- మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే వర్గం మధ్య కనిపించని సఖ్యత
- అసమ్మతి నేతల బుజ్జగింపు, ప్రచార బాధ్యతను ఎంపీ కవితకు అప్పగింత
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ధరంసోతు రెడ్యానాయక్ వరుసగా ఎనిమిదో సారి బరిలో నిలుస్తున్నారు. గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009 ఎన్నికల్లో సత్యవతి రాథోడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. రెడ్యానాయక్ తాజాగా బీఆర్‌ఎస్ తరఫున పోటీలో ఉండగా గెలుపు బాధ్యతను ఆయన కూతురు ఎంపీ మాలోతు కవితకు హైకమాండ్ అప్పగించింది. రెడ్యానాయక్‌కు ఇటీవలే మోకాలి ఆపరేషన్ జరగడంతో నియోజకవర్గంలో ప్రచార బాధ్యత మొత్తాన్ని కవితే తీసుకోనుంది.
ఎమ్మెల్యే, మంత్రి మధ్య కనిపించని సఖ్యత
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్యాండిడేట్‌గా బరిలో నిలిచిన రెడ్యానాయక్ కాంగ్రెస్ క్యాండిడేట్ జాటోతు రామచంద్రునాయక్‌పై 17,381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మంత్రి సత్యవతి రాథోడ్ సైతం రెడ్యనాయక్‌కు పూర్తి మద్దతు ఇచ్చారు. అయితే కొద్దికాలంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ ఎడముఖం, పెడముఖంగా ఉంటున్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మంత్రికి ఆహ్వానం అందలేదు.
బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశాలకు సైతం పిలిచిన దాఖలాలు లేవు. దీంతో ఇరువర్గాల మధ్య సఖ్యత కుదరడం లేదు. బీఆర్‌ఎస్ హైకమాండ్ ఇటీవల రెడ్యానాయక్‌కు టికెట్ ప్రకటించిన వెంటనే ఆయన మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి మద్దతు కోరారు. తన అనుచరులను కలుపుకొనిపోవాలని మంత్రి సూచించడంతో నెల రోజుల పాటు మండలాల వారీగా గడపగడపకూ తిరుగుతూ అసమ్మతి నేతలతో మాట్లాడుతూ తనకు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికలే తనకు చివరి అవకాశం అంటూ రెడ్యానాయక్ ప్రచారం చేస్తున్నారు.
సత్యవతి వర్గం సహకరించేనా ?
డోర్నకల్‌లో లీడర్ల మధ్య సమన్వయం కుదర్చడం, రెడ్యానాయక్ గెలుపు, ప్రచార బాధ్యతను ఆయన కూతురు, జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు హైకమాండ్ అప్పగించింది. దీంతో ఆమె సైతం ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడారు. అసమ్మతి నేతలంతా ఇప్పటివరకైతే ఓకే అంటున్నా.. కీలక సమయంలో ఏం చేస్తారోనని రెడ్యానాయక్ వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన క్యాండిడేట్ లేకపోవడమే రెడ్యానాయక్ విజయానికి కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో రెడ్యానాయక్ శిష్యురాలు, నరసింహులపేట జడ్పీటీసీ భుక్యా సంగీత బీజేపీ నుంచి బరిలో నిలుస్తుండగా, కాంగ్రెస్ క్యాండిడేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.