మొదటిసారి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల ధ్యాసను మళ్లించడానికి తెలంగాణ కొత్త రాష్ట్రమని, తమ ప్రభుత్వానికి రాజకీయ అస్థిరత ఉందని, విపక్ష నాయకులు, ఆంధ్రా నాయకులు కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రాల విభజన ప్రక్రియా పూర్తికాలేదని, విభజన హామీలను సాధించుకోవాలని కాలయాపన పాలన చేసినాడు. కొంతకాలానికి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని ఫక్తు రాజకీయ పార్టీ అంటూ దిగజారుడు రాజకీయాలకు తెరలేపిండు. ఇతర పార్టీలలో గెలిచిన నాయకులను కలుపుకొని మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత కేసీఆర్‌ది.
అప్పుడూ వారే.. ఇప్పుడూ వారే
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా పెత్తనం చెలాయించిన నాయకుల కులాలను చూస్తే రెడ్లు, రావులు, ఒవైసీ బ్రదర్స్. ఇప్పుడు కే సీఆర్ ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా పెత్తనం చెలాయిస్తున్న నాయకులు కూడా రావులు, రెడ్లు, ఒవైసీ బ్రదర్స్ మాత్రమే. ఈ రెండు ప్రభుత్వాల గత ఇరవై ఏండ్ల పాలన చూస్తే అగ్రకుల, కుటుంబ, వారసత్వ, బంధుప్రీతి, అవినీతితో నిండి ఉన్నది. వీరి ఇద్దరి పాలనా పని తీరు ఒక్కతీరుగానే ఉందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దివంగత రాజశేఖర్ రెడ్డి సాగు నీరు పేరుతో ‘జలయజ్ఞం -ధనయజ్ఞం’గా మార్చిన కాన్సెప్ట్ నే తెలంగాణ యాసలో ‘కోటి ఎకరాల మాగాణికి నీళ్లు’ అని కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి సొమ్మును వరదలా పారించిండు. హైదరాబాద్ విలువైన భూ విక్రయాలు అనుయాయులకు అప్పనంగా అప్పగించే విషయంలో ఆంధ్రా ముఖ్యమంత్రులను దాటిపోతున్నాడు సీఎం కేసీఆర్.
అణగారిన వర్గాలను మరింత అణచేశారు
‘మిషన్ కాకతీయ’, ‘మిషన్ భగీరథ’ పథకాలను కమిషన్ పథకాలుగా మార్చినాడు. పేదలందరికీ ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని శాంపిల్‌గా కొన్ని ఇండ్లు కట్టి రాష్ట్రమంతా ప్రచారం చేసుకున్నాడు. రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్ తన బూర్జువా నిజస్వరూపాన్ని చూపడం మొదలుపెట్టిండు. రాష్ట్ర క్యాబినెట్ లేకుండా వంద రోజులు పాలించిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అరవై మూడు నెలలు మహిళా మంత్రి లేకుండా కేబినెట్ కూర్పు చేసిండు. తన ప్రభుత్వంలో ఒక్క బీసీ మహిళామంత్రి , బీసీ మహిళా ఎమ్మేల్యే లేదు. విచిత్రమేమిటంటే కవితమ్మ మహిళా బిల్లులో బీసీ మహిళలకు వాటా కల్పించాలని కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంది. ఎనభై శాతంపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముప్పై శాతం. ఇరవై శాతం ఉన్న అగ్రవర్ణ కులాలకు, ముస్లిం మైనార్టీలకు 70 శాతం కేబినెట్ లో పదవులు ఇచ్చాడు.
ప్యూడల్ ఆలోచనలు
స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీ వర్గాలకు ఉన్న 34 శాతాన్ని 23శాతానికి తగ్గించాడు. కేసీఆర్ పాలనలో బీసీ ఫెడరేషన్స్‌కు , కార్పొరేషన్స్‌కు పాలక మండళ్లను నియమించలేదు. ఎందుకంటే ఒక నాయీ బ్రాహ్మణుడు, రజక, శాలివాహన, వడ్డెర, పూసల, బట్రాజు, విశ్వ బ్రాహ్మణ, మేదర మొదలగు కులాల నాయకులను చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించాలి, వీళ్లకు చాంబర్, కారు, సిబ్బంది ఏర్పాటు చేయాలి..అవసరమా? భవిష్యతులో వీళ్ళు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు డిమాండ్ చేస్తారు. వీరిని రాజకీయంగా ఆదిలోనే సమాధి చెయ్యాలని, ఈ కులాల వాళ్ళు నాయకులు కావద్దనే ఫ్యూడల్ ఆలోచనతోనే ఏర్పాటు చేయలేదు.
కార్యకర్తలకు ‘బంధు’ల మేత
ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని అకారణంగా, సంజాయిషీ వినకుండా భర్తరఫ్ చేసినాడు. ఒక మహిళా గవర్నర్‌ను అవమాన పరిచిన వ్యక్తి. దేశ ప్రధాని రాష్ట్రానికి అధికారిక పర్యటన చేస్తే ఐదు సార్లకు పైగా మొఖం చాటేసిన ముఖ్యమంత్రి.హుజురాబాద్ ఉపఎన్నికల సందర్బంగా దళిత సామాజిక వర్గం ఓట్లు యాభై వేల పైన ఉన్నాయని దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిండు. మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా గిరిజన బంధు, బీసీ బంధు పథకాలను తీసుకొచ్చిండు. బంధు పథకాలను తనకు బందూకుగా వినియోగిస్తూ బహుజన వర్గాల భుజంపై పెట్టి ప్రతిపక్ష అభ్యర్థులను రాజకీయంగా చంపడానికి ఉపయోగించుకొంటున్నాడు. ఈ బంధు పథకాలకు విధివిధానాలు ఉండవు, షరతులు వర్తించవు, తన ఎమ్మెల్యే చెప్పిన / కమిషన్ ఇచ్చిన కార్యకర్తనే లబ్ధిదారుడు. .
తిప్పిపోతల ప్రాజెక్టు లోపాలు, పెరిగిన అప్పులు
నీళ్ళ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రాష్ట్ర ఖజానాకు గుదిబండలా మార్చారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనితీరు గమనిస్తే తిప్పిపోతల ప్రాజెక్ట్‌గా పేరుగాంచింది. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడే సాంకేతిక, డిజైన్, నిర్మాణ లోపాలు బయటపడ్డాయి . ఈ ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా లక్ష కోట్లు దాటింది. నిధుల విషయానికి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండు. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర జీ ఎస్డీ పీలో 25 శాతం మించి ఉండ కూడదని ఎఫ్ ఆర్ బీ ఎం చట్టం నిర్దేశిస్తుంది. కానీ, 38శాతానికి పెరిగిపోయాయి. రాష్ట్ర బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు మొత్తం రూ.5,01588 కోట్లు.
అమ్మకాలతో నడుస్తున్న పాలన
2014లో రాష్ట్రానికి మద్యంపై ఆదాయం రూ . 12 వేల కోట్లు, ఇప్పుడు 40వేల కోట్లు . మద్యం ఆదాయంపై ఆధారపడి రాష్ట్రాన్ని నడుపుతున్నారు . హైద్రాబాద్ భూములు అమ్మి ఉపఎన్నికల్లో డబ్బులు పంచి గెలుస్తుంది . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఒకటో తేది నుంచి 15 తేది వరకు ఇస్తున్నారు . సర్పంచులకు కాంట్రాక్టర్లకు సంవత్సరములుగా బకాయిలు చెల్లించడం లేదు . కేసీఆర్ పాలనా తీరుచూస్తే స్వపక్ష , విపక్ష నాయకులకు కే సీఆర్ దర్శనమే లేదు . కే సీఆర్ రాష్ట్ర పాలనను ఆటో పైలెట్ మోడ్ పెట్టి వ్యవసాయం చేసుకునే ప్రపంచంలోనే మొదటి ముఖ్యమంత్రి . నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకున్నా, కనీసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక పరీక్షలు సక్రమంగా నిర్వహించే సత్తా లేని ప్రభుత్వం ఇది.
భాగస్వామ్యమిచ్చే పార్టీకే బడుగుల ఓటు
ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి ఏర్పాటు చేసిన టీఆర్ఎస్. జాతీయ నినాదంతో బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది. కానీ, ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాలలో ఎందుకు పోటీ చెయ్యడం లేదు. అంటే పేరు జాతీయం, పోటీ రాష్ట్రంలోనేనా . కల్వకుంట్ల కుటుంబ పార్టీది ఏ స్థాయి అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ప్రజలు గెలిపించకపోతే రెస్టు తీసుకుంటామంటూ నైతిక ఓటమిని ఒప్పుకున్నాడు. అణగారిన వర్గాల అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల జరగదని గత అనేక దశాబ్దాల అనుభవం రుజువు చేస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు అణగారిన వర్గాలు "అధికారం మాకు కావాలనే చైతన్యంతో ఉన్నారు. . అధికారంలో తమ తమ వర్గాలకు భాగస్వామ్యం కల్పించే పార్టీలనే గెలిపించుకోవాలని నిర్ణయంతో ఉన్నారు. మాకు అధికారం కావాలనే చైత్యనంతో ఉన్నారు.
-సూర్యపల్లి శ్రీనివాస్ ,
స్టేట్ కన్వీనర్ , బీజేపీ రీసెర్చ్ అండ్ పాలసీ డివిజన్