
- గతేడాది అక్టోబర్‌లోనే రెడ్ కార్నర్ నోటీస్ ప్రాసెస్ ప్రారంభం
- ఇంటర్‌పోల్ అనుమానాలను నివృత్తి చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. విదేశాల్లో తలదాచుకున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావును ఇండియాకు రప్పించడంలో రాష్ట్ర పోలీసులకు సీబీఐ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. దీంతో ప్రతివారం సీఐడీ ద్వారా రిమైండర్లు పంపుతున్నారు. వీలైనంత త్వరగా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
అయినప్పటికీ రెడ్‌కార్నర్ నోటీసుల జారీలో జాప్యం జరుగుతున్నది. దీంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మరోసారి ఆశ్రయించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేరస్తులుగా ప్రకటించే ప్రక్రియ( ప్రొక్లమెషన్)పై మరోసారి కోర్టును ఆశ్రయించనున్నారు. రాష్ట్ర సీఐడీ ద్వారా సీబీఐకి మరో రిమైండర్ పంపించనున్నారు.
అక్టోబర్‌లోనే రెడ్ కార్నర్ ప్రాసెస్
ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతోపాటు శ్రవణ్‌రావును ఇండియాకు రప్పించేందుకు నిరుడు జూన్‌లోనే రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర పోలీసులు అందించిన కేసు డాక్యుమెంట్ల ఆధారంగా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు సీబీఐ సిఫార్సు చేసింది. అక్టోబర్, నవంబర్‌లోనే ఇంటర్‌పోల్ అధికారులు రాష్ట్ర పోలీసుల నుంచి వివరాలుసేకరించారు. ఇందుకు సంబంధించి ఇంటర్‌పోల్ లేవనెత్తిన పలు ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు ఇచ్చారు.
కేసుకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేశారు. ఆ తర్వాత రెడ్‌కార్నర్ నోటీసులపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇతర మార్గాల్లో లాబియింగ్ చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో రెడ్‌కార్నర్ జారీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిసింది.