- రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సర్కార్ ఫోకస్
- ఏటా 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా మెగా మాస్టర్ ప్లాన్
- పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన
- అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటు
- ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్
- ఐటీ, ఫార్మా, హెల్త్ , ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్ క్లస్టర్లుగా విభజన
- అమెరికా, సౌత్ కొరియా టూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి
- రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పర్యటన
- ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బడా కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించడంతో పాటు స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. కేవలం ఒకట్రెండు రంగాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.
ఇందులో భాగంగానే నాలుగైదేండ్లకు షార్ట్‌టర్మ్ ప్రణాళికతో పాటు 2050 మెగా మాస్టర్ ప్లాన్కూడా రూపొందించింది. తద్వారా ప్రైవేట్ సెక్టార్లో ఏటా కనీసం10 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూములు, వాతావరణ పరిస్థితులకు తోడు తాము ఇస్తున్న సత్వర అనుమతులు, ఇతరత్రా ప్రోత్సాహకాలు కలిసివస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.
రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీలు నెలకొల్పేందుకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు బయలుదేరారు. ఆయా దేశాల్లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. తిరిగి ఈ నెల 14న హైదరాబాద్ చేరుకోనున్నారు.
తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే ముందుగా రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మెట్రో రెండోదశ విస్తరణ, మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పరిధిలోని 300 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో జినోమ్‌వ్యాలీ ఏర్పాటు చేస్తున్నది.
అదే సమయంలో లక్ష కోట్ల పెట్టుబడితో 10 ఫార్మా విలేజీలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గత ప్రభుత్వాలు అనుసరించిన కేంద్రీకృత విధానాల వల్ల పారిశ్రామికాభివృద్ధి మొత్తం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఏరియాలకే పరిమితమైంది. దీని వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించిన సర్కార్.. కొత్త పరిశ్రమలను హైదరాబాద్ నుంచి పట్టణాలకు, రూరల్ఏరియాలకు విస్తరించాలని యోచిస్తున్నది.
ప్రధానంగా రాజధాని చూట్టూ 150 కిలో మీటర్ల పరిధిలో ఓఆర్ఆర్నుంచి ట్రిపుల్మధ్య ఇండస్ట్రియల్కారిడర్ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నది. ఈ ప్రాంతంలో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టించేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇండస్ట్రీస్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి అమెరికా, సౌత్‌కొరియా టూర్ కు బయలుదేరారు.
ఈ ఏడాది జనవరిలో సీఎం దావోస్పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో.. అదే ఊపులో బయోఏషియా సదస్సును కూడా ప్రభుత్వం సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. ఇక ఇప్పుడు చేపడుతున్న విదేశీ పర్యటనల ద్వారా రూ.16 వేల కోట్ల పెట్టుబడులు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
పల్లెల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు..
రాష్ట్రాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్... ఇలా మూడు భాగాలుగా విభజించి ఇండస్ర్టీల ఏర్పాటును ప్రోత్సాహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనుంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతం అర్బన్ క్లస్టర్ గా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ క్లస్టర్ గా, ట్రిపుల్ ఆర్ తర్వాతి ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు అందించనుంది.
మూడేండ్లలో ట్రిపుల్ ఆర్ పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. దాని అవతల ఉన్న ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా భారీ పెట్టుబడులకు ప్లాన్చేస్తున్నది. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు మౌలిక వసతుల దృష్ట్యా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలనే ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం రూరల్ప్రాంతాలకు సైతం రవాణా సదుపాయాలు మెరుగుపడడం, హైదరాబాద్‌తో పోలిస్తే శాంతిభద్రతల సమస్యలు లేకపోవడంతో ఇతర జిల్లాల వైపు పారిశ్రమికవేత్తలు మొగ్గు చూపుతున్నారు.
ఇదే అవకాశంగా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీఎస్‌ఐఐసీ ద్వారా భూముల కేటాయింపుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. మరోవైపు సర్కార్ కొత్తగా సోలార్ పవర్ పాలసీ రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా గ్రీన్ఎనర్జీని వాడే పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.
పెట్టుబడి.. అభివృద్ధి.. ఉపాధి..
పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీలు రూపొందిస్తున్నది. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో ఆరు గ్యారంటీల మాదిరి ఆరు పాలసీల రూపకల్పనపై దృష్టిపెట్టింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ఎక్స్పోర్ట్, న్యూలైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్టూరిజం, గ్రీన్ఎనర్జీ పాలసీలను రెడీ చేస్తున్నది. ఇందులో భాగంగా ‘పెట్టుబడి.. అభివృద్ధి.. ఉపాధి’ అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా టూర్‌కు బయలుదేరారు.
ఈ సందర్భంగా పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కాగ్నిజెంట్ సీఈవో సహా ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులు.. ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్ వో సంస్థ సీఈవో శైలేశ్ జెజురికర్, ర్యాపిడ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. ఈ నెల 6న పెప్సికో, హెచ్‌సీఏ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు, ట్రినెట్ సీఈవో, ఆరమ్, ఆమ్‌జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో చర్చిస్తారు.
సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో పాటు గూగుల్ సీనియర్ ప్రతినిధులు, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్, సామ్‌సంగ్, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరపనుంది.