- 76వ రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
- పౌరులందరి సంక్షేమం,అభివృద్ధికి కేంద్రం చర్యలు
- దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను మరవొద్దని పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణతో పరిపాలనలో స్థిరత్వం పెరుగుతుందని, విధానపరమైన నిర్ణయాల అమలుకు అడ్డంకులు తొలగిపోతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వాలపై ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు.
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ముర్ము శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘జమిలి ఎన్నికల వంటి భారీ సంస్కరణలు చేపట్టాలంటే ఎంతో ధైర్యంతో కూడిన విజన్ ఉండాలి.
దేశమంతటా ఎన్నికల షెడ్యూల్స్ ను ఏకకాలానికి మారేలా చూసేందుకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు సుపరిపాలనకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. జమిలి ఎన్నికలతో స్థిరమైన పాలన సాధ్యమవుతుంది.
పాలసీల అమలులో సమస్యలకు అడ్డుకట్ట పడుతుంది. వనరుల వృథాను అరికట్టవచ్చు. ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు’’ అని రాష్ట్రపతి అన్నారు. దేశం కొన్ని దశాబ్దాలుగా బ్రిటిష్ వలసవాద మనస్తత్వంలోనే మగ్గిపోయిందని, ఆ మైండ్ సెట్‌ను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నదని తెలిపారు.
మహిళలు, పిల్లలకు మెరుగైన న్యాయం దక్కేందుకు కొత్త క్రిమినల్ చట్టాలు దోహదం చేస్తాయన్నారు. ‘‘మనం 1947లో స్వాతంత్ర్యాన్ని పొందాం. కానీ చాలాకాలంపాటు మనలో వలసవాద మనస్తత్వ లక్షణాలు అలాగే ఉండిపోయాయి.
ఆలస్యంగానైనా ఈ మైండ్ సెంట్ ను మార్చుకుంటున్నాం. అందుకే ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తెచ్చుకున్నాం” అని రాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరులందరి సంక్షేమం,
అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా దేశ నాగరిక వారసత్వం గొప్పతనానికి ప్రతిరూపంగా నిలుస్తోందని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
రాజ్యాంగంతోనే మనకు గుర్తింపు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గత 75 ఏండ్లలో భారత్ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిందని రాష్ట్రపతి అన్నారు. ‘‘మనకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన పేదరికం, ఆకలితో అలమటించాయి.
కానీ మనపై మనం విశ్వాసంతో ముందుకు సాగాం. దేశమంతా అభివృద్ధి చేసుకుంటూ ఆ పరిస్థితులను మార్చుకున్నాం. రాజ్యాంగం దేశ ప్రజలందరినీ ఒక్క కుటుంబంలా కలిపి ఉంచే సజీవ పత్రం” అని రాష్ట్రపతి అభివర్ణించారు.
మన రాజ్యాంగమే మనందరికీ భారతీయులు అనే సమష్టి గుర్తింపును ఇస్తోందన్నారు. గత కొన్నేండ్లలో వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని, ఫలితంగా రైతులు, కార్మికుల ఆదాయం, ఉపాధి అవకాశాలు అంతే పెరిగాయన్నారు.
కాగా, దేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో మహనీయులను మరచిపోరాదని, అందుకే గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఈ ఏడాదంతా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని రాష్ట్రపతి తెలిపారు.