యాదాద్రి, వెలుగు :సన్నాల వరి సాగు పెంచాలని సర్కార్ చెబుతుంటే రైతులు మాత్రం ఏటేటా ఆ వరి సాగును తగ్గిస్తున్నారు. సన్న వడ్ల అమ్మకంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ఈ పంట సాగుకు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుండడంతో ఈ వరి సాగు నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు. యాదాద్రి జిల్లాలో గత రెండు సీజన్లతో పోలిస్తే ఈ సారి సన్నొడ్ల సాగు భారీగా తగ్గింది. 2020 సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1,96,950 ఎకరాల్లో వరి సాగు జరుగగా ఇందులో 86,950 ఎకరాల్లో సన్నవడ్లు సాగయ్యాయి. తీరా కొనుగోలు టైంకు వచ్చే సరికి ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టింది. ఇక 2021సీజన్‌లో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఇందులో 54 వేల ఎకరాల్లో సన్నరకం సాగైంది. ఈ సారి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు నెలకొనడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. 2022 యాసంగిలో 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగైతే 23 వేల ఎకరాల్లో సన్నొడ్ల సాగు జరిగింది.
పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ
సన్న వడ్ల విత్తనాల ధర ఎక్కువగా ఉండడంతో పాటు, ఈ పంటకు చీడ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. దీంతో పురుగుల మందు వాడకానికి ఎకరానికి రూ. 5 వేల పెట్టుబడి పెరుగుతోంది. అలాగే దొడ్డు వడ్లు ఎకరానికి 25 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తే, సన్నాలు 5 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడే వస్తాయి. దీంతో పాటు సర్కారు కొనుగోలు సెంటర్లలో దొడ్డు రకానికి ఏ గ్రేడ్, సన్నాలకు బి గ్రేడ్‌గా పరిగణిస్తారు. దీంతో దొడ్డు రకానికి క్వింటాల్‌కు రూ.2,060 లభిస్తుండగా, సన్నాలకు రూ. 2,040 ఇస్తోంది. పైగా సన్నొడ్లను కొనేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రైతులు సన్నొడ్ల సాగునే తగ్గించుకున్నారు. ఈ సీజన్‌లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 3,00,156 ఎకరాల్లో వరి సాగు చేయగా ఇందులో కేవలం 20,234 ఎకరాల్లో మాత్రమే సన్నాలను సాగు చేశారు. గత సీజన్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం 33,766 వేల ఎకరాల్లో సన్నొడ్ల సాగు తగ్గింది.