులోని రంధ్రాలు నీటితో నిండిపోతాయి. అలాకాకుండా ఉండేందుకు కాంక్రీట్ టైర్ పార్టికల్స్ కలిపిన తరువాత కాంక్రీట్‌ను స్పెషల్ ఉక్కు అచ్చుల్లో ఉంచారు. ఈ అచ్చులు కాంక్రీట్‌పై ఒత్తిడి తెచ్చి, వాటిలోని కణాలు, రంధ్రాలను కుదిస్తాయి. దాంతో గట్టిపడి, ప్రీలోడెడ్ టైర్ కణాలతో ఆ సిమెంట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇలా చేస్తే సహజ వనరుల వాడకం తగ్గించొచ్చు. అలాగే పాడైన టైర్ల వల్ల పర్యావరణానికి హాని కలగకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు.
డైపర్లు కూడా....
చిన్న పిల్లలు ఉన్న వాళ్లకు డైపర్ల గురించి బాగా తెలుస్తుంది. నెలకి ఎన్నెన్ని వాడాల్సి వస్తుందో? ఇంట్లో ఉండే చెత్త సగం అయితే... మిగతా సగం డైపర్ల వేస్ట్ ఉంటుంది. ఒక ఇంట్లోనే పదుల సంఖ్యలో డైపర్ల వాడకం ఉంటోంది. అదే దేశం మొత్తం మీద అయితే.. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే.. వాటి సంఖ్య కొన్ని కోట్లు దాటుతుంది. ఉదాహరణకు అమెరికాలో తీసుకుంటే ఏటా నలభై లక్షల మంది పిల్లలకు ఒక లక్ష కోట్ల డైపర్లు అవసరం అవుతున్నాయి.
వాటిని వాడాక ఏం చేయాలి? డిస్పోజబుల్ డైపర్స్ అయితే భూమిలో కలిసిపోతాయి. కానీ, చాలా డైపర్లు ప్లాస్టిక్ కలిసిన పాలిస్టర్, పాలీఇథైలిన్, పాలీ ప్రొపైలీన్ వంటి వాటితో తయారుచేస్తున్నారు. అవి భూమిలో కలవడానికి దాదాపు 500 ఏండ్లు పడుతుందని చెప్తున్నారు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు. ఇది పెద్ద సమస్యే! ఈ సమస్యకు సొల్యూషన్‌గా డైపర్ డొమిసైల్స్ తీసుకొచ్చారు.
జపాన్‌లోని కిటాక్యుషు యూనివర్సిటీకి చెందిన ముగ్గురు రీసెర్చర్లు కలిసి ఒక రీసెర్చ్ చేశారు. అదేంటంటే... ‘‘డైపర్లను కడిగి, ఎండబెట్టి, ముక్కలు చేసి.. దాన్ని కంకర, ఇసుక, సిమెంట్, నీళ్లతో కలిపి 28 రోజులు ఉంచారు. ఆ తర్వాత అది వాడేందుకు పనికొస్తుంది’’ అని చెప్పారు. 36 చదరపు మీటర్ల ఫ్లోర్ మూడు అంతస్తులు కట్టాలంటే పది శాతం ఇసుక బదులు డైపర్ల వేస్ట్ వాడొచ్చు. అదే ఒక ఫ్లోర్ ఇల్లు కట్టాలంటే ఆ పర్సంటేజీ మూడింతలు అవుతుంది. అంతేకాకుండా డైపర్ల బదులు 40 శాతం ఇసుక అవసరం పడుతుంది. దాంతోపాటు తొమ్మది శాతం ఇసుక ఫ్లోర్‌కి, గార్డెన్ ఏరియాకు సరిపోతుంది. అదే 36 చదరపు మీటర్లలో ఇల్లు కట్టాలంటే డిస్పోజబుల్ డైపర్ వేస్ట్‌తో ఎనిమిది శాతం ఇసుకను రీప్లేస్ చేయొచ్చు.
ఇండోనేసియా వంటి తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఇళ్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఇండోనేసియాలో పట్టణ జనాభా ఏటా నాలుగు శాతం పెరుగుతోంది. ఫలితంగా ఏడాదికి మూడు లక్షల ఇండ్లు కొరత ఏర్పడుతుందట! ఆ కొరత తీరాలంటే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇళ్ల నిర్మాణం ఎంతైనా అవసరం. ఆ అవసరం తీర్చేందుకు డైపర్ల వేస్ట్ వాడితే సగం సమస్యకు చెక్ పెట్టినట్టు అవుతుంది అనుకున్నారు రీసెర్చర్లు. కాకపోతే డైపర్లను పెద్ద మొత్తంలో సేకరించడం, శుభ్రం చేయడం, ముక్కలు చేయడం వంటి పనులకు గవర్నమెంట్, వేస్ట్ ఫెసిలిటీ అధికారుల సహకారం తీసుకోవాలి అనుకున్నారు రీసెర్చర్లు. ఐడియా బాగానే ఉంది ఇలా చేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి మేలుతో పాటు చాలామందికి నివాసం దొరుకుతుంది. కాకపోతే డైపర్ల మెటీరియల్ కలిసిన కాంక్రీట్ వాడకానికి ఆ దేశంలోని నిర్మాణ నిబంధనలు సవరించాల్సి ఉంది.
ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ స్టెప్స్‌లో ఇదోరకం. ఇలానే చాలా దేశాల్లో చాలా రకాలుగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఎలా ఉండొచ్చు అనే దానిమీద ఎక్స్పరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి.
* * *
జీరో ఎమిషన్స్
వాతావరణంలో రకరకాల వాయువులు ఉంటాయి. వాటిలో ఆక్సిజన్ మనకు చాలా అవసరం. కార్బన్ డయాక్సైడ్ అనవసరం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయింది. దాంతో వాయుకాలుష్యానికి దారితీస్తోంది. మరి దీనికి పరిష్కారం? కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్షన్‌ని తగ్గించడం.
బొగ్గు బదులు బయో ఇథనాల్
కెన్యా ప్రజలు వంట కోసం కట్టెలు లేదా బొగ్గులు వాడతారు. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒకామె అనారోగ్యంతో హాస్పిటల్‌కు వెళ్లింది. ఆమెని టెస్ట్ చేసిన డాక్టర్ ‘‘నువ్వు సిగరెట్లు తాగడం ఆపాలి” అని చెప్పాడట. అది విన్న ఆమె షాక్ అయ్యి ‘‘చిన్నప్పటి నుంచి నేను సిగరెట్లను ముట్టుకోనేలేదు. మీరేంటి ఇలా చెప్తున్నారు” అని కాస్త కోపంగానే అడిగింది. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఆ పొగ పీల్చడం వల్ల అలా జరిగిందనే విషయం ఆమెకు తర్వాత అర్థమైంది.
పొగ వల్ల అనారోగ్యమే కాకుండా, కట్టెల కోసం అడవులు నరకడం వల్ల వాతావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోంది. ‘కోకో’ అనే స్టార్టప్ కంపెనీ దీనికి ఒక పరిష్కారం కనిపెట్టింది. ఫ్యూయల్ ఏటీఎమ్‌లు తీసుకొచ్చింది. నైరోబీలో ఇవి700లకు పైగా ఉన్నాయి. ఫ్యూయల్ ఏటీఎమ్‌లలో స్టవ్‌లను రీఫిల్ చేస్తారు. చెరకు గడల నుంచి తయారుచేసిన బయో ఇథనాల్ ఉంటుంది ఈ ఏటీఎమ్‌లలో. బొగ్గు నుంచి బయో ఇథనాల్‌కు మారడంవల్ల ఏటా ఐదు టన్నుల కార్బన్డయాక్సైడ్ కాలుష్యాన్ని నివారించొచ్చు.
కోడి వ్యర్థాలతో బయో డీజిల్
కేరళకు చెందిన వెటర్నరీ డాక్టర్ జాన్ అబ్రహాం ఏడేండ్ల కృషి ఫలితం బయో డీజిల్. ఈ బయో డీజిల్‌ను పౌల్ట్రీ వేస్ట్‌తో తయారుచేశాడు. దానికి పేటెంట్ రైట్స్ కూడా తెచ్చుకున్నాడు. ఈ డీజిల్ లీటర్‌కు 38 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. మామూలు డీజిల్ కంటే 40 శాతం తక్కువ ధర. ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
* * *
ప్లాస్టిక్ రీయూజ్
ప్లాస్టిక్ తయారీ మొదలైనప్పటి నుంచి దాదాపు ఇంట్లో ఏ పక్క చూసినా ప్లాస్టిక్ కనిపిస్తుంది. ఆఫీస్‌లు, హాస్పిటల్స్, హోటల్స్, ఫర్నిచర్ షాప్స్.. ఇలా ఎక్కడికెళ్లినా ప్లాస్టిక్ వస్తువు కనిపించని ప్లేస్ అంటూ ఉండదు. వాటిలో కూడా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఎక్కువ. ఇలా రకరకాల ఐటమ్స్ రూపంలో ప్లాస్టిక్ మన చుట్టూ తిరుగుతోంది. వాటిని వాడడం, పడేయడం చాలా మామూలు అయిపోయింది. డస్ట్బిన్ల నుంచి ప్లాస్టిక్ వేస్ట్ సముద్రాల్లోకి చేరుతోంది.
నదులు, సముద్రాల ఒడ్డున కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ పేరుకుపోయి వాతావరణంతో పాటు సముద్రజీవుల మనుగడకు ముప్పు తెస్తోంది. ప్లాస్టిక్ మట్టిలో కలవాలంటే వేల ఏండ్లు పడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్లాస్టిక్ వేస్ట్‌ని రీసైకిల్ చేయడమే. ఆ ఆలోచనతోనే ప్లాస్టిక్‌ని రోడ్ కన్స్ట్రక్షన్లో వాడడం మొదలుపెట్టింది మనదేశం.
ప్లాస్టిక్ వేస్ట్‌తో రోడ్డు
రోడ్డు కన్స్ట్రక్షన్లో ప్లాస్టిక్ వాడడం వల్ల రోడ్డు ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉంటుందని తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్ చేసిన రీసెర్చ్‌లో తేలింది. అలాగే భారీ వాహనాల వల్ల రోడ్డు పాడయ్యే ఛాన్స్ కూడా తగ్గుతుంది. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు విష వాయువులు విడుదల కావు. ప్లాస్టిక్ వేస్ట్‌తో రోడ్ కన్స్ట్రక్షన్ అనేది కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఎకో ఫ్రెండ్లీ ఇన్వెన్షన్స్లో ఇది ‘ది బెస్ట్’గా నిలిచింది.
ప్లాస్టిక్ నుంచి పెట్రోల్
ఒక వైపు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి సరే. మరో వైపు పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి కదా! ఈ రెండింటికీ ఒకే సొల్యూషన్ కనిపెట్టాడు హైదరాబాద్‌కి చెందిన మెకానికల్ ఇంజనీర్ సతీష్ కుమార్. నిజానికి ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేస్తారు. కానీ, ఆరు సార్లకు మించి దాన్ని రీసైకిల్ చేయడం కుదరదు. దాంతో రీసైకిల్ కాని ఆ ప్లాస్టిక్‌ని వదిలేస్తారు. ఆ ప్లాస్టిక్‌ను కూడా ఎలాగైనా వాడాలి అనుకున్నాడు ‘హైడ్రాక్సీ సిస్టమ్స్ అండ్ రీసెర్చ్’ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్. ‘‘రీసైకిల్‌కి పనికిరాని ప్లాస్టిక్ వేస్ట్‌ను సేకరించి ప్రాసెస్ చేశాం. దాంతో సింథటిక్ డీజిల్, సింథటిక్ పెట్రోల్, పెట్రోగ్యాస్, పెట్రో కోక్, సింథటిక్ ఏవియేషన్ ఫ్యూయల్స్ తయారవుతున్నాయి. ఈ ప్రాసెస్‌లో భాగంగా ఒక ఖాళీ డబ్బాలో డెడ్ ప్లాస్టిక్ వేసి, దాంతోపాటు కొన్ని పదార్థాలను కలిపి 350 – 400 డిగ్రీల మధ్య వేడి చేస్తాం. దీని ద్వారా నెలకు15 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ను ఫ్యుయెల్గా మార్చొచ్చు. ఈ టెక్నాలజీ వల్ల హానికర పదార్థం ఏదీ బయటకు విడుదల కాదు. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదు” అన్నారాయన.
ప్లాస్టిక్ ఇటుకలు
ప్లాస్టిక్ అంటే ఒకటే రకం కాదు. ఇందులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏడు రకాలు ఉన్నాయి. కెన్యాలో ప్లాస్టిక్ వేస్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కెన్యా రాజధాని నైరోబీలో జాంబీ మాటె అనే అమ్మాయి 2018లో ‘జిజెంగ్’ అనే కంపెనీ పెట్టింది. ‘‘ప్రతి నెలా10 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తారు. ఆ ప్లాస్టిక్‌ని మెషిన్లో వేసి చిన్న చిన్న ముక్కలు చేస్తారు. వాటిని మరో మెషిన్లో వేసి 300– 400 డిగ్రీ సెల్సియస్ మధ్య వేడి చేసినప్పుడు అది పేస్ట్‌లా బయటకు వస్తుంది. ఆ పేస్ట్‌ని ఇటుక అచ్చుల్లో పెట్టి ప్రెస్ చేస్తే ప్లాస్టిక్ ఇటుక తయారవుతుంది. వాటిని ఐదు నిమిషాలు నీళ్లలో చల్లార్చాక రోడ్డు కన్స్ట్రక్షన్లో, ఇంటి ముందు గార్డెన్ కోసం కూడా వాడొచ్చు’’ అంటోంది జాంబీ.
ప్లాస్టిక్ నుంచి షూ
ఇండియాలో మరో కంపెనీ ప్లాస్టిక్ వేస్ట్‌ని తిరిగి వాడుతోంది. 24 ఏండ్ల యాశే భావె జులై 2021లో ‘థైలీ’ అనే కంపెనీ లాంచ్ చేశాడు. అందులో షూలు తయారుచేస్తాడు. అందుకోసం పది ప్లాస్టిక్ సంచులు, పన్నెండు ప్లాస్టిక్ బాటిల్స్ వాడాడు. అయితే ఆ ప్లాస్టిక్ వేస్ట్‌ని కలెక్ట్ చేయడానికి ఒక టీంని పెట్టుకున్నాడు. వాళ్లు వీధుల్లో, షాపుల్లో ఉండే ప్లాస్టిక్ వేస్ట్ సేకరిస్తారు. కవర్లను నీళ్లలో శుభ్రంగా కడిగి, వాటిని ఎండలో ఆరబెడతారు. తర్వాత కవర్లను పది లేయర్లుగా కట్ చేస్తారు. వాటిని హీట్ ప్రెస్‌లో పెట్టి ప్రెస్ చేస్తారు. ఆ ప్రొడక్ట్‌ని షూ తయారుచేసే కంపెనీలకు పంపిస్తారు.
పీవీసీ పైపులతో బుట్టలు
పాత పైపులు లేదా డ్యామేజ్ అయిన పైపులను ఏం చేస్తారు? అవి కూడా ప్లాస్టిక్‌వే. అందుకే ఇద్దరు అక్కాచెల్లెళ్లు వాటినే బిజినెస్‌గా మార్చుకున్నారు. పాడైన పైపుల్ని సన్నని తీగల్లా కట్ చేసి, వాటితో బుట్టలు అల్లించి అమ్ముతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మో మొకోన్, మో మిషెల్ అనే ఇద్దరు సిస్టర్స్ కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు.
* * *
ఉచిత విద్యుత్
ఇప్పుడున్న జమానాలో ప్రతీది మెషిన్ వర్కే. అవి పనిచేయాలంటే కరెంట్ అవసరం ఎక్కువ. అందుకోసం సోలార్ పవర్ వాడుతున్న విషయం తెలిసిందే. కానీ, కొన్ని ఫ్యాక్టరీలు ఎలక్ట్రిసిటీని సొంతంగా తయారుచేసుకుని మరీ వాడుతున్నాయి. అది కూడా కోడి ఈకలతో, వడ్ల పొట్టుతో!
కోడి ఈకలతో...
మన జుట్టు, గోళ్లలో ఉండే కెరటిన్ అనే ప్రొటీన్ కోడి ఈకల్లో కూడా ఉంటుంది. ఏటా దాదాపు నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల కోడి ఈకలు పౌల్ట్రీల్లో తయారవుతున్నాయి. అవి కార్బన్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికర వాయువుల్ని రిలీజ్ చేస్తాయి. ఇటిహెచ్ జ్యూరిచ్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ సింగపూర్ శాస్త్రవేత్తలు ఈకల్లోని కెరటిన్‌ను తీసి, అమైలాయిడ్ ఫైబ్రిల్స్ అనే సన్నని ఫైబర్‌లుగా మార్చడానికి ఒక మెథడ్‌ని కనుగొన్నారు.
ఆ ఫైబ్రిల్స్ను హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్‌గా మార్చొచ్చు. చూడటానికి అవి పొరలుగా కనిపిస్తాయి. ఈ పొరలు ఎలక్ట్రాన్లను ఆపి, ప్రొటాన్లను మాత్రమే అనుమతిస్తాయి. దాంతో ఆ ఎలక్ట్రాన్లు యానోడ్ల నుంచి కాథోడ్లకు బయటి సర్క్యూట్ ద్వారా ప్రయాణించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఈకల్ని కాల్చడం వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్కు చెక్ పెట్టొచ్చు. కాబట్టి ఓవరాల్‌గా కార్బన్ ఫుట్ ప్రింట్ సైకిల్ తగ్గుతుందని ఇటిహెచ్ జ్యురిచ్ ప్రొఫెసర్ రాఫెల్ చెప్పారు.
వడ్ల పొట్టు విద్యుత్
నల్గొండ జిల్లా హాలియాలో ‘వజ్రతేజ రైస్ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో రైస్ మిల్ ఉంది. ఈ అతిపెద్ద పారాబాయిల్డ్ మిల్లును ఏడు ఎకరాల్లో వంద కోట్ల పెట్టుబడితో హై లెవల్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ధాన్యం మర ఆడించినప్పుడు వచ్చే పొట్టు ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తున్నారు. ధాన్యం మర ఆడించడం నుంచి ప్యాక్ చేసి లారీలో లోడ్ చేసేవరకు అన్నీ పనులు మెషిన్‌తో జరుగుతాయి.
ప్లాంట్ నిర్వహణకు గంటకు1.7 మెగా వాట్ల విద్యుత్ అవసరం. వడ్ల పొట్టు ద్వారా గంటకు1.3 మెగా వాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకి 31 మెగా వాట్లకు తగ్గకుండా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. టర్బైన్లలో తయారైన విద్యుత్‌ని కంట్రోల్ ప్యానెల్ ద్వారా తిరిగి ప్లాంట్ నిర్వహణకు వాడుతున్నారు. గంటకు 32 టన్నుల ధాన్యం మర ఆడించి రోజుకు 700 టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మారుస్తున్నారు. తేమ బియ్యం అయినా... టెక్నాలజీ వాడి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తారు. ప్లాంట్ నిర్వహణకు 300 కిలో లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. అందులో 210 లీటర్లను రీసైక్లింగ్ ద్వారా తిరిగి ప్లాంట్‌కే వాడుతున్నారు.
వాడి పడేసే వాటితో...
తిని, తాగి పారేసే వాటిలో చింతపిక్కలు, కూల్ డ్రింక్ సీసాల నుంచి అలంకరణకు వాడే పూల వరకు ఎన్నో ఉంటాయి. వాడిపోయిన పూలు కూడా పనికొస్తాయి తెలుసా? వీటితోనూ కాసులు కురిపించొచ్చు. భూమ్మీద చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు రకరకాల మార్గాల్లో ఇవి కొన్ని..
చింత గింజలు
కాకినాడ జిల్లా చేబ్రోలులో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొని, ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి, గింజలకు పైన ఉండే తొక్క తీసేసి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఒక టన్ను గింజల ధర దాదాపు పాతిక వేలు ఉంటుంది. చింత పిక్కలను ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పనిచేస్తాయి. చింత పండుని ఏడాదంతా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి గింజలు తీసి అమ్ముతారు. చింత గింజలను కేజీ ఐదు నుంచి ఎనిమిది రూపాయలకు కొంటున్నారు. తొక్కతీసిన గింజలైతే కేజీ 20 రూపాయలకు అమ్ముతారు.
ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్‌లో 240 డిగ్రీల వేడి నీళ్లతో క్లీన్ చేస్తారు. తర్వాత తొక్క తీసి బస్తాల్లో నింపుతారు. వాటిని పొడి చేసే ఫ్యాక్టరీకి పంపుతారు. ఆ పౌడర్ ఏ1, ఏ2, ఏ3, ఏ4 అని గ్రేడింగ్ చేసి జర్మనీ, జపాన్ ఇండోనేసియా, మలేసియా, టర్కీ, రష్యా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పొడి ధర కేజీ 400 ఉంటుంది. రంగులు చిక్కగా ఉండడానికి, పట్టు వస్త్రాలు మెరవడానికి, బట్టలు గంజి పెట్టేందుకు ఈ పొడి వాడతారు. మస్కిటో కాయిల్స్, కొన్ని రకాల మందుల తయారీలో, ప్లైవుడ్ షీట్స్, పేపర్, జూట్ పరిశ్రమల్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలో కూడా చింత గింజల పొడి ‘నేను ప్రజెంట్’ అంటోంది. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండడంతో వంటల్లో కూడా వాడుతున్నారు.
వరి పొట్టుతో ఫర్నిచర్
వడ్ల నుంచి బియ్యాన్ని వేరుచేశాక పొట్టు మిగిలిపోతుంది. మిగిలిన ఆ వరి పొట్టుని వేస్ట్ చేయకుండా దాంతో ఎకో ఫ్రెండ్లీ ఇన్నొవేషన్‌కి శ్రీకారం చుట్టారు ఐఐటీ ఖరగ్‌పూర్ స్టూడెంట్స్. వరి పొట్టును ప్రాసెస్ చేసి ఫర్నిచర్ తయారుచేశారు. ఇలా ఫర్నిచర్ తయారుచేస్తే అడవులు నరికే అవసరం రాదు. ఇదొక్కటే కాకుండా వరిపొట్టుకు అడ్హెసివ్స్, కెమికల్స్ కలిపి షీట్ తయారుచేశారు. ఆ షీట్‌తో బాల్ పెన్స్, కిచెన్ వేర్, పిచ్ బోర్డ్స్ చేశారు. ఇది కూడా ఎక్కువకాలం మనుగడలో ఉండే ప్రొడక్ట్. అలాగే దీనివల్ల పర్యావరణానికి హాని కలగదు.
ఆలయంలో పూలు.. నేచురల్ డైలు!
బిహార్‌కి చెందిన సోషల్ ఎంట్రప్రెనూర్ ప్రవీణ్ చౌహాన్. టెంపుల్స్‌ని బోలెడన్ని పూలతో అలంకరించడం చూసిన ప్రవీణ్‌కి ఒక ఆలోచన వచ్చింది. పూజకు వాడిన పూలను తరువాత బయటపడేస్తుంటారు. ఆ పూలతో నేచురల్ కలర్స్ చేయాలనే ఐడియా వచ్చింది. ఖాదీ బట్టల కోసం నేచురల్ కలర్స్ వాడాలి అనుకున్నాడు. దాంతో ఎం.ఎ.టి.ఆర్. సోషల్ ఎంటర్ ప్రైజ్ పేరుతో ఖాదీ కల్చర్, లోకల్ ఆర్టిస్ట్‌లని గౌరవిస్తూ ప్రమోట్ చేశాడు. అలా స్థానిక కళాకారులు, చేనేత కార్మికులతో ఆర్గనైజేషన్ నడిపాడు. అనుకున్నట్లే ఖాదీ కల్చర్‌ని న్యూయార్క్, ప్యారిస్, మిలాన్‌లో గ్లోబల్ ఫ్యాషన్‌గా మార్క్ వేశాడు. అలా పూల వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా ఉంది. స్థానికులకు ఉపాధి కూడా దొరికింది. ప్రస్తుతం మహభోది టెంపుల్లో ప్రతి రోజూ 200 కిలోల పూల వేస్ట్ రీసైకిల్ చేస్తోంది ఆ సంస్థ.
గ్లాస్ వేస్ట్‌తో ఇసుక
లూసియానాకు చెందిన ఫ్రాన్సిస్కా ట్రాట్మెన్ తన ఫ్రెండ్‌తో కలిసి 2020, ఫిబ్రవరిలో దీన్ని మొదలుపెట్టారు. ఒకరోజు కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి వైన్ తాగినప్పుడు గ్లాస్ వేస్ట్ గురించి డిస్కస్ చేశారట. గ్లాస్ వేస్ట్‌తో ఇసుక తయారుచేయొచ్చనే ఐడియా రాగానే గ్లాస్ వేస్ట్‌ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. గ్లాస్ వేస్ట్ కలెక్షన్ ఎక్కువ కావడంతో వేర్ ఇంటికి మారిపోవాల్సి వచ్చిందట వాళ్లకు. ఆ ఇంటి దగ్గరకి వచ్చి గ్లాస్ వేస్ట్‌ని ఇవ్వడం పెరిగింది.
అలా రాలేని వాళ్లు ట్రాన్స్‌పోర్టేషన్ డబ్బులు ఇచ్చి వేస్ట్‌ను తీసుకెళ్లమన్నారు. అలా తెచ్చిన గ్లాస్ వేస్ట్‌ని గ్రేడింగ్ చేసి ఇసుక తయారుచేస్తున్నారు. గ్లాస్ బాటిల్స్‌ని మెషిన్లో వేసి చిన్న ముక్కలుగా చేస్తారు. దాన్ని జల్లెడ పట్టే మెషిన్లో వేస్తే ఇసుక వస్తుంది. రవ్వల్లాగా ఉన్న ముక్కల్ని టైల్స్ మేకింగ్‌లో వాడుతున్నారు. ఈ ఇసుక బస్తాలను సముద్ర తీర ప్రాంతాల్లో నీటిని అడ్డుకునేందుకు వేస్తున్నారు.
స్టీల్ ఇలా..
రెన్యువబుల్ ఎనర్జీతో తయారైన హైడ్రోజన్‌ను వాడి గ్రీన్ స్టీల్ తయారుచేయొచ్చని ‘ఓహియో రివర్ వ్యాలీ’ ఇనిస్టిట్యూట్ చేసిన స్టడీ తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ స్టీల్ వాతావరణ పరంగా, ఆర్థికంగా కూడా మేలు చేస్తుంది. సాధారణంగా స్టీల్ తయారీలో కర్బన ఉద్గారాలు ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతాయి. అందుకని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ని వేరు చేసి దాన్ని స్టీల్ తయారీలో వాడతారు. అదే గ్రీన్ స్టీల్. అమెరికా 2050 నాటికి జీరో ఎమిషన్స్ టార్గెట్ దిశగా వెళ్తుంది కాబట్టి దానికి ‘గ్రీన్ స్టీల్’ తయారీ సాయపడుతుందని అనుకుంటున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే... మరెన్నో! ఆలోచన ఉంటే చెత్త నుంచి బంగారం తీయొచ్చు అనడానికి ఇవే నిదర్శనం. ప్రకృతిలో పనికిరానిదంటూ ఏదీ లేదు. కాస్త ఆలోచిస్తే అద్భుతాలు సృష్టించొచ్చు. అంతేకాదు.. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు ఒక్క ఐడియాతో రెండు విధాల మేలు జరుగుతుంది. ఒక వైపు చెత్తను రీసైకిల్ చేయొచ్చు. కొత్త సృష్టికి ప్రాణం పోస్తూ.. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
ఈ–వేస్ట్‌తో కళాఖండాలు
బెంగళూరుకు చెందిన విశ్వనాథ్ తండ్రి శంభు శిల్పి. పెయింటర్ కూడా. విశ్వనాథ్ మెడిసిన్ చదివి డాక్టర్ కావాలనుకున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ వస్తువులను కొత్తగా మార్చడం ఆయనకు ఇంట్రెస్ట్. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని డిసైడ్ అయ్యాడు. చదువు పూర్తయ్యాక కంప్యూటర్ వీడియో గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా చేరాడు. అలా విప్రోలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి వెళ్లాడు. ఖాళీ టైంలో, వీకెండ్స్‌లో ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను ఎకో ఆర్ట్‌గా ఎలా మార్చాలి? అని రీసెర్చ్ చేసేవాడు. అలా గాడ్జెట్స్ వేస్ట్‌తో చిన్న జంతువుల బొమ్మలు తయారుచేశాడు. అవి చూడ్డానికి బాగుండడంతో ఎకో ఆర్ట్‌ను డెవలప్ చేసుకున్నాడు. ఫ్యాషన్ జువెలరీ నుంచి శిల్పాలు, రోబోలు.. ఇలా అన్నీ ఈ–వేస్ట్‌తో తయారుచేస్తున్నాడు.
వీటి తయారీ కోసం కంప్యూటర్ విడి భాగాలు, ల్యాప్టాప్స్, డాటా కార్డ్స్, డీవీడీ, వీసీఆర్, ఫ్లాపీ డ్రైవ్స్, సెటాప్ బాక్స్‌లు, ల్యాండ్ లైన్, కార్డ్ లెస్ ఫోన్, గ్లూకో మీటర్లను తీసుకునేవాడు. వాటిలో రాగి, బంగారం, రంగుల వైర్లు, కీబోర్డులను సేకరించి బొమ్మలు తయారుచేసేవాడు. ఈ బొమ్మలు కొనే కస్టమర్లు విదేశాల్లో కూడా ఉన్నారు. జువెలరీ తయారుచేయడానికి నిమిషాలు పడితే, శిల్పాల తయారీకి వారాలు, నెలలు పడుతుంది. పర్యావరణానికి హాని కలగకుండా చేస్తున్న ఈ ఎకో ఆర్ట్ ఎంతో సంతృప్తినిస్తుంది అంటాడు ఆయన.
స్కేట్ బోర్డ్ వేస్ట్‌తో...
మేపుల్ ట్రీ చెక్క ఏడు లేయర్లతో చాలా గట్టిగా ఉంటుంది. ఆ చెట్లను చూశాక మేపుల్ చెక్క వాడి తయారు చేసే స్కేట్ బోర్డ్లను రీసైకిల్ చేయొచ్చనే ఆలోచన వచ్చింది ఆడ్రియన్, మార్టినెజ్ అనే ఇద్దరు అన్నదమ్ములకి. ఈ ఇద్దరూ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్లు. ప్రతి ఏటా 20 లక్షల స్కేట్ బోర్డ్ వేస్ట్ వస్తోంది. పదేండ్లుగా స్కేట్ బోర్డ్స్ వేస్ట్‌ని రీసైకిల్ చేస్తున్నారు. వాటికోసం మార్టినెజ్ ప్రతి రోజు షాపులకు వెళ్లి విరిగిపోయిన స్కేట్ బోర్డ్స్ పట్టుకొస్తాడు. వాటిని ఇద్దరు అన్నదమ్ములు కలిసి కట్ చేసి, చెవి రింగులు, టేబుల్స్, డెకరేటివ్ ఐటమ్స్, వంటపాత్రలు తయారుచేస్తారు.
ప్లేట్ కూడా తినేలా!
తెలంగాణకు చెందిన ఒక ఎంట్రప్రెనూర్ ‘బేకే’ పేరుతో ఒక కంపెనీ పెట్టాడు. అది ఎకో–ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో ఎడిబుల్ కట్లెరీ తయారుచేస్తున్నాడు. అందులో కూడా మూడు రకాలున్నాయి. ఒకటి నార్మల్, రెండోది స్వీట్, మూడోది సేవరీ. వీటిని గోధుమలు, ఉప్పు, మిల్లెట్స్‌తో కలిపి తయారుచేస్తున్నారు. అంతేకాదు చక్కెర నుంచి అల్లం – దాల్చినచెక్క, పుదీనా – అల్లం, నల్ల మిరియాలు వంటి ఫ్లేవర్స్‌లో ఇవి దొరుకుతున్నాయి. ప్లేట్లే కాదు.. స్పూన్స్, ఫోర్క్‌లు కూడా ఎంచక్కా తినొచ్చు. వాటిని వేడి లేదా చల్లటి పదార్థాల్లో పెట్టినా విరిగిపోవు, కరిగిపోవు, వంగిపోవు. వీటిని తినే పదార్థాలతో చేశారు. కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండవేమో అనుకుంటే పొరపాటు. ఇవి ప్రిజర్వేటివ్ – ఫ్రీ, అంటే మూడేండ్ల వరకు పాడుకావు. ఇంత అద్భుతమైన ఆవిష్కరణ వెనక ఉన్న టెక్నాలజీ ఏంటంటే.. ఎండబెట్టడం, గట్టిపడ్డాక ఎక్కువ టెంపరేచర్లో బేకింగ్ చేయడం. దీనివల్ల ముడి పదార్థంలో నీటి శాతం తగ్గి ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉంటుందన్నమాట!
పనస పండుతో ఐస్ క్రీం కోన్
పనసపండుని నేరుగా తింటారు. లేదంటే స్వీట్ వెరైటీలేవో చేసుకుని తినడం కూడా తెలిసిందే. కానీ, పనసపండుతో ప్లేట్స్ తయారుచేయొచ్చు తెలుసా! ఆ ప్లేట్‌ని వాడుకోవచ్చు. తరువాత తినేయొచ్చు. నిజానికి ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వాళ్లు ఎకో–ఫ్రెండ్లీ కట్లెరీ తయారుచేయాలనే ఆలోచనతో పనసపండు ఎంచుకున్నారు. అయితే దీనికంటే ముందే గోధుమ, మొక్కజొన్న పిండితో తయారుచేసిన కోన్స్‌లో మిల్లెట్ ఐస్‌క్రీమ్ పెట్టే ఆలోచన చేశారు. అయితే, వాటితో పోలిస్తే పనసపండుకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. పైగా హెల్దీ. అందుకే ఆ కోన్స్కు బదులు పనసపండు కోన్స్ తయారుచేశారు. ఆ తర్వాత ప్లేట్ తినేలా తయారు చేశారు.
- మనీష పరిమి