తిరుపతిలో భారీగా ఎర్రచందనం పట్టివేత.. 15 మంది అరెస్ట్

తిరుపతి జిల్లాలో  పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగతనానికి పాల్పడుతున్న 15 మంది ఎర్రచందనం దొంగల ముఠాను రేణిగుంట ఆంజనేయపురం చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.  బాకరాపేట, రైల్వే కోడూరు పరిధిల్లోని మూడు ప్రాంతాల్లో 40ఎర్రచందనం దుంగలు, ఒక బొలేరో లగేజి వాహనం, రెండు కార్లు, రెండు మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగంపేట నాగపట్ల సెక్షన్ భాకరాపేట రేంజిలో కూంబింగ్ చేపట్టగా, కల్యాణి డ్యామ్ వద్ద కొందరు వ్యక్తు ఎర్రచందనం దుంగలు బొలెరోలో ఎక్కిస్తున్నారు. దీంతో వారిని చుట్టుముట్టి  ఐదుగురిని అరెస్టు చేశారు. రంగంపేటకు చెందిన చిరంజీవి(25), సుబ్రమణ్యం (32), రాజశేఖర్ (30), మురళి (28)లతో పాటు తమిళనాడుకు చెందిన రాజ్ కుమార్ (40) లను నిందితులుగా గుర్తించారు.  డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు అధ్వర్యంలోని ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, కృపానందలకు చెందిన మూడు టీమ్ లు గురువారం  ( అక్టోబర్ 12) కూంబింగ్, వాహనాల తనిఖీలు చేశారు. 


 మరో కేసులో ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ టీమ్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్ తో కలసి రేణిగుంట సమీపంలోని మామండూరు సెక్షన్ ఆంజనేయపురం చెక్ పోస్టు వద్ద వాహనాలను తనఖీ చేశారు. టాస్క్ ఫోర్సు సిబ్బందిని చూడగానే రెండు వాహనాలు దూరంగా  ఆపివేసి ... కొంతమంది పారిపోతుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు.  నిందితుల నుంచి ఐదు  ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన వారిలో అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన భీము చంద్రశేఖర్ రెడ్డి (45), మాసపల్లి సుధాకర్ (37),  రాజంపేట మండలం కత్తి మనోహర్(33), తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాకు చెందిన సత్యరాజ్ (29), జయరామన్ పిచ్చన్ (36), వేలాయుధన్ తిరుమలై(34), అళగేషన్  పూవండి (32), పొన్నుసామి రామస్వామి(37), బాలమురుగన్ ఆండిదేవర్ (29)లుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిని నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

మూడవ కేసులో ఆర్ఎస్ఐ ఆలీబాషా టీమ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో కేవీ బావి పల్లి దగ్గర  అదే గ్రామానికి చెందిన తుపాకుల చెంగల్ రాయలు (34) వద్ద డంప్ చేసిన 12ఎర్రచందనం దుంగలు లభించాయి. అతనిని కూడా అరెస్టు చేసి తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బంది  పోలీసు స్టేషన్ కు తరలించారు.  మూడు టీమ్ లు చాకచక్యంగా వ్యవహరించడంతో ఎర్రచందనం దుంగలను పట్టుకోగలిగినట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఎర్రచందనం దుంగలు టన్నుకు పైగా ఉన్నాయని తెలిపారు. వాహనాలతో కలపి వాటి విలువ కోటి  రూపాయిలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తు్న్నారు.   ఆపరేషన్ లో పాల్గొన్న టీమ్ లకు కర్నూలు రేంజి డీఐజీ, టాస్క్ ఫోర్సు ఇన్చార్జి సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించారు. 

ALSO READ : పొన్నాల చేరతానంటే ఇంటికెళ్లి ఆహ్వానిస్తా : కేటీఆర్‌