Paris Olympics 2024: పోరాడి ఓడిన రీతికా హుడా

Paris Olympics 2024: పోరాడి ఓడిన రీతికా హుడా

పారిస్ ఒలింపిక్స్​లో మహిళల 76కేజీల ఫ్రీ స్ట్రైల్ విభాగంలో పోటీపడిన భారత రెజ్లర్ రీతికా హుడా క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. కిర్గిస్థాన్‌ క్రీడాకారిణి ఐపెర కైజీ చేతిలో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసమయానికి ఇద్దరు 1-1తో సమంగా ఉన్నప్పటికీ, చివరి ఈక్వలైజింగ్ పాయింట్‌ చేజిక్కించుకోవడం ద్వారా ఐపెర కైజీ విజయం సాధించింది. అయితే, ఒలింపిక్స్​లో రీతికా పోరాటం అప్పుడే ముగియలేదు. ఐపెరి కైజీ ఫైనల్​కు అర్హత సాధిస్తే, రీతికా రెపిచేజ్ రౌండ్ ఆడే అవకాశం​ ఉంది. 

12-2 తేడాతో విజయం

అంతకుముందు రీతికా భారీ విజయంతో తన ఒలింపిక్స్ 2024 ప్రచారాన్ని ప్రారంభించింది. రౌండ్ 16లో హంగేరీ రెజ్లర్ బెర్నాడెట్ నాగిపై 12-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్​కు అర్హత సాధించింది.

6 పతకాలు

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకూ మన దేశానికి 6 పతకాలు వచ్చాయి. ఇందులో ఒకటి రజతం కాగా, మిగిలిన ఐదు కాంస్య పతకాలు. ఈ ఐదింటిలో మూడు కాంస్యాలు షూటింగ్‌లో వచ్చినవే. మరోకటి పురుషుల హాకీ జట్టు సాధించగా, ఇంకొకటి రెజ్లింగ్‌లో వచ్చింది. రజత పతకాన్ని జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గెలిచాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకూ మన దేశానికి ఇదే అత్యుత్తమ మెడల్.