- తిరుమలలో రాజకీయ కామెంట్లు చేస్తే కఠిన చర్యలు
- టీటీడీ తొలి బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు : సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయించింది. దీని కోసం ఏఐ టెక్నాలజీ సహకారం తీసుకుంటామని తెలిపింది. స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో భక్తులు గంటల కొద్ది వేచి ఉండకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత ఐదేండ్లలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అపోహల దృష్ట్యా.. ట్రస్ట్‌ను రద్దు చేశామని తెలిపింది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ధర్మకర్తల మండలి సమావేశమైంది. అజెండాలోని 80 అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ‘‘శ్రీవాణి ట్రస్ట్‌పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ట్రస్ట్ పేరును రద్దు చేస్తున్నం. టీటీడీ మెయిన్ అకౌంట్ ద్వారానే లావాదేవీలు జరపాలని నిర్ణయించాం. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని డిసైడ్ అయ్యాం.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే వీఐపీలు, నేతలు రాజకీయ అంశాలపై మాట్లాడొద్దు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తున్నం. ఆ భూముల్లో నిర్మించిన భవనాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశిస్తున్నం. త్వరలో ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం’’అని చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.
టూరిజం టికెట్లు రద్దు
లడ్డూ తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి అంశంపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ‘‘టూరిజం ద్వారా ప్రతి రోజూ కేటాయిస్తున్న 4వేల టికెట్లను రద్దు చేస్తున్నం. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇస్తున్న రూ.14వేల బహుమతిని రూ.15,400కు పెంచుతున్నం. స్వామి వారి నగదు, బంగారాన్ని ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసి ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించినం.
అలిపిరిలో టూరిజం శాఖకు కేటాయించిన 20 ఎకరాల భూమిని తిరిగి టీటీడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతాం. తిరుమల వాసులకు ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తాం. తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పేరును గతంలో ఉన్న విధంగా గరుడ వారధిగా మారుస్తున్నం’’అని బీఆర్ నాయుడు ప్రకటించారు. ఏండ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను 3 నెలల్లో తొలగిస్తామన్నారు. లడ్డూలు తయారు చేసే పోటులో లీకేజ్‌ని అరికట్టి మరమ్మతులు చేస్తామని తెలిపారు.