లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు 25 ఏళ్లు ఉండాలి. అలాగే రాజ్యసభ లేదా రాష్ట్ర శాసన మండలిలో సభ్యునిగా పోటీ చేయాలంటే మాత్రం 30 సంవత్సరాలు తప్పనిసరి.
18 ఏళ్లకే ఓటుహక్కు కల్పిస్తున్నందున పోటీకి వయోపరిమితిని 18 ఏళ్లకు తగ్గించాలంటూ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాల పద్ధతులను పరిశీలించిన తర్వాత జాతీయ ఎన్నికలలో అభ్యర్థిత్వానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలని కమిటీ సూచించింది. దీంతో కేంద్రం కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించి వయస్సు తగ్గించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ లో జరిగే ఎన్నికల ప్రక్రియలో యువత విశ్వసనీయమైన మరియు బాధ్యతాయుతమైన రాజకీయ భాగస్వాములు కాగలరని, కాబట్టి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే కనీస వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.