రెడ్​మీట్​తో టైప్​2 మధుమేహం

  • రోజూ 100 గ్రాములు తినేటోళ్లకు రిస్క్ 10 %  ఎక్కువ.. లాన్సెట్​ స్టడీలో వెల్లడి

న్యూఢిల్లీ: మాంసాహారులకు మరీ ముఖ్యంగా ‘ముక్క లేనిదే ముద్ద దిగదు’ అనే టైప్ వారు టైప్ 2 మధుమేహం బారిన పడే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. రోజూ 100 గ్రాముల రెడ్​మీట్​(మటన్, బీఫ్, పోర్క్..) తినేవాళ్లలో టైప్ 2 మధుమేహం ముప్పు 10% పెరుగుతోందని బయటపడింది.

ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో 19 లక్షల మంది ఆహారపు అలవాట్లకు సంబంధించిన పదేళ్ల డాటాను స్టడీ చేసినట్లు సైంటిస్టులు తెలిపారు. అమెరికా, యూకే, బ్రెజిల్, మెక్సికో తదితర దేశాలకు చెందిన పరిశోధకులు ఓ టీమ్​గా ఏర్పడి ఈ స్టడీ నిర్వహించారు. ఫలితాలను లాన్సెట్ జర్నల్ తాజాగా ప్రచురించింది.

పదేళ్ల డాటాపై అధ్యయనం..

గతంలో జరిగిన వివిధ పరిశోధనల ద్వారా సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేసినట్లు సైంటిస్టులు తెలిపారు. మాంసాహారం అతిగా తీసుకుంటే అనారోగ్యాలు చుట్టుముడతాయని, అందులో మధుమేహం ఒకటని చెప్పారు. అయితే, మాంసాహారంలో టైప్ 2 మధుమేహం ముప్పుకు కారణమయ్యే మాంసాన్ని గుర్తించేందుకు ఈ స్టడీ చేపట్టామన్నారు. పదేళ్ల డేటాను నిశితంగా పరిశీలించాక ప్రాసెస్డ్ మీట్​(నిల్వ చేసిన మాంసం) తీసుకునే వారిలో మధుమేహ ముప్పు మరింత ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు.

రోజూ 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్​ తీసుకునేవారికి మధుమేహం ముప్పు 15% ఎక్కువని, రోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకునే వారికి ఈ ముప్పు 10%, రోజూ 100 గ్రాముల చికెన్ తీసుకునే వారికి 8% ఎక్కువని తమ స్టడీలో తేలిందన్నారు. 20 లక్షల మందికి సంబంధించిన డేటా పరిశీలించిన విషయం గుర్తుచేస్తూ.. ఆ తర్వాతి కాలంలో వారిలో లక్ష మంది టైప్ 2 మధుమేహం బారిన పడ్డారని తెలిపారు. మెరుగైన ఫలితాల కోసం ప్రపంచంలోని వివిధ భౌగోళిక పరిస్థితులు ఉండే 20 దేశాలకు సంబంధించిన డేటాను ఎంచుకుని పరిశోధన చేశామని వివరించారు.

ప్రాసెస్డ్ మీట్​ను రిప్లేస్ చేస్తే..

రోజూ 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ తినేటోళ్ల కు 100 గ్రాముల అన్ ప్రాసెస్డ్ రెడ్ మీట్ ఇచ్చి చూడగా.. మధుమేహ ముప్పు 7% తగ్గిందని సైంటిస్టులు చెప్పారు. అదేవిధంగా 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్​కు ప్రత్యామ్నాయం గా 100 గ్రాముల చికెన్ ఇచ్చినపుడు మధుమేహం ముప్పు ఏకంగా 10 శాతం తగ్గుతోందన్నారు. అయితే, రెడ్ మీట్ కు బదులుగా చికెన్ తీసుకుంటే డయాబెటిస్  రిస్క్ తగ్గుతుందా లేదా అనేది చెప్పలేమని, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొన్నారు.