
- జాతీయ స్థాయిలో టార్గెట్‌లో 65 శాతమే సాగు
- సాగు 35% తగ్గడంతో వడ్ల దిగుబడిపై పడనున్న ప్రభావం
- వరి వద్దన్న రెండేండ్లలోనే సీన్ రివర్స్
- యాసంగిలో రాష్ట్రం నుంచి ఎక్కువ ధాన్యం సేకరణ
- ఇప్పటికే 75 లక్షల టన్నుల వడ్లు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
- వరి వద్దన్న రెండేండ్లలోనే సీన్ రివర్స్
- డిమాండ్ పెరిగినా ధాన్యం రేట్లు తగ్గిస్తున్న వ్యాపారులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా వరి సాగు తగ్గుతుండడంతో దాని ప్రభావం బియ్యం నిల్వలపై పడుతోంది. ఫలితంగా బియ్యం నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యాసంగిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సహా వరి సాగు ఎక్కువగా చేసే15 రాష్ట్రాల్లో వరి సాగు పెంచాలని టార్గెట్ పెట్టినా ఫలితం లేకుండాపోయింది. ఈ యాసంగిలో వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఏపీల్లోనూ వరి సాగు గణనీయంగా తగ్గింది. దీంతో దేశ బియ్యం అవసరాల్లో గణనీయంగా లోటు ఏర్పడి, జాతీయ స్థాయిలో బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ బియ్యానికి మస్త్ డిమాండ్ ఉంటోంది. అందుకే సేకరించిన బియ్యం సేకరించినట్లుగా ఎఫ్‌సీఐ వేగంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో బియ్యం అవసరాల నేపథ్యంలో రోజుకు రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐ తరలిస్తోంది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ రోజువారిగా బియ్యం తరలిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఈ యేడు యాసంగి సీజన్లో 75 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కువ వడ్లు వచ్చినా కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యాసంగిలో దేశవ్యాప్తంగా సాధారణ వరి సాగు 1,31,25,000 ఎకరాలు కాగా, ఈ యేడు సాగు గణనీయంగా తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈ యాసంగిలో 98,22,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయింది. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 33 లక్షల ఎకరాలు తగ్గింది. నిరుడు యాసంగి సీజన్ తో పోల్చినా ఈసారి 2.70 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిపోయింది. మొత్తంగా కేంద్రం ఇచ్చిన టార్గెట్‌లో 65% మాత్రమే సాగు జరిగింది.
డిమాండ్ ఉన్నా.. రేట్లు తగ్గిస్తున్న మిల్లర్లు
తెలంగాణలో కూడా వరి సాగు తగ్గింది. నిరుడు యాసంగిలో అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ ఏడాది 50.84 లక్షల ఎకరాల్లోనే వరి వేశారు. నిరుటితో పోల్చుకున్నా.. 66 లక్షల ఎకరాలకు గాను ఎకరానికి యావరేజ్‌గా 18 క్వింటాళ్ల ధాన్యం చొప్పున 1.20 కోట్ల టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేశారు. కానీ అనుకున్నదాని కంటే 15 లక్షల ఎకరాలు తగ్గడంతో 93 లక్షల టన్నుల వడ్లు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వడ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, మొన్నటిదాకా క్వింటాల్‌కు రూ. 2,700 పెట్టి కొన్న మిల్లర్లు ఇప్పుడు పంట మార్కెట్‌కు రావడం మొదలవగానే రేట్లు తగ్గిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భారత్ నుంచి140 దేశాలకు బియ్యం
ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఎగుమతులలో మన దేశ వాటా 40%.. మన దగ్గరి నుంచే140 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతాయి. మన తర్వాతి స్థానంలో థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్, అమెరికా దేశాలు బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. 2022లో ప్రపంచ బియ్యం ఎగుమతులు 5.54 కోట్ల టన్నులు.. అందులో మన దేశం నుంచే 2.22 కోట్ల టన్నులు ఎగుమతయ్యాయి. ఇందులో బాస్మతియేతర బియ్యం1.8 కోట్ల టన్నులు కాగా, ఇందులో1.03 కోట్ల టన్నులు సాధారణ రకం బియ్యం ఎగుమతులు ఉన్నాయి.
రెండేండ్లలోనే సీన్ రివర్స్ ..
దేశ భవిష్యత్ అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వలున్నందున రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని.. వరి సాగుకు రైతులను ప్రోత్సహించబోమని 2021 డిసెంబరు 3న అప్పటి కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. ధాన్యం పండిస్తే ఎగుమతులకు కూడా అవకాశం లేదన్నారు. కేంద్రం వరి సాగు వద్దనడంతో చాలా రాష్ట్రాలు సాగును తగ్గించాయి. దీంతో దేశవ్యాప్తంగా సాగు50 శాతం తగ్గిపోయింది. రాష్ట్రంలోనూ అప్పటి సీఎం కేసీఆర్ ‘వరి వేస్తే ఉరే..’ అంటూ రైతులను నిరుత్సాహపర్చారు.
దీంతో అప్పటి నుంచి నిరుడు తప్ప యాసంగిలో వరి సాగు తగ్గుతూ వస్తోంది. కానీ దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తి తగ్గడంతో ఇప్పుడు బియ్యం ధరలు పెరుగుతున్నాయి. నిల్వలు భారీగా ఉన్నాయన్న కేంద్రమే ఇప్పుడు వడ్లను ఎక్కువగా సేకరించేందుకు ఓకే చెప్పింది. ధాన్యం ఉత్పత్తి పడిపోవడంతో బియ్యం ఎగుమతులపైనా నిషేధం విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా 2022 మార్చిలో నూకల ఎగుమతిని కేంద్రం బ్యాన్ చేసింది.
ఆ తర్వాత బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం పన్ను విధించింది. అయితే, దేశంలో నాలుగేండ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని ప్రకటించిన రెండేండ్లకే బియ్యం కొరత ఏర్పడి, సీన్ రివర్స్ కావడం గమనించదగ్గ విషయం.