48 ఎంపీ కెమెరాతో షావోమీ కంపెనీ రిలీజ్ చేసిన ‘రెడ్ మి నోట్7 ప్రొ’ భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. 48 ఎంపీ కెమెరాతో ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చిన తొలి ఫోన్ కూడా ఇదే. కేవలం కెమెరా కోసమే ఎక్కువమంది యూజర్లు ఈ ఫోన్ కొనుక్కున్నారు. అందుకే కెమెరాపై మరింత దృష్టిపెట్టిన షావోమీ సంస్థ త్వరలో ఇంతకంటే మంచి కెమెరా ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ‘రెడ్ మి నోట్7 ప్రొ’కు అప్డేటెడ్ వెర్షన్‌గా, మరిన్ని అదనపు ఫీచర్లతో ‘రెడ్మి నోట్8’ను విడుదల చేయనుంది. 64 ఎంపీ కెమెరా కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
‘సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్జిడబ్ల్యూ1 సెన్సర్’ను ఉపయోగించి ఈ కెమెరాను తయారు చేస్తున్నారు. ఈ కెమెరాతో తీసే ఒక్కో ఫొటో కనీసం 20 ఎంబీ సైజు ఉంటుంది. ఫొటోలు, వీడియోలు 8కె టీవీలో ప్లే అయ్యే రెజల్యూషన్కంటే మరింత క్వాలిటీ కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. గత బుధవారం చైనాలో ఈ ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. మన దేశంలో ఈ ఫోన్ విడుదలయ్యేందుకు ఇంకొంచెం టైమ్ పడుతుంది. షావోమీతో పాటు ‘సామ్సంగ్, రియల్‌మి’ సంస్థలు కూడా 64 ఎంపీ కెమెరా ఫోన్లను తయారు చేస్తున్నట్లు చెప్పాయి. వీటిలో ఏది ముందుగా మార్కెట్లోకి వస్తుందో చూడాలి.