రెగ్యులర్ గా తినే టైం, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఉపవాసం ముగిశాక పోషక విలువలు ఉన్న ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని డైటీషియన్లు చెబుతున్నారు. అయితే కేవలం తినే తిండి విషయంలోనే కాకుండా పానీయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.
ఉపవాస దీక్షల సమయంలో శరీరంలో శక్తిని కోల్పోకుండా, ఇన్స్టాంట్ ఎనర్జీ అందించేందుకు కొన్ని హెల్తీ డ్రింక్స్ ఉన్నాయి. వాటితోశరీరానికి తగిన హైడ్రేషన్ కూడా అందివ్వొచ్చు. అవేంటో చూద్దాం...
పుదీనా నిమ్మరసం
గ్లాస్ నీళ్లలో గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసి ఒక గంట నానబెట్టాలి. తర్వాత దానికి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి. అంతే.. మింట్ లెమనేడ్ రెడీ. ఈ హెల్తీ డ్రింక్లో లో ఫైబర్, మింట్, విటమిన్-సి.. శరీరానికి తక్షణ శక్తిని అందించి ఉత్తేజంగాఉంచుతాయి.
కర్జూరపాలు
పాలలో కొన్ని కర్జూరాలను వేసి నానబెట్టాలి. ఎంత ఎక్కువసేపు నానబెడితే అవి అంతగా కలిసిపోతాయి. ఉపవాసం ముగిశాక ముందుగా కర్ణురా పాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఉపవాసంతో నీరసించిపోయినవాళ్లకు ఈ డ్రింక్ ఇన్‌స్టంట్ ఎనర్జీ అందించడంతో పాటు షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధం చేస్తుంది.
ఫైబర్ కోసం..
యాపిల్, టొమాటోలలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. పైగా విటమిన్స్, ఐరన్ కూడా అందుతాయి. కాబట్టి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాసు పాలు, నిమ్మరసం, తేనె కలిసి ఆ డ్రింకు ఇఫ్తార్ టైంలో తీసుకుంటే బెటర్. వీటితో పాటు బనానా మిల్క్ షేక్, బాదం షేక్, ఆప్రికాట్ పండ్ల రసం, పుచ్చకాయ రసం, మ్యాంగో లస్సీ, ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.