అంబుజా సిమెంట్స్‌‌‌‌ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ

  • 304 హెక్టార్లలో గనుల తవ్వకానికి అప్లై చేసుకున్న అదానీ సంస్థ

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌‌‌‌పహాడ్‌‌‌‌లోని అంబుజా సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీ విస్తరణకు పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు ఆఫీసర్లు నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. గణేశ్‌‌‌‌పహాడ్‌‌‌‌లోని పెన్నా సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీని గతేడాది అదానీ గ్రూప్‌‌‌‌ కొనుగోలు చేసి అంబుజా సిమెంట్‌‌‌‌గా మార్చింది. కంపెనీ విస్తరణలో భాగంగా సున్నపురాయి గనుల తవ్వకాల కోసం అప్లై చేసుకుంది. 

మొత్తం 353 హెక్టార్ల  భూమిలో గనుల తవ్వకానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉండగా, ఇందులో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ పరిధిలో 50 హెక్టార్లు, నల్గొండ జిల్లా గణేశ్‌‌‌‌పహాడ్‌‌‌‌ పరిధిలో 303 హెక్టర్ల భూమి ఉంది. గతంలోనే రెండు సార్లు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆఫీసర్లు నిర్ణయించినా వివిధ కారణాలతో వాయిదా పడింది. 

ప్రజాభిప్రాయ సేకరణపై ఉత్కంఠ

అంబుజా సిమెంట్స్‌‌‌‌ విస్తరణను మిర్యాలగూడ, నేరేడుచర్ల మండల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఉన్న పెన్నా సిమెంట్స్‌‌‌‌ కంపెనీ స్థానికులకు ఉద్యోగ, ఉపాధి సహా అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీ విస్తరణకు పలు పార్టీలు, ప్రజాసంఘాలు లీడర్లు వ్యతిరేకత తెలుపుతుండడంతో ప్రజాభిప్రాయ సేకరణ సాఫీగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్ట ఏర్పాట్లు చేసింది. ప్రజలంతా తమ అభిప్రాయాలను చెప్పేలా, సభలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గణేశ్‌‌‌‌పహాడ్‌‌‌‌, శూన్యపహాడ్‌‌‌‌తో పాటు పలు గ్రామాల ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్త్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు.