ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో రెడ్డి రాజకీయాలు షురువయ్యాయి. ఒకప్పుడు జిల్లాలో ఈ సామాజిక వర్గం నేతలు అన్ని పార్టీలను శాసించారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి ప్రాబల్యం తగ్గిపోతూ వచ్చింది. కాగా ఆదిలాబాద్ లో మరోసారి రెడ్డి రాజకీయం తెరపైకి వస్తోంది. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రాంచంద్రా రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభ బాధ్యతలు తీసుకుని విజయవంతం చేశారు. రేవంత్ రెడ్డి సభ తర్వాత కాంగ్రెస్ లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ముందు నుంచి రేవంత్ తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బలమైన నేతలను ముందుండేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ సభ నిర్వహణ ఏర్పాట్లు మొత్తం సీనియర్ నేతకు ఇవ్వడంతో పాటు పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలకు చెక్ పెట్టారు. ఈ సభతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం రేవంత్ వర్గం నేతలు యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ సారి టికెట్ పై గురి..
ఈ సారి కాంగ్రెస్ నుంచి ఎలాగైనా రెడ్డి సామాజికవర్గం నేతనే ఎమ్మెల్యే గా బరిలో దింపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు దఫాలుగా బీసీలకు టికెట్ ఇచ్చిన పార్టీ ఈ సారి మాత్రం రేవంత్ రెడ్డి రాకతో పార్టీ టికెట్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీసీ మహిళ నేత గండ్రత్ సుజాత కు టికెట్ దక్కింది. 2009 తర్వాత రెడ్డి సామాజికవర్గం నుంచి నాయకత్వమే కాకుండా ఎన్నికల్లోనూ పార్టీ నుంచి పోటీ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ సామాజికవర్గం నుంచి సీనియర్ నేత అల్లుడిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ కేటాయించే విషయంలోనూ సీనియర్ నేతకే బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇదే జరిగితే టికెట్ పై ఆశలు పెట్టుకున్న గండ్రత్ సుజాతతో పాటు, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కు నిరాశే మిగులుతుంది. ఇటీవల జరిగిన రేవంత్ సభలో మహిళ నేతకు అవమానం జరగడంతో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వర్గపోరుతో జిల్లాలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ కు ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎక్కడికి దారితీస్తుందనే చర్చ జోరుగా
సాగుతోంది.
ఉనికి కోసం ఆరాటం..
కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను శాసించింది. పది నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక పక్క వర్గపోరు మరోపక్క ప్రజల్లో పట్టు కోల్పోయి సతమతమవుతున్నారు. సరైన నాయకత్వం లేకపోవడం దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ 'రెడ్డి ' రాజకీయం ఆదిలాబాద్ లో ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. పూర్వ వైభవం కోసం ఆరాటపడుతున్న పార్టీకి రేవంత్ రాకతో జోష్ వచ్చినట్లయింది. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలపై రేవంత్ ముందునుంచే ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇటీవల నిర్మల్ జిల్లా నుంచి కీలక నేత మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఆయన వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంతో పాటు తనకు వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆధిపత్యానికి చెక్ పెట్టడంపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఒక పక్కవర్గ పోరు లేకుండా చూసుకోవడం .. మరోపక్క పార్టీ బలోపేతంపై సీనియర్లను రంగంలోకి దించుతున్నారు. ఇతర పార్టీలో ఉన్న తమ సామాజికవర్గ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.