హుషారెత్తించే జోర్దార్ కతలు

హుషారెత్తించే జోర్దార్ కతలు

కా ళోజీ ప్రస్తావించిన బడి పలుకుల భాష, పలుకుబడుల భాష ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రెండింటిలో ప్రసార మాధ్యమంగా ఏది యోగ్యమైనది? ఆసక్తిదాయకమైనది? అనే ప్రశ్న వేసుకుంటే పలుకుబడుల భాష ప్రజలకు తొందరగా చేరువవుతుంది. ప్రత్యేకించి పిల్లలు తమ పరిసరాల్లో మాట్లాడే భాష తాము చదివే పుస్తకాల్లో కనిపిస్తే మిక్కిలి ఆసక్తిగా ఆ విషయం పట్ల ఆకర్షితులవుతారు. అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో భాషా స్పృహ పెరిగింది అనేది కాదనలేని వాస్తవం. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతపు భాషను ప్రమోట్ చేసుకోవాలనే ఆత్మగౌరవ స్పృహను అలవర్చుకున్నారు. ఇది కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక ప్రధాన హేతువుగా నిలిచింది. 

రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తెలంగాణలో ఇక్కడి ప్రాంతపు భాష గతంలో కంటే కొంత గౌరవాన్ని పొందగలిగింది. పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతమేర పాఠ్యపుస్తకాల్లోనికి ప్రవేశించింది. సినిమా రంగాన్ని సైతం శాసించగలుగుతున్నది. సాహితీవేత్తల్లో ఈ స్పృహ ఒకింత ఎక్కువగా కనిపిస్తున్నది. కానీ బాలసాహిత్యంలో మాత్రం ఇతర సాహితీ ప్రక్రియలతో పోల్చినప్పుడు కాస్త తక్కువ అనే చెప్పాలి. గతంలో మాండలికాల్లో బాల సాహిత్య సృజన చేసిన వాళ్లలో రాయలసీమ మాండలికంలో నామిని సుబ్రమణ్యం నాయుడు ‘మా అమ్మ చెప్పిన కథలు’, ఉత్తరాంధ్ర మాండలికంలో బమ్మిడి సరోజినీ జగదీశ్వరరావు ‘అమ్మ చెప్పిన కథలు’, తెలంగాణ మాండ లికంలో పెండెం జగదీశ్వర్ ‘బడి పిలగాల్ల కథలు’ ఆయా మాండలికాల్లో తొలి కథా సంపుటాలుగా కనిపి స్తున్నాయి. ప్రముఖ బాలసాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ పిల్లల కోసం ఇటీవల వెలువరించిన ‘జోర్దార్ కతలు’ ఈ కోవకి చెందుతాయి.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాల సాహిత్యకారుల్లో లబ్ద ప్రతిష్ఠులు పైడిమర్రి రామకృష్ణ. సుమారు 600 పైగా బాలల కథలు రాసి తెలుగు బాలలకు చేరువయ్యారు. ‘మామయ్య డాట్ కామ్, అనగనగా ఒక అడవి, రంగులరాట్నం, చింటూ గాడి కథలు, మృగరాజు తీర్పు, గుడ్డెలుగు బల్గం, తాంబేలు ఇగురం’ వంటి కథా సంపుటాలు వెలువరించడమే కాక తెలుగులో కృషి చేస్తున్న బాలసాహిత్యకారులను పరిచయం చేస్తూ ‘బాల సాహితీ శిల్పులు’ అనే గ్రంథాన్ని వెలువరించారు. 

ఇది భవిష్యత్తులో బాల సాహిత్యం పై పరిశోధన చేయబోయే పరిశోధకులకు దిక్సూచి లాంటి గ్రంథం.ఇక ‘జోర్దార్ కతల’ విషయానికి వస్తే12 కథల చిరు పుస్తకం ఇది. రాశిలో చిన్నది అయినా భాషాపరంగా పిల్లల్లో విలువలను పాదుకొల్పే దిశగా సమున్నతమైన పుస్తకం. జంతువులను, పక్షులను పాత్రధారులను చేసి  మానవస్వభావాన్ని, మనుషులు అలవర్చుకోవలసిన విలువలను లోకానికి చాటి చెప్పిన కథలివి.

‘పిలవని పేరంటానికి పోకూడద’ని, అలా వెళ్తే అవమానాల పాలయ్యే అవకాశం ఉందని హాస్యస్ఫోరకంగా చెప్పిన కథ ‘ఉల్టా పల్టా’. ‘ఆకొన్న కూడె అమృతము’ అని సుమతీ శతక కారుడన్నట్లు ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన ఆహారం అమృతంతో సమానంగా కనిపిస్తుంది. ఆకలి లేనప్పుడు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా రుచించదు అని చెప్పే కథ ‘బువ్వ సత్రం’.పెద్దల మాట పెరుగన్నం మూట’ అన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాటలు, నేర్పిన విలువలు పిల్లలు విధిగా పాటించాలి అని తెలిపే కథ ‘ఇగురం తక్వ పని’.వ్యాపారంలో మొహమాటానికి పోతే దివాలా తీయక తప్పని పరిస్థితి ఎదురవుతుందని తెలిపే కథ