ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. వరంగల్ హోల్ సేల్ మార్కెట్ లో కిలో టమాటా ఐదు రూపాయిలే పలుకుతోంది. అయితే ఈ ధరలపట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. తగ్గిన ధరలతో కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదని వాపోతున్నారు.
టమాట ధరలు అమాంతం తగ్గిపోయాయి.. అవును.. వారం క్రితం వరకు కిలో టమాటా అక్షరాల వంద రూపాయలు టచ్ అయ్యింది.. అమ్మో.. అయ్యో అంటూ టమాటా జోలికి వెళ్లటం మానేశారు జనం. ఇప్పుడు మార్కెట్ లో అమాంతం పడి పోయిన టమాటా ధర 25 కిలోల బాక్స్ రూ 100 నుండి 200 వరకు ధర పలుకుతోంది.రిటైల్ మార్కెట్ లో కిలో 8 నుంచి 10 రూపాయలకు విక్రయిస్తున్నారు.
పంట చేతికి వచ్చిన తర్వాత.. మార్కెట్ కు తీసుకొస్తే ధర మాత్రం ఢమాల్ అనటంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. అమాంతం పెరగటం.. అమాంతం తగ్గటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగితే 100 రూపాయలు.. తగ్గితే 5 రూపాయలు ఏంటీ అంటూ వ్యాపారులపై మండిపడుతున్నారు..