బార్డర్ సరిహద్దుల్లో .. వైన్​ షాపులకు తగ్గిన డిమాండ్

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో వైన్​ షాపులకు  టెండర్లలో కొత్త ట్రెండ్​ కనిపిస్తోంది. గతం కంటే అప్లికేషన్ల సంఖ్య పెరిగినా,  ఏపీ సరిహద్దుల్లో షాపుల కోసం పోటీపడే వారి సంఖ్య మాత్రం తగ్గింది. రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలోఆ షాపులకు అత్యధిక సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. 2021 టెండర్లలో ఖమ్మం జిల్లాలో 122 షాపుల కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా 6212 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్యకు సుమారు వెయ్యి అదనంగా కలుపుకొని 7207 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం అర్థరాత్రి వరకు అప్లికేషన్లు తీసుకోవడంతో ఒక్కరోజే 2894 అప్లికేషన్లు వచ్చాయి.

గతంలో మధిర ఎక్సైజ్​   స్టేషన్​ పరిధిలో ఏపీకి సరిహద్దుల్లో ఉన్న రాజుపాలెం షాపు కోసం (షాపు నెంబర్​ 85) రాష్ట్రంలో అత్యధికంగా 121 అప్లికేషన్లు రావడంతో రికార్డుగా నమోదైంది. ఈసారి మాత్రం ఆ షాపు ఓపెన్​ కేటగిరీలో ఉన్నా కేవలం 59  అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి.  రెండేళ్ల క్రితం జిల్లాలో మొత్తం మూడు షాపుల కోసం 100కు పైగా అప్లికేషన్లు దాఖలయ్యాయి. వాటిలో రెండు చోట్ల ఈసారి దరఖాస్తుల సంఖ్య సగం కంటే తగ్గింది.  ఈసారి అర్బన్​ ప్రాంతాల్లో ఉన్న 8 షాపుల కోసం 100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఓపెన్ కేటగిరీ షాపుల కోసం ఎక్కువ దరఖాస్తులు రాగా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన షాపుల కోసం వచ్చిన అప్లికేషన్ల సంఖ్య తక్కువగా ఉంది. రిజర్వు షాపుల్లో ఒక్క చోట కూడా 100 అప్లికేషన్లు దాటలేదు. 

కారణం ఇదేనా..! 

జిల్లాలో ఏడు ఎక్సైజ్​   స్టేషన్లు ఉండగా, ఏపీకి బోర్డర్​ ఎక్కువగా ఉన్న సత్తుపల్లి, మధిర ఎక్సైజ్​   స్టేషన్ల పరిధిలో మాత్రం 2021లో కంటే అప్లికేషన్ల సంఖ్య తగ్గిపోయింది. సత్తుపల్లి స్టేషన్​ పరిధిలో 1318 నుంచి 1214కి అప్లికేషన్ల సంఖ్య తగ్గింది. మధిర స్టేషన్​ పరిధిలో 1286 నుంచి 982కి దరఖాస్తుల సంఖ్య పడిపోయింది. రెండేళ్ల క్రితం  టెండర్లను ఆహ్వానించిన సమయంలో ఏపీని ఆనుకొని ఉన్న ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్ల పరిధిలో భారీగా వ్యాపారం ఉండేది. ఏపీలో బ్రాండెడ్​ మద్యం లభించకపోవడం, అక్కడ మద్యం రేటు కూడా ఎక్కువగా ఉండడంతో సీక్రెట్ గా ఇక్కడి సరుకును బోర్డర్​ దాటించేవారు. కోట్లలో వ్యాపారం నడుస్తుండడంతో, గత టెండర్ల సమయంలో బోర్డర్​ షాపుల కోసం భారీగా టెండర్లు దాఖలయ్యాయి.

లైసెన్స్​ దక్కించుకున్న వారు కూడా వెంటనే రూ.కోటి కి పైగా గుడ్​ విల్ తీసుకొని ఇతరులకు షాపులను అప్పగించారు. తీరా వేలంపాట తరహాలో పాడి లైసెన్స్​ దారులనుంచి షాపులు తీసుకున్న తర్వాత ఏపీలో బ్రాండెడ్ లిక్కర్​ అందుబాటులోకి రావడం, ఏపీ గిరాకీ పూర్తిగా తగ్గిపోవడంతో గతేడాది నుంచి పూర్తిగా నిరాశపడ్డారు. గతంలో ఉన్న వ్యాపారం ఇప్పుడు లేకపోవడంతో, ఈసారి బోర్డర్​ షాపులకు డిమాండ్​ తగ్గింది. ఇక రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు, ఇతర వ్యాపారాల్లో  స్థిరపడిన వారు కొత్తగా లైసెన్సుల కోసం అప్లికేషన్లు వేయడం, తాము ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఉన్న షాపుల కోసం ఆసక్తి చూపడంతో అర్బన్ ప్రాంతాల్లోని దుకాణాలకే ఎక్కువ టెండర్లు దాఖలయ్యాయని ఎక్సైజ్​ అధికారులు చెబుతున్నారు.

రేపు లక్కీ డ్రా..!

మద్యం లైసెన్స్​ దారులు ఎవరో తేల్చేందుకు సోమవారం (ఈనెల 21న) డ్రా నిర్వహించనున్నారు. ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్​ లో జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆధ్వర్యంలో, దరఖాస్తుల దారుల సమక్షంలోనే డ్రా తీయనున్నారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా, అక్రమాలకు అవకాశం లేకుండా మొత్తం డ్రా ప్రక్రియను వీడియో తీయనున్నారు.

పెరిగిన దరఖాస్తులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ఆంధ్ర ప్రదేశ్​కు సరిహద్దు జిల్లాగా ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గతం కంటే 18శాతం ఎక్కువగా దరఖాస్తులొచ్చాయి. వీటిల్లో దాదాపు సగం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారివే టెండర్లు వేయడం గమనార్హం. మరో వైపు వ్యాపారులు సిండికేట్​ గా ఏర్పడడంతో పాటు బినామీ పేర్లతో వైన్​ షాపులను దక్కించుకునేందుకు దరఖాస్తులను భారీగా చేశారు. దీనికి తోడు  ఎక్సైజ్​శాఖాధికారులు ఆంధ్ర ప్రాంతంలో మద్యం వ్యాపారాలు నిర్వహించిన వారికి మరీ ఫోన్​ చేసి పిలిపించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 88 వైన్​ షాపులకు 5057 దరఖాస్తులొచ్చాయి.  ఆంధ్రతోపాటు ఖమ్మం వ్యాపారులతో పోటీ తట్టుకోలేక దరఖాస్తులు వేయలేకపోయామని పలువురు జిల్లాలోని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. 

ఏపీ నుంచి వచ్చే వ్యాపారం తగ్గిపోయింది 

గతంలో మూడు డీడీలు వేయడంతో మీనవోలు గ్రామంలో షాపు (షాపు నెంబర్​ 81) నాకు లైసెన్స్​ దక్కింది. ఇంతకు ముందు ఏపీ నుంచి వచ్చే వాళ్లతో ఎక్కువ గిరాకీ ఉండేది. అక్కడ బ్రాండెడ్ మద్యం లభించకపోవడంతో, ఇక్కడికి వచ్చి తాగి పోయేవాళ్లు. ఇప్పుడు అక్కడ బ్రాండెడ్ మద్యం అమ్ముతుండడం, క్వార్టర్​ బాటిల్ మీద తెలంగాణ కంటే ఏపీలో కనీసం రూ.10 తక్కువగా ఉండడంతో ఇక్కడికి ఏపీ వాళ్లు రావడం లేదు.  

–రాజశేఖర్ రెడ్డి, మీనవోలు వైన్​ షాప్ ఓనర్