కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేశాయ్.. ఇక నుంచి సిగ్నల్స్ దగ్గర ఎలా ఉండాలి అనేది ప్రభుత్వం డిసైడ్ చేసింది. మన హైదరాబాద్ లో కాదండీ.. ఢిల్లీలో. చలికాలం ప్రారంభం కావటంతో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అమాంతం పెరిగింది. గాలి నాణ్యత పడిపోయింది. ఈ క్రమంలోనే రోడ్డెక్కే బండ్లు, కార్లు, ఆటోలు, బస్సులకు కొత్త రూల్ తీసుకొచ్చింది. రెడ్ సిగ్నల్ పడింది అంటే.. మీ బండ్లు ఆపేయాలి.. ఇంజిన్ ఆఫ్ చేయాలి. గ్రీన్ సిగ్నల్ పడగానే.. బండ్లు స్టార్ట్ చేసి ముందుకు కదలాలి. రెడ్ సిగ్నల్.. ఇంజిన్ ఆఫ్ ఈ విధానం ద్వారా.. పొల్యూషన్ తగ్గించొచ్చు అని సరికొత్త ఆలోచనతో.. అమలుకు సిద్ధం అయ్యింది కేజ్రీవాల్ సర్కార్.
ఇప్పటికే ఢిల్లీలో గాలిలో పొల్యూషన్ శాతం ప్రమాదకర స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో పొగ మంచు, తేమ గాలులతో అత్యంత ప్రమాదకర స్థితికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 26వ తేదీ నుంచి సరికొత్త రూల్ అమల్లోకి తీసుకొచ్చింది. సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ ఉంటే.. బండి ఇంజిన్ ఆఫ్ చేయండి నినాదంతో.. అమల్లోకి తీసుకురానుంది. అది బైక్ అయినా.. కారు అయినా.. క్యాబ్ అయినా.. బస్సు అయినా.. ఆటో అయినా సరే.. రెడ్ సిగ్నల్ పడింది అంటే చాలు.. బండి ఆఫ్ చేయాల్సిందే. ప్రజల్లో అవగాహన కోసం 26వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతోపాటు.. అమలు చేయనుంది ఢిల్లీ సర్కార్.
ఢిల్లీలో గాలిలో నాణ్యత అంశంపై 28 శాఖలు కలిసి ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో ఈ నిర్ణయానికి వచ్చారు అధికారులు. ఢిల్లీ, నోయిడాతోపాటు మొత్తం 300 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా ఉందని.. దీన్ని సరిచేసేందుకు ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.