- పార్టీలో ఎంట్రీకి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కు రెడ్ సిగ్నల్
- చేర్చుకునేందుకు ఇష్టపడని పార్టీ హైకమాండ్
- ముందస్తు హామీతోనే బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఇద్దరు లీడర్లు
- తీరా ఇప్పుడు ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్న నాయకులు
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదని.. ఆ పార్టీకి రాజీనామా చేసిన కరీంనగర్ జిల్లా లీడర్లు ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తమ పార్టీలో చేరండని ఆహ్వానించిన కాంగ్రెస్ పెద్ద లీడర్లే ఇప్పుడు ముఖం చాటేయడంతో తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత కరీంనగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆ పార్టీకి రిజైన్ చేశారు. వీరిద్దరితో పాటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మరో నేత, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరాలని భావించారు. అయితే కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్లకు ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొనడంతో.. మళ్లీ కొత్త లీడర్లను తీసుకుని అడ్జస్ట్ చేయలేమన్న ఉద్దేశంతో ఆ పార్టీ పెద్దలు ఒప్పుకోలేదని తెలిసింది. అంతేకాకుండా.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు బీఆర్ఎస్లో చేరడంపై హైకమాండ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు.
జైపాల్ రెడ్డికి మాత్రమే చాన్స్..
జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారిలో కేవలం మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డిని మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించడంతోపాటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీతోనే ఆయన పార్టీలో చేరినట్లు తెలిసింది. బీఆర్ఎస్ మానకొండూరు టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కూడా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు సంప్రదింపులు జరిపినా.. రేవంత్ రెడ్డి అడ్డుచెప్పినట్లు సమాచారం. ముందు బీఆర్ఎస్కు రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. తీరా రిజైన్ చేశాక ముఖం చాటేయడంతో సదరు నేతలు షాక్‌కు గురయ్యారు.
ఇతర పార్టీల వైపు చూపు..
కాంగ్రెస్ డోర్లు క్లోజ్ చేయడం తో ఆరెపల్లి మోహన్, సంతోష్ కుమార్, పురుమళ్ల శ్రీనివాస్ ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మానకొండూరు నుంచి బరిలో తప్పనిసరిగా ఉంటానని ఆరేపల్లి మోహన్ ఇప్పటికే ప్రకటించారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాన ని సంతోష్ కుమార్ కూడా స్పష్టంచేశారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం బీఆర్ఎస్లో ఉన్నప్పుడే పురుమల్ల శ్రీనివాస్ అప్లై చేసుకున్నారు. కానీ ఈ ముగ్గురికి కాంగ్రెస్‌లో చాన్స్ రాకపోవడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లడమో.. ఇండిపెండెంట్ గా పోటీ చేయడమో తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.