అకాల వర్షాలు.. తగ్గిన ఏసీ అమ్మకాలు

అకాల వర్షాలు.. తగ్గిన ఏసీ అమ్మకాలు

 

న్యూఢిల్లీ: ఎండలు తగ్గిపోవడంతో ఏసీలకు డిమాండ్ పడిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో ఏసీల అమ్మకాలు 15 శాతం (ఏడాది ప్రాతిపదికన) తగ్గాయని  ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ నెల చివరిలో, మే ప్రారంభంలో అకాల వర్షాలు పడడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లకు డిమాండ్‌‌‌‌ తగ్గిపోయింది. సాధారణంగా ఏప్రిల్‌‌‌‌, మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈసారి వర్షాలు పడుతుండడంతో  వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.  పానాసోనిక్‌‌‌‌, గోద్రెజ్‌‌‌‌, డైకిన్ వంటి కంపెనీలు  సేల్స్ పుంజుకుంటాయని నమ్ముతున్నాయి. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని, సమ్మర్ సీజన్‌‌‌‌ సాధారణ స్థాయికి చేరుకుంటుందని  భావిస్తున్నాయి. 

నార్త్ ఇండియాలో డౌన్‌‌‌‌

‘ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో వాతావరణం చల్లగా ఉంది. అందుకే కిందటేడాది ఏప్రిల్‌‌‌‌తో పోలిస్తే తక్కువ అమ్మకాలు జరిగాయి. చాలా మంది కస్టమర్లు తమ ఏసీ కొనుగోళ్లను  వాయిదా వేస్తున్నారు’ అని పానాసోనిక్‌‌‌‌ లైఫ్ సొల్యూషన్స్‌‌‌‌ ఇండియా బిజినెస్ హెడ్‌‌‌‌ గౌరవ్‌‌‌‌ షా పేర్కొన్నారు. ఇంకా సమ్మర్ పూర్తి కాలేదని,  అమ్మకాలు పుంజుకుంటాయని నమ్ముతున్నామని వెల్లడించారు. నార్త్ ఇండియాలో అకాల వర్షాలు కురవడంతో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల సేల్స్ తగ్గాయని కన్జూమర్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్ అప్లియెన్సెస్‌‌‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌ అసోసియేషన్ (సీమా) పేర్కొంది. తూర్పు, దక్షిణ భారతంలో  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ వరకు మంచి గ్రోత్ చూశామని  ఈ సంస్థ ప్రెసిడెంట్‌‌‌‌ ఎరిక్‌‌‌‌ బ్రగాంజా అన్నారు. పశ్చిమ భారత దేశంలో సేల్స్ ఫ్లాట్‌‌‌‌గా రికార్డయ్యాయని వెల్లడించారు. ఈ సమ్మర్ సీజన్‌‌‌‌లో గ్రోత్ ఎలా ఉంటుందనేది మే నెలలో తెలుస్తుందని వివరించారు. అంచనాలకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు పెరిగితే  కంపెనీల  దగ్గర నిల్వలు తగ్గుతాయని  అన్నారు.  వాతావరణంలోని ఉష్ణోగ్రతలపై ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలు ఆధారపడతాయని గోద్రెజ్‌‌‌‌ అప్లియెన్సెస్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ హెడ్‌‌‌‌  కమల్ నంది పేర్కొన్నారు.

ఈ ఏడాది మే నెలలో హీట్‌‌‌‌వేవ్స్ వస్తాయని, సమ్మర్ సీజన్‌‌‌‌ ఎక్కువ కాలం కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ‘వచ్చే నెలలో  ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనావేస్తున్నాం.  అదే జరిగితే  కూలింగ్ ప్రొడక్ట్‌‌‌‌లకు మే, జూన్ నెలల్లో డిమాండ్ పెరుగుతుంది’ అని  కమల్ నంది అంచనావేశారు.  ఏసీలు లగ్జరీ కాదని, అవసరమని, ఈ సెగ్మెంట్‌‌‌‌ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు.  తమ ఏసీ అమ్మకాలు పెరిగాయని వెల్లడించారు. ఒక టన్ను, 1.5 టన్నులు, 2 టన్నులు, విండో ఏసీలు ఇలా అన్ని సెగ్మెంట్లలో 5 స్టార్‌‌‌‌‌‌‌‌ ఏసీల వాడకం పెరిగిందని కమల్‌‌‌‌ నంది అన్నారు. ‘ హీట్ వేవ్స్ తిరిగి వచ్చినప్పుడు ఏసీ సేల్స్ పుంజుకుంటాయి. ఇంకో నెలలో ఈ పరిస్థితి కనిపించొచ్చు’ అని డైకిన్ ఏసీ ఇండియా చైర్మన్ కన్వల్జీత్‌‌‌‌ జావా పేర్కొన్నారు. దేశంలో తక్కువ మంది మాత్రమే ఏసీలు వాడుతున్నారని, ఈ సెగ్మెంట్‌‌‌‌ మరింతగా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని  అన్నారు.