- పీహెచ్సీల్లో ఉంటున్న డాక్టర్లు
- జీపీఎస్ లొకేషన్ అటెండెన్స్ తో మార్పు
- దవాఖానలకు పెరిగిన రోగుల రాక
సిద్దిపేట, వెలుగు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రారంభించిన సంస్కరణలు చక్కటి ఫలితాలనిస్తున్నాయి. పేదలకు వైద్య సేవలందించే సర్కారు దవాఖానలకు రోగుల రాకపెరిగింది. గతంలో సర్కారు దవాఖానల్లో డాక్టర్లు అందుబాటులో ఉండరనే మాటలు తరచుగా వినిపించేవి. ఇటీవల కొన్ని మార్పుల వల్ల పీహెచ్సీలలో సైతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్లు అక్కడే ఉండి వైద్యసేవలందిస్తున్నారు. దీంతో జిల్లాలో 35 పీహెచ్సీలు, 2 యూపీఎస్ లు, బస్తీ దవాఖానలకు రోగుల రాక పెరగడమే కాకుండా గత నెలలో 15 వరకు డెలీవరీలు జరిగాయి. రెండు నెలలుగా పీహెచ్సీలకు ప్రతి రోజు 80 మంది కి పైగా రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు.
సర్కార్దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండడం లేదని, రిజిస్టర్లలో అటెండెన్స్ వేసుకుని వెళ్లిపొతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొన్ని మార్పులను ప్రారంభించింది. పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు, సాయంత్రం వెళ్లేటప్పుడు జీపీఎస్ లోకేషన్ తో ఫొటో అటెండెన్స్ ను డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేయాలి. దీనిని డీఎంహెచ్వో ప్రతి రోజు పరిశీలిస్తుండడం మార్పునకు కారణమైంది. దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండడంతో డెలీవరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నిర్ణయం వల్ల సర్కార్దవాఖానలకు రెండు నెలల్లో 30 శాతం వరకు రోగుల సంఖ్య పెరిగింది.
ఎన్క్వాస్ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాలు
జిల్లాలోని 20 పీహెచ్సీల అధికారులు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్క్వాస్(నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్ట్ ) సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ సర్టిఫికెట్ లభిస్తే వచ్చే మూడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేస్తుంది. వీటిలో గుర్రాల గొందీ పీహెచ్సీ ని ఇటీవల కేంద్ర బృందం పరిశీలించింది. ఎన్క్వాస్సర్టిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ఆయా దవాఖానాల్లో 13 రకాల రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఓపీ, మెటర్నరీ, ఇమ్యూనైజేషన్, టీబీ, లెప్రసీ వంటి రోగుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు
చేయాల్సి ఉంటుంది.
సర్కారు దవాఖానలో సేవలు బాగున్నాయ్
సర్కారు దవాఖానలో వైద్య సేవలు మంచిగున్నయ్. దవాఖానకు ఎప్పుడొచ్చినా డాక్టర్ ఉంటున్నడు. నా అనారోగ్య సమస్యలు చెప్పి మందులు తీసుకుంటున్నా. ఈ మధ్య కాలంలో చాలామంది దవాఖానకు వస్తుండ్రు. కుక్క, కోతి కరిస్తే టీకాలు అందుబాటులో ఉంచాలి. - గొల్ల బాలయ్య , కాన్గల్
మెరుగైన వైద్యం కోసం చర్యలు
జిల్లాలోని సర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించి ఆర్థికభారాన్ని దూరం చేయాలనే దిశగా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ ఆఫీసర్లు దవాఖానల్లో ఉండే విధంగా నిబంధనలు రూపొందించాం. స్థానిక దవాఖానాలను పటిష్టం చేస్తే పేదలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. పీహెచ్సీలలో డెలీవరీలు పెంచే దిశగా చర్యలు చేపపడుతున్నాం. జిల్లాలోని 20 పీహెచ్సీలకు ఎన్క్వాస్సర్టిఫికెట్ లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.- డాక్టర్ పల్వన్ కుమార్, డీఎంహెచ్వో