రిఫ్రిజిరేటర్​ పేలిపోయింది

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఘటన 

కుటుంబీకులకు తప్పిన ప్రమాదం

వర్గల్, వెలుగు : విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో రిఫ్రిజిరేటర్​ పేలిపోయిన ఘటన శుక్రవారం వర్గల్ మండలం గౌరారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థా నికుల వివరాల మేరకు.. గౌరారం గ్రామానికి చెందిన పూదరి రామాగౌడ్ ఉదయమే బిజినెస్​ పనులపై బయటకు వెళ్లారు. అతని భార్య మాధవి టీచర్​గా చేస్తుండడంతో స్కూల్​కు వెళ్లారు. వారి ముగ్గురు పిల్లలు కూడా స్కూల్​కు వెళ్లారు. రామాగౌడ్ తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం వంటింట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. తర్వాత రిఫ్రిజిరేటర్ లో ఉన్న సిలిండర్ పేలడంతో వంటగదిలోని వస్తువులన్నీ ధ్వంసమై చిందరవందరగా పడిపోయాయి. ఇల్లంతా నల్లటి పొగ అలుముకొని గోడలన్నీ నల్లగా మారిపోయాయి. పొగ రావడాన్ని గమనించిన లక్ష్మి బయటకు వెళ్లి విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. గౌరారం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.