ప్రాంతీయ అసమానతలు

ప్రాంతీయ అసమానతలు

 పెట్టుబడులు: సంస్కరణ తర్వాత అభివృద్ధి చెందిన రాష్ట్రాలకే మొత్తం పెట్టుబడుల్లో 69.2 శాతం తరలిపోయాయని ఎన్​జే కురియన్​ తన పరిశోధనలో పేర్కొన్నారు. అదేవిధంగా అఖిల భారత స్థాయి విత్త సంస్థలైన ఐడీబీఐ, ఐఎఫ్​సీఐ, ఐసీఐసీఐ, ఎల్​ఐసీ, జీఐసీ, ఐఆర్​బీఐ, ఎస్​ఐడీబీఐ తదితర సంస్థలు అవి అందించిన సహాయంలో 67 శాతం అభివృద్ధి చెందిన రాష్ట్రాలే వినియోగించుకున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఒక్కదానికే ఇచ్చిన బ్యాంకు రుణాలు, వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ కలిపి ఇచ్చిన రుణాల కంటే ఎక్కువ. 

దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందడం, మరికొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉండటం, రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం, కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటాన్ని ప్రాంతీయ అసమానతలుగా పిలుస్తాం. ఆర్థిక అంశాల్లో మహారాష్ట్ర ప్రగతి పథంలో ఉన్నా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో అసమానతలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలు కనిపించాయి. అయితే, ప్రాంతీయ అసమానతలు కొలవడం క్లిష్టమైన ప్రక్రియ. 

తలసరి ఆదాయంలోని వ్యత్యాసాల ద్వారా సాధారణంగా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు గణిస్తారు. ఇది రాష్ట్రంలోని అసమానతలను తెలియజేయదు. పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్దిలోని తేడాలు, రాష్ట్రాల్లో అక్షరాస్యత స్థాయి, మొత్తం పనివారిలో మాన్యుఫాక్చరింగ్​ రంగంలోని పనివారి వాటా, రోడ్ల పొడవు, శిశుమరణాల రేటు మొదలైన ప్రాంతీయ అభివృద్ధిలోని వ్యత్యాసాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

ఎన్​ఎస్​డీపీ వృద్ధిరేటు: ప్రాంతీయ అసమానతలు తెలియజేసే ప్రధాన సూచీల్లో ఎన్​ఎస్​డీపీ వృద్ధిరేటు ఒకటి. ఈ సూచీలో 2020–21లో మణిపూర్​, పశ్చిమబెంగాల్​ ఉండగా, మిజోరాం, ఉత్తరప్రదేశ్​ చివరిలో ఉన్నాయి. సంస్కరణల తర్వాత అభివృద్ధి చెందిన రాష్ట్రాల వృద్దిరేటు వెనుకబడిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. అయితే, 2004–05 తర్వాత వెనుకబడిన రాష్ట్రాల, ఆర్థికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాల వృద్ధిరేట్లు రెండూ మెరుగ్గా కనిపిస్తున్నాయి.

తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు: ప్రధాన రాష్ట్రాల్లో 1960–61లో తలసరి ఆదాయంలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండేది. ఈ మధ్య హర్యానా ప్రథమ స్థానంలోకి  వచ్చింది. 2020–21లో పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. బిహార్​ తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. హర్యానా, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్​, తెలంగాణ రాష్ట్రాలు అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉండగా, బిహార్​, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్​, అసోంలు తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి. 

అవస్థాపనా సదుపాయంలో వ్యత్యాసాలు: అవస్థాపన సౌకర్య సూచీలు అయిన తలసరి విద్యుత్​ వినియోగం, వాహనాల రిజిస్ట్రేషన్​, రోడ్ల పొడవు, టెలికం కనెక్షన్లు, సాగు భూమిలో నీటి సౌకర్యాలు ఉన్న భూమి శాతం మొదలైన ప్రాంతీయ వ్యత్యాసాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

సాంఘిక, అవస్థాపన, మానవాభివృద్ధి: ఆర్థికాభివృద్ధి ప్రాథమిక లక్ష్యం మానవ సంక్షేమం. సాంఘిక రంగంలో కేరళ మంచి ప్రగతిని కనబరుస్తుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు తక్కువ తలసరి ఆదాయాలు కలిగి ఉన్నా అధిక మానవాభివృద్ధిని సాధిస్తున్నాయి. దీనికి విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడి పెట్టడమే కారణం. కేరళ అక్షరాస్యత(94 శాతం), స్త్రీ అక్షరాస్యత (91.9 శాతం), లింగ నిష్పత్తి (1084), శిశు మరణాల రేటు (10)లో మెరుగ్గా ఉంది. మరోవైపు బిహార్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లు మానవాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. హర్యానా, పంజాబ్​లు ధనిక రాష్ట్రాలైనా అక్షరాస్యత స్త్రీ, పురుష నిష్పత్తిలో వెనుకబడి ఉన్నాయి. అంటే ఒక సమాజంలో తలసరి ఆదాయమనేది ఆర్థిక, సామాజిక ప్రగతికి సరిపడినంత కొలమానం కాదు. అయితే, పేద రాష్ట్రాలు కూడా హెచ్​డీఐ విలువను మెరుగుపర్చుకుంటున్నాయి.

పేదరిక ప్రభావం: పేదరికం కూడా వెనుకబాటుతనానికి సూచీయే. 2011–12 ఎన్​ఎస్​ఎస్​ఓ  వారి 68వ రౌండ్​లో భారత పేదరికం 21.9 శాతం ప్రధాన రాష్ట్రాలు తీసుకుంటే కేరళ, హిమాచల్​ప్రదేశ్, పంజాబ్​ల్లో పేదరిక శాతం తక్కువగా, చత్తీస్​గఢ్​, జార్ఖండ్​ల్లో పేదరికం ఎక్కువగా ఉంది. 

పారిశ్రామిక అభివృద్ధి అసమానతలు: మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, తమిళనాడులను తీసుకుంటే పారిశ్రామిక కేంద్రీకరణ కొన్ని ప్రాంతాలకే కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఈ నాలుగు రాష్ట్రాల జనాభా దేశ జనాభాలో 25 శాతం. కానీ,  2004–05 సంవత్సరానికి ఫ్యాక్టరీ ఉపాధిలో 45 శాతం, పెట్టుబడిలో 46 శాతం, ఉత్పత్తిలో 52 శాతం ఉంది. అంటే పారిశ్రామిక అభివృద్ధిలో ప్రాంతాల వారీ అసమానతలు కనిపిస్తున్నాయి.

వ్యవసాయాభివృద్ధిలో అసమానతలు: పంజాబ్, హర్యానా, ఉత్తర్​ప్రదేశ్​లోని కొన్ని భాగాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అధిక ప్రగతిని కనబరుస్తున్నాయి. దీనికి కారణం నూతన  వ్యవసాయ వ్యూహం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం. 

ఇతర సూచీలు: మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం, తలసరి విద్యుత్​ వినియోగం, తలసరి బ్యాంకు డిపాజిట్లు కూడా ప్రాంతీయ అసమానతలు సూచిస్తాయి.

పట్టణీకరణ: అభివృద్ధి జరిగేటప్పుడు అక్కడ పట్టణ జనాభా శాతం కూడా పెరుగుతుంది. 2011 జనాభా లెక్కల్లో ఇండియా పట్టణ జనాభా శాతం 31.2 శాతం కాగా, తమిళనాడు 48 శాతం. మహారాష్ట్ర, గుజరాత్​ల్లో కూడా జాతీయస్థాయి కంటే ఎక్కువగా ఉంది. బిహార్​ 11 శాతం, అసోం 14 శాతం చాలా తక్కువగా ఉంది.
తలసరి విద్యుత్​ వినియోగం: 2016–17లో తలసరి గృహ విద్యుత్​ వినియోగం 938 కేడబ్ల్యూహెచ్​ అయితే పంజాబ్​లో 1916 కేడబ్ల్యూహెచ్ కాగా, బిహార్​లో 242 కేడబ్ల్యూహెచ్​గా ఉంది. 

కారణాలు

  •  సహజ సిద్ధమైన అంశాలు: భౌగోళికంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంఘటితమై ఉండకపోవడం.
  • సహజ వనరులు: సహజ వనరులు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో పెట్టుబడులు ఎక్కువగా తరలివచ్చి అభివృద్ధి చెందును.
  • చారిత్రక అంశాలు: అవస్థాపన, మార్కెటింగ్, వాణిజ్య సౌకర్యాలు ఎక్కువగా ఉన్నచోట ఆంగ్లేయులు ఎక్కువ పెట్టుబడులను ప్రోత్సహించారు.
  • హరిత విప్లవం: నీటిపారుదల సదుపాయాలు ఎక్కువగా ఉన్న పంజాబ్​, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్​ల్లో హరిత విప్లవం ప్రవేశపెట్టడంతో అక్కడ రైతుల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపడ్డాయి. నీటి వసతి లేని కరువు ప్రాంతాలు, ఈశాన్య భారత్​లో హరిత విప్లవం విస్తరించకపోవడంతో అక్కడ వెనుకబాటుతనం కనిపిస్తుంది.
  • ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర: పంజాబ్, హర్యానా, గుజరాత్​, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలు ప్రైవేట్​ పెట్టుబడులను ఆకర్షించడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేశాయి. మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, అంతర్గత పోటీలు, ప్రజా ఆకర్షణ విధానాల వల్ల ఆశించినంతగా పెరగలేదు.
  • నూతన ఆర్థిక సంస్కరణలు: సంస్కరణలు పరిశ్రమ స్థాపించడంలోని అవరోధాలను తగ్గించాయి. దీంతో విదేశీ సంస్థలు అవస్థాపనా సదుపాయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడి పెట్టాయి. అంటే సంస్కరణల ఫలాలు వెనుకబడిన ప్రాంతాలకు చేరలేదు.