- 2018లో 83.2 శాతం పోలింగ్ నమోదైతే ప్రస్తుతం 80.4కే పరిమితం
- అర్బన్ ఏరియాల్లో ఫలితం ఇవ్వని అధికారుల చర్యలు
- తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి కలిసొస్తుందనే చర్చ
హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూత్, మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, రాజకీయంగా భిన్న పరిస్థితులు నెలకొనడంతో ఈ సారి ఓటింగ్ శాతం పెరుగుతుందని అందరూ భావించారు. సాయంత్రం ఐదు దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో ఉండడంతో పర్సంటేజీ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేశారు. కానీ గతంతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం చర్చనీయాంశమైంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83.2 శాతం పోలింగ్ నమోదు కాగా
ఈ సారి 80.44 శాతానికే పరిమితమైంది. అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గంలో 87.87 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్ పశ్చిమలో అత్యల్పంగా 56.59 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం వివిధ కార్యక్రమాలు చేపట్టినా గతంతో పోలిస్తే ప్రస్తుతం 2.78 శాతం పోలింగ్ పర్సంటేజీ తగ్గింది.
ఫలితమివ్వని అధికారుల చర్యలు
రూరల్ ఏరియాతో పోలిస్తే అర్బన్ ఏరియాల్లో ఓటింగ్‌శాతం చాలా తక్కువగా నమోదు అవుతుండడంతో ఈ సారి పోలింగ్ పర్సంటేజీని పెంచేందుకు ఆఫీసర్లు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో అత్యల్ప ఓటింగ్ నమోదు అవుతున్న నియోజకవర్గాల్లో వరంగల్ పశ్చిమ కూడా ఒకటి ఉండడంతో ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఫ్లాష్ మాబ్‌లు, క్రికెట్ టోర్నీలు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు, జంక్షన్లలో ఈవీఎం, వీవీప్యాట్ల బోర్డులు,
ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. హోం ఓటింగ్ నిర్వహించడంతో పాటు సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, సర్వీస్ ఓట్లతో పాటు యూత్, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రచారం చేశారు. అయినా ఓటర్లలో మాత్రం మార్పు రాలేదు. చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెనుకడుగు వేయడంతో పర్సంటేజీ తగ్గిపోయింది.
ఎవరికి కలిసొచ్చేనో ?
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సాధారణంగానే అధికార పార్టీపై వ్యతిరేకత వ్యక్తమైంది. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన వాటికి పేపర్ లీకేజీలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ధరణి సమస్యలు, డెవలప్ వర్క్స్ పెండింగ్‌లో ఉండడం లాంటి అంశాలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూత్ పర్సంటేజీ ఎక్కువ కావడంతో ఈ సారి ఓటింగ్ పర్సంటేజీ పెరిగి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకు అనుకూలిస్తాయని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ భావించాయి.
కానీ ప్రతిపక్షాలు ఆశించిన తీరులో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో తగ్గిన పర్సంటేజీ ఎవరికి అనుకూలిస్తుందోననే చర్చ జోరుగా సాగుతోంది. ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ప్రతిపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సారి ఎక్కువగా సైలెంట్ ఓటింగ్ జరగడంతో ప్రధాన పార్టీల క్యాండిడేట్లందరిలో టెన్షన్ కనిపిస్తోంది.
మహిళలదే పైచేయి
- గెలుపోటములపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల్లో గుబులు
ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గంలో 82.09 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,26,366 మంది ఓటర్లు ఉండగా 1,85,831ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 91,139 మంది పురుషులు, 94,683ల మంది మహిళలు ఓటర్లు ఓటు వేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులతో పాటు మరో ఏడుగురు ఇండింపెండెంట్లు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 82.09 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే పోలైన వాటిలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉండడంతో క్యాండిడేట్లలో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్లు గెలుపుపై, మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నారు.
అన్ని నియోజకర్గాలదీ అదే తీరు
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ ఈ సారి పోలింగ్ పర్సంటేజీ తగ్గింది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83.2 శాతం పోలింగ్ నమోదు కాగా నర్సంపేట నియోజకవర్గం టాప్‌ప్లేస్‌లో నిలిచింది. ఇక్కడ గత ఎన్నికల సమయంలో 90.35 శాతం ఓట్లు పడగా, ఈ సారి 87.87కే పరిమితమైంది. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 59.21 శాతం పోలింగ్‌తో 2018 ఎన్నికల్లో లీస్ట్‌లో నిలువగా ఈ సారి కూడా సుమారు మూడు శాతం తగ్గి 56.59 శాతంతో మళ్లీ అట్టడుగునే నిలిచింది. ఇదిలా ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ సారి ఓటింగ్‌శాతం భారీగా తగ్గింది. ఓటర్లంతా మధ్యాహ్నం 3.30 గంటల తరువాత బయటకు రాగా, అప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు 40 వేల మందికిపైగా పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 66.74 శాతమే పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఇక్కడ సుమారు 6 శాతం పోలింగ్ తగ్గింది.
97,804 మంది ఓట్లెయ్యలే
జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలు ఉండగా మొత్తం 7,34,753 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,36,949 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 97,804 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో 2,37,108 మంది ఓటర్లు ఉండగా 2,03,205 మంది, పాలకుర్తి నియోజకవర్గంలో 2,51,490 మంది ఓటర్లకు 2,18,484 మంది, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 2,49,155 మంది ఓటర్లకు 2,15,260 మంది మాత్రమే ఓట్లు వేశారు.
ఉమ్మడి జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు
నియోజకవర్గం 2023 2018
వరంగల్ తూర్పు 66.74 73.45
వరంగల్ పశ్చిమ 56.59 59.21
వర్ధన్నపేట 80.23 83.92
పరకాల 84.61 89.51
నర్సంపేట 87.97 90.35
పాలకుర్తి 86.88 89.01
ములుగు 82.09 82.73
భూపాలపల్లి 82.10 82.13
మహబూబాబాద్ 81.09 85.06
డోర్నకల్ 86.71 88.96
జనగామ 84.01 86.19
స్టేషన్ ఘన్‌పూర్ 86.44 88.14