స్థానిక సంస్థల్లో సంస్కరణలు.. త్వరలో యాక్షన్​ ప్లాన్

స్థానిక సంస్థల్లో సంస్కరణలు.. త్వరలో యాక్షన్​ ప్లాన్
  • ‘క్రిస్ప్’తో కాంగ్రెస్​ సర్కార్​ ఎంవోయూ 
  • మంత్రి సీతక్క సమక్షంలో ఒప్పందం  ​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల బలోపేతం, గ్రామాల అభివృద్ధి కోసం సంస్కరణలు చేపట్టే ఆలోచన ఉందని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. యాక్షన్ ప్లాన్​పై కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం సెక్రటేరియట్​లో మంత్రి సీతక్కతో సెంటర్ ఫర్​ రీసెర్చ్​ఇన్​ స్కీమ్​ అండ్​ పాలిటిక్స్(సీఆర్​ఐఎస్పీ) థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్​ ఆర్​సుబ్రమణ్యం భేటీ  అయ్యారు.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారత బలోపేతంపై చర్చించారు. 

14 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో కలిసి క్రిస్ప్ పనిచేస్తుందని, సంస్థ ఉచితంగా సేవలందిస్తుందని, కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, సాధించిన పురోగతిని తెలిపారు. కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అధ్యక్షతన 10 మంది సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో క్రిస్ప్ సంస్థ పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. 

గ్రామ సభల నిర్వహణ, పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించే ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు తెచ్చే దిశలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలు పూర్తయి కొత్త పాలకమండళ్లు ఏర్పడేనాటికి యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల కార్యకలాపాల్లో మహిళా సంఘాల సహకారం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని, మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీల మధ్య సమన్వయం సాధిస్తే గ్రామాల్లో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. 

కేరళ మోడల్‌‌‌‌‌‌‌‌లో ఈ విధానం సక్సెస్ అయిందన్న అభిప్రాయంలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఆ దిశలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని సంస్థ సెక్రటరీ సుబ్రహ్మణ్యంకు మంత్రి సీతక్క సూచించారు. సీతక్క సమక్షంలో క్రిస్ప్​మెంబర్​ సెక్రటరీ(సీఆర్ఐఎస్పీ) సుబ్రహ్మణ్యం, సీఆర్డీ  డైరెక్టర్ సృజన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

అనాథ విద్యార్థులకు రెస్టారెంట్​లో విందు- అటెండ్ అయిన మంత్రి సీతక్క

చిన్నారుల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా అఖిల్, ఆరిఫ్ ఆలీ అనే వ్యక్తులు ‘వన్ ఈవెనింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పిల్లలకు జూబ్లీహిల్స్ లోని బార్బీ క్యూ రెస్టారెంట్ లో విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా మాట్లాడారు. 

వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు అఖిల్, ఆరిఫ్ అలీ తెలిపారు. 70 మంది చిన్నారులకు ఆహార అందించడం ఆనందంగా ఉందని చెప్పారు.