ఇయ్యాల గోలేటి ఓసీపీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

  • ఏటా 3.5 మిలియన్​టన్నుల ఉత్పత్తి
  • హాజరుకానున్న మంచిర్యాల, ఆసిఫాబాద్​ కలెక్టర్లు

మందమర్రి/ఆసిఫాబాద్​,వెలుగు : బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న గోలేటి ఓసీపీ కోసం శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్​కలెక్టర్లు భారతీ హోళికెరి, రాహుల్​రాజ్​ అధ్యక్షతన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెబ్బెన మండలం గోలేటి ఎంవీటీసీ వద్ద ప్రజాభిప్రాయసేకరణకు సింగరేణి ఏర్పాట్లు చేసింది. 

ఏరియాకు కొత్త కళ..

ఓసీపీ ఏర్పాటుకు యాజమాన్యం నిర్ణయించడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ రానుంది. మైన్ అందుబాటులోకి వస్తే 15 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు.  ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని రెబ్బెన మండలంలో  వివిధ కారణాలతో మూత పడ్డ గోలేటి-1, 1ఏ  ఇంక్లైన్‌‌‌‌,  గోలేటి--2 అండర్​గ్రౌండ్​  బెల్లంపల్లి  ఏరియాలో  గోలేటి1, 1ఏ అండర్​ గ్రౌండ్​ మైన్స్​,అబ్బాపూర్​ ఓసీపీ, ఖైరీగూడ ఓసీపీ, డోర్లి1, డోర్లి2 ఓసీపీలు ఉత్పత్తిలో సింగరేణికే తలమానికంగా నిలిచాయి. ఆ తర్వాత గనులు ఒక్కొక్కటి మూతపడుతుండంతో ఏరియా వైభవం తగ్గిపోయింది.  ప్రస్తుతం ఖైరిగూడ, బీపీఏ ఓసీపీ2 గనులు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఖైరీగుడ ఓసీపీకి మరో ఏడేళ్ల జీవితకాలమే ఉంది.  ఈ గనిలో  రోజుకు గరిష్టంగా 12వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా బెల్లంపల్లి ఓసీపీ ఎక్స్​టెన్షన్​2లో అంతంత మాత్రంగా ఉత్పత్తి జరుగుతుంది. గతంలో మూసివేసిన గనుల స్థానంలో కొత్తగా ప్రతిపాదిత గోటేటి ఓసీపీ రావడంతో ఏరియాకు భవిష్యత్తు ఉంటుందని, ఏటా 3.5మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి  జరగనుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

అన్ని ఏర్పాట్లు చేశాం

ఏరియా పరిధిలో ఏర్పాటు చేయనున్న గోలేటి ఓసీపీ ప్రజాభిప్రాయం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. శుక్రవారం గోలేటి 1 గని ఎంవీటీసీ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు మంచిర్యాల, ఆసిఫాబాద్​ కలెక్టర్ల సమక్షంలో రాష్ట్ర పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాం. కొత్త ఓసీపీ ఏర్పాటు వల్ల ఏరియాకు పునర్​వైభవం రానుంది. పరిసర ప్రాంతాల ప్రజలంతా హాజరుకావాలి. - దేవేందర్, బెల్లంపల్లి ఏరియా జీఎం