- అకాల వర్షాలతో తగ్గిన పసుపు దిగుబడి
- క్వాలిటీ లేదంటూ రేటు తగ్గించేసిన వ్యాపారులు
- ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 65 వేలు నష్టపోతున్న రైతులు
- ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని డిమాండ్
నిజామాబాద్, వెలుగు : సాధారణంగా ఏ పంట అయినా దిగుబడి తక్కువగా ఉంటే డిమాండ్ పెరిగి మంచి రేటు పలుకుతుంది. కానీ నిజామాబాద్ జిల్లాలో పూర్తి వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో అకాల వర్షాల కారణంగా తెగుళ్లు సోకి పసుపు దిగుబడి భారీగా తగ్గగా, వ్యాపారులు సిండికేట్‌గా మారి రేటును కూడా తగ్గించేశారు. దీంతో రైతులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు.
అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్‌లో మోర్తాడ్, ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్ పల్లి, నందిపేట్ మండలాల్లో సుమారు 35 వేల ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. మొత్తం 7 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ఈ సీజన్‌లో అకాల వర్షాలు పడడంతో పసుపు పంటకు దుంపకుళ్లు తెగులు సోకింది. దీంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. సాధారణంగా ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ సీజన్‌లో 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది.
క్వాలిటీ లేదంటూ రేట్ తగ్గించిన వ్యాపారులు
తెగుళ్లు సోకడంతో పసుపు క్వాలిటీగా లేదంటూ వ్యాపారులు రేట్ భారీగా తగ్గించేశారు. ఎకరాకు రూ.1.30 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఖర్చు అయినట్లు రైతులు తెలిపారు. దీని ప్రకారం క్వింటాల్‌కు రూ. 10 వేలు పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ. 7 వేలే చెల్లిస్తున్నారు. మహారాష్ట్రలో క్వింటాల్‌కు రూ.12 వేలు పలుకుతుండగా ఇక్కడి వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ రేటుకు కొంటున్నారు. దీంతో రైతులు ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 65 వేలు నష్టపోతున్నారు.
రూ. 3 వేలు బోనస్ ఇవ్వాలంటున్న రైతులు
గత మూడేళ్లుగా అకాల వర్షాలు పడుతుండడంతో పసుపు పంటకు నష్టం జరుగుతోంది. వర్షం కారణంగా చేన్లలోకి నీరు చేరడంతో పసుపు తెగుళ్ల బారిన పడుతోంది. దీంతో క్వాలిటీతో పాటు, దిగుబడి కూడా భారీగా తగ్గుతోంది. ఇలా ప్రతి ఏటా 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి తక్కువగా వస్తోంది. దీంతో రైతులు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పసుపు రైతులకు రూ. 3 వేల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఫసల్ బీమా యోజన కూడా వర్తింపజేయాలని
కోరుతున్నారు.