ప్రాంతం పేరుతో ప్రాంతీయ పార్టీలు పుడుతుంటాయి. ప్రాంతం కోసం పుట్టుకొచ్చిన పార్టీలుగా చెలామణి అవుతుంటాయి. అధికారం చేపట్టాక కుటుంబ పార్టీలుగా మారిపోతుంటాయి. కుటుంబాలకు అతీతంగా కొనసాగుతున్న బిజూ జనతాదళ్ వంటి ఒకటీ అరా పార్టీలు ఉన్నా.. అత్యధిక ప్రాంతీయ పార్టీలు కుటుంబపార్టీలుగా మారాయి. ఉత్తరాన యూపీ, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా.. దక్షిణాదిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీల ప్రభావం తెలిసిందే. అయితే ప్రాంతీయ పార్టీలతో ఆయా ప్రాంతాలకు జరిగిన ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ, అధినేతల స్వప్రయోజనాలే రాజ్యమేలుతుంటాయి. మన ఫెడరల్ వ్యవస్థలో అదొక చేదు అనుభవం.
నిజానికి ప్రాంతీయ పార్టీలు మన ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేస్తాయని కొందరు మేధావులు బాగా నమ్ముతూ వచ్చారు. కానీ ఆ పార్టీలు ఫెడరలిజం నిర్వచనాన్ని కుటుంబ, కేంద్రీకృత పాలనగా మార్చేసుకున్నాయి. ప్రాంతంపై ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునేందుకు వ్యవస్థలను చెరపట్టడం తమ నైజంగా మార్చుకున్నాయి. అది ప్రాంతీయపార్టీ అధినేతల సహజధోరణిగా మారిపోయింది. కాకపోతే, ఈ ధోరణి కొన్ని పార్టీల్లో తక్కువ, మరికొన్ని పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పథకాల ఎరలతో ప్రజలను ఓటు యంత్రాలుగా మార్చుకునే విద్యలో కుటుంబపార్టీలు రాటుదేలిపోయాయి. శాశ్వత పాలకులం మేమే అనే విపరీత ధోరణి ఆ పార్టీ అధినేతల ఆలోచనల్లో, విధానాల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది.
రాజకీయ ప్రతీకారాలు
ఆంధ్రప్రదేశ్‌లోనూ బలమైన ప్రత్యర్థులుగా రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఘర్షణాత్మక రాజకీయాలు దశాబ్ద కాలంగా అందరికీ సుపరిచితమే. 2014 నుంచి19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ, తన ప్రత్యర్థిపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ‘జైలుపక్షి’ అని నిందించింది. వేల కోట్ల అవినీతి పరుడని నిందిస్తూ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ మీ నాన్నే నన్ను ఏమీ చేయలేకపోయాడు.. నా రాజకీయ అనుభవం అంత ఉండదు.. నీ వయసు నువ్వేం చేస్తావ్’ అని హెచ్చరించాడు కూడా. ఇంకేముంది.. స్కిల్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు అవినీతి ఆరోపణతో చంద్రబాబు జైలులో రిమాండ్‌లో ఉన్నారిప్పుడు! ఈ తంతు చంద్రబాబును కూడా జైలు పక్షిగా మార్చామనే చెల్లుకు చెల్లు నీతి బోధకు నిదర్శనమా అనే చర్చ నడుస్తోంది.
ఏపీలో రెండు కుటుంబపార్టీల యుద్ధం ఇది. ప్రజా సమస్యలు గాలికొదిలి నేతలు ఆడుతున్న పొలిటికల్ బ్లేమ్గేమ్అని చర్చ! అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారిని ప్రజలు ఓడించిన దాఖలాలేమీ లేవు.అందుకు జగనే ఓ ఉదాహరణ. అలాగే, ఇవాళ అవినీతి ఆరోపణపై రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును కూడా ప్రజలు ఓడించాలనే రూలేమీ లేదు. నీతివంతమైన పాలన కోసం జగన్ అవినీతిపై యుద్ధం ప్రకటించారని అక్కడి ప్రజలు కూడా అనుకుంటున్నది లేదు. అప్పట్లో తన పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకున్న చంద్రబాబును జగన్ ఎలా మర్చిపోతారు! ఆ ప్రతీకార రాజకీయం.. రాజధాని అమరావతిని మార్చేదాకా తీసుకుపోయి ఉంటుంది!
ప్రాంతీయ పార్టీల రాజకీయాలు రాజధాని లాంటి ప్రజాప్రయోజనాన్ని కూడా లెక్కచేయవు! తమ ప్రతీకార రాజకీయాలను మాత్రమే అవి లెక్కించుకుంటాయి! రాజకీయాల్లో ఉండాల్సింది వైరుధ్యం త ప్ప శత్రుత్వం కాదు! కానీ ఏపీ పార్టీలు రాజకీయానికి కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకోవడం సమాజానికి మంచి పరిణామమే కదా అనే వాళ్లూ ఉంటారు! ఉద్దేశం మంచిదైతే దాన్ని ఆహ్వానించని వారెవరుంటారు? చిన్నపాటి అవినీతి కేసులతో ప్రత్యర్థిని రాజకీయంగా పెద్ద దెబ్బకొట్టడం కూడా ఒక కళనే!
ALSO READ: నేనిచ్చే వినాయక విగ్రహమే పెట్టాలె.. పోటీ పడుతున్న లీడర్లు
అవినీతి ఎక్కువ
ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అవినీతి ఎక్కువ. జవాబుదారీతనం పెద్దగా కనిపించదు. తాము చెప్పిందే వేదంగా పరిపాలన సాగుతుంటుంది. కేంద్రీకృత అవినీతి పెరుగుతుంటుంది. బీహార్‌లో లాలూ, తమిళనాడులో జయలలిత, కరుణానిధి, శశికళ, హర్యానాలో ఓంప్రకాశ్ చౌతాలా అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. వారంతా కుటుంబపార్టీలకు చెందిన అధినేతలు, ముఖ్యనేతలే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు సుమారు 35 ఏండ్లు కొనసాగాయి. ఆ కాలంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు దాన్నో అవకాశంగా తీసుకొని విపరీత అవినీతికి పాల్పడ్డాయి. ఇవాళ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నా కూడా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. కుటుంబపార్టీల ధోరణిలో మార్పు అంతకన్నా లేదు.
ప్రాంతీయపార్టీలే రాష్ట్రాల్లో అవినీతి అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. రెండు బలమైన ప్రాంతీయపార్టీలు ఉన్న రాష్ట్రాల్లో వాటి ఘర్షణాత్మక, కక్షా రాజకీయాలకు అవినీతిని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే మధ్య జరిగిన ప్రతీకార రాజకీయాలను చూశాం. నిండు అసెంబ్లీలో జయలలిత వస్త్రాన్ని లాగడం, ఆమెపై అవినీతి కేసులు, ఆమె జైలు జీవితం.. ఇలా ప్రాంతీయ పార్టీల ప్రతీకారరాజకీయాలకు అదోపరాకాష్ట. జయలలిత తిరిగి అధికారంలోకి వచ్చాక, కరుణానిధిపై అవినీతి కేసులు, ఆయన అరెస్టుతో జయలలిత తన ప్రతీకార రాజకీయ ప్రతాపాన్ని రుచి చూపించింది. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి ప్రతీకార రాజకీయాలు సహజ పరిణామంగా మారిపోతున్నది.
ఓటుకు నోటు ఏమాయె?
ఫెడరలిజంలో పవర్ డిసెంట్రలైజ్ జరుగు తుందనుకున్నాం. కానీ దాన్ని కుటుంబ పార్టీలు సెంట్రలైజ్ చేసుకున్నాయి. కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను తమ సొంత సంస్థానాలుగా మలుచుకుంటున్నా యి. ఇపుడు ఏపీలో రెండు కుటుంబపార్టీలు పోటీ పడుతున్నది ఆ విషయంలోనే! రెండు ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో అవి ఫక్తు శత్రుపూరిత రాజకీయాలను ఆశ్రయి స్తున్నాయి. కానీ తెలంగాణలో మరో విచిత్ర మైన పరిస్థితి. ‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన’ అనే కేసీఆర్.. ఉద్యమ పార్టీ అని చెప్పుకొని, దాన్నో కుటుంబ పార్టీగా మార్చుకో వడం గమనార్హం.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ‘ రాజీ రాజకీయాలు’ తెలంగాణ కుటుంబ పార్టీకి శ్రీరామ రక్షగా మారాయని ప్రజల్లోనే చర్చ ఉంది. ఇకపోతే, కేసీఆర్ ప్రభుత్వ మే వెలికితీసిన ‘ఓటుకు నోటు’ అవినీతి కేసు కోల్డ్ స్టోరేజీలో ఉంది ఎందుకో తెలియదు! ఆ కేసును ఆధారం చేసుకొని కేసీఆర్ పొందిన రాజకీయ లబ్ధికి మాత్రం లెక్కనే లేదు! అదే కేసులో చంద్రబాబును కూడా జైలుకు పంపిస్తా మన్నారు! ఆ కేసును పొలిటి కల్ మైలేజ్ కి ఒక బ్రహ్మాస్త్రంగా మార్చుకున్నారు. ఎప్పుడు రాజకీయ ఆపద వచ్చినా అమ్ముల పొది నుంచి ఆ బ్రహ్మాస్త్రాన్ని వెలికి తీసి వాడుతుం టారు! ఆ కేసు ఇపుడు కళ్లకు కనపడదు, చెవులకు వినపడదు! పొలిటి కల్ మైలేజ్ కోసం మాత్రం ‘గ్రావిటీ వాటర్’లాగా కేసీఆర్ ఆ కేసును ప్రచారానికి వాడు తూనే ఉంటారు!
అందరూ ఆశ్చర్యపోయే దేమిటంటే.. చంద్రబాబును ‘విలన్’గా చూపించి రాజకీయంగా బతకనేర్చిన కేసీఆర్.. ఓటుకు నోటు కేసుపై మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం ఏమిటనేదే డాలర్ల ప్రశ్న! తమ కోసం, తమ కుటుంబం కోసం, తమ వారసత్వ రాజకీయం కోసం బతికే ఇలాంటి ప్రాంతీయ పార్టీలు.. ప్రాంతం కోసమో, రాష్ట్రం కోసమో మాత్రమే బతుకుతున్నాయని అనుకోవడమే ఒక భ్రమ!
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్