సిద్ధాంతాలు, రాద్ధాంతాల గొడవలను లోకల్ పార్టీలు పట్టించుకోవు. వాటి సంగతి ఎట్లున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటాయి. కేంద్రంలో ఎవరి సర్కార్ ఉన్నా మెడ మీద కత్తి పెట్టి డిమాండ్లు సాధించుకుంటాయి. అందుకే ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారు….పట్టం కడుతున్నారు. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ దళపతుల హవాయే కొనసాగుతోంది.
దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలదే పెత్తనం సాగుతోంది. పేరుకు ఎనిమిది జాతీయ పార్టీలున్నాగానీ, వాటిలో కాంగ్రెస్, బీజేపీ మినహా మిగతావన్నీ తమ తమ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో, బహుజన సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో, నేషనల్ పీపుల్స్ పార్టీ మేఘాలయలో బలంగా పనిచేస్తున్నాయి. కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు కేరళలో తప్ప మరెక్కడా చెప్పుకోదగ్గ స్థితిలో లేరు. ఈ ఎనిమిది పార్టీలు కాకుండా దేశంలో 53 ప్రాంతీయ పార్టీలున్నాయి. టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్నాడీఎంకే, బీజేడీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీలు తమ హెడ్క్వార్టర్స్న్న రాష్ట్రాల్లో అధికారం అనుభవిస్తున్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రీజనల్ పార్టీలు బాగా చక్రం తిప్పాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఫుల్ మెజారిటీతోనూ, హర్యానాలో లోకల్ పార్టీ సహాయంతోనూ జాతీయ పార్టీ బీజేపీ అధికారం దక్కించుకోగా, మిగతా మూడు చోట్ల ప్రాంతీయ పార్టీలదే హవా సాగింది.
జాతీయ పార్టీలు దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జనం ముందుకు తెచ్చి ప్రచారం చేసుకుంటాయి. ప్రాంతీయ పార్టీలు లోకల్‌గా జనాలకు కావలసిన సదుపాయాలు, ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాల్ని చెప్పుకుంటాయి. తాము ఇచ్చే హామీలను నెరవేర్చే బాధ్యతకూడా రీజనల్ పార్టీలపైనే ఉంటుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ తక్షణ అవసరాలు ఎవరు తీర్చగలరో చూసి వాళ్లకే ఓట్లేస్తున్నారు. అలాగే, లోకల్‌గా కులం, మతం, ప్రాంతం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తుంటాయి. హర్యానాలోనూ, మహారాష్ట్రలోనూ ఫలితాల్ని తారుమారు చేసినవి అవే అంశాలు. జార్ఖండ్ లాంటి చోట ట్రైబల్ హక్కులకు కేర్‌టేకర్‌గా ఉంటానని జార్ఖండ్ ముక్తి మోర్చా బలంగా చెప్పగలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఢీ అంటే డీ అన్నట్లుండే కమ్మ, రెడ్డి కులాల మధ్య కాపులు తమ శక్తి ఎలాంటిదో తెలియజేశారు. తమను తక్కువ అంచనా వేయొద్దనే హెచ్చరికను కాపులు అసెంబ్లీ ఎన్నికల్లో చాటుకున్నారు. ఒడిశాలో వరుసగా అయిదోసారి బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్‌కి జనం పట్టం గట్టడానికి కారణం… ఆయన సంక్షేమ కార్యక్రమాలు, తుఫాన్ సహాయక చర్యల్లో శ్రద్ధ చూపడమే! లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్ చేసిన హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో… బీజేపీ దెబ్బతినడం వెనుక లోకల్ ఇష్యూలున్నాయి. జనాలు వాటిపై ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తారో అసెంబ్లీ ఎలక్షన్లను చూస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2019లో రీజనల్ పార్టీల విజయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
ప్రాంతీయ పార్టీల పుట్టిల్లు తమిళనాడు
ప్రాంతీయ పార్టీలంటేనే తమిళనాడు. అలాగే తమిళనాడు అంటేనే ప్రాంతీయ పార్టీలుగా మారింది. మనదేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టింది తమిళనేలపైనే అంటారు. ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టిన డీఎంకే ఆ తరువాత అన్నా డీఎంకే వంతుల వారీగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరగొచ్చు. ఏదైనా మహాద్భుతం అంటూ జరిగితే తప్ప తమిళనాడులో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా తక్కువ.
తమిళనాడులో జయలలిత, కరుణానిధి లేకపోవడంతో రాజకీయంగా ‘ఖాళీ’ ఏర్పడింది. దానిని భర్తీ చేయడంలో డీఎంకే ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ తన వంతు ప్రయత్నాలు జోరుగానే సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు 38 స్థానాలు గెలుచుకుని డీఎంకేని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. ఇక్కడ 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా పార్టీకి అట్టడుగు కార్యకర్తల స్థాయిలో బలం తేవడానికి వ్యూహరచన చేస్తున్నారు స్టాలిన్. ఈ ఏడాది మూడు దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోకూడా డీఎంకే బాగానే పుంజుకుంది. అధికార అన్నాడీఎంకే చేతిలోని 12 సీట్లను తమ ఖాతాలో చేర్చుకుంది. తమిళనాడులో ప్రవేశించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్ని స్టాలిన్ గట్టిగా అడ్డుకోగలరని ఎనలిస్టులు
అంచనా వేస్తున్నారు.
పేరులోనే ఉంది
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) …పేరులోనే రాష్ట్రం పేరు పెట్టుకున్న పార్టీ. దేశంలో పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల కల్చర్ కు జేఎంఎం అద్దం పడుతోంది. జస్ట్ రెండు రోజుల క్రితమే రిజల్ట్స్ వచ్చిన జార్ఖండ్‌లో లోకల్ పార్టీ జేఎంఎంకి జనం పట్టం గట్టారు. ఈ రాష్ట్రంలో 14 లోక్‌సభ సీట్లుండగా, అయిదు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 12 (బీజేపీ 11, ఏజేఎస్‌యూ1) గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీకి దిగి అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీలోని 81 సీట్లకుగాను లోకల్ పార్టీ జేఎంఎం 30 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. రెండేళ్ల క్రితం ఆదివాసీ భూములపై హక్కులు హరించేలా రఘువర్ దాస్ (బీజేపీ) ప్రభుత్వం రెండు సవరణలు తెచ్చింది. వీటిని జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ గట్టిగా అడ్డుకున్నారు.
రెండూ మరాఠా పార్టీలే
ఎన్సీపీ నిజానికి జాతీయ పార్టీ అయినా మహారాష్ట్రకు చెందిన ప్రాంతీయ పార్టీగానే గుర్తింపు తెచ్చుకుంది. అటు ఎన్సీపీ ఇటు శివసేన రెండు పార్టీల్లోనూ మరాఠా కల్చరే ఎక్కువ. ఈ ఏడాది జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహారాష్ట్ర ఫలితాలే హైలైట్ అని చెప్పాలి. అసెంబ్లీలోని 288 సీట్లకు ఎలక్షన్స్ జరగ్గా, మేజిక్ ఫిగర్ 145 ఏ పార్టీకీ రాలేదు. గతంలో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఈసారి కలిసి బరిలో దిగినా ప్రయోజనం దక్కలేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో ప్రాంతీయ పార్టీ అయిన శివసేన పవర్ షేరింగ్‌కి బేరం పెట్టింది. బీజేపీ ఒప్పుకోకపోయేసరికి శివసేన అలిగి దూరం జరిగింది. సుమారుగా నెల రోజులపాటు మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగాయి. చివరికి మరో ప్రాంతీయ పార్టీ ఎన్సీపీ చొరవ తీసుకుని, శివసేనను కాంగ్రెస్‌ని కలిపింది. ఉద్ధవ్ థాక్రే సీఎంగా మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడింది.
ఇదే బాటలో హర్యానా
హర్యానాలో కూడా లోకల్ ఫీలింగ్ ఎక్కువైందని అనడానికి జన్ నాయక్ జనతా పార్టీ ( జేజేపీ) నే రుజువు. ప్రాంతీయ అభిమానానికి తోడు జాట్ కులాభిమానం కూడా జన్ నాయక్ జనతా పార్టీకి కలిసొచ్చింది. నాన్ జాట్ కేండిడేట్‌ని సీఎంగా పెట్టి హర్యానాలో ప్రయోగం చేసిన బీజేపీకి ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో జాట్లదే ఆధిపత్యం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లలో బీజేపీ 40 సీట్లే గెలిచింది. మేజిక్ ఫిగర్‌కి ఆరు సీట్లు తక్కువ కావడంతో… జాట్ కులస్తుడు దుష్యంత్ సింగ్ చౌతాలాని కలుపుకోక తప్పలేదు. ఈ ఎన్నికల్లో దుష్యంత్ చుట్టూనే రాజకీయం సాగింది. దుష్యంత్ కొత్తగా జననాయక్ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లోనే 10 సీట్లు గెలిచి తమ సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.
ఒడిశా పార్టీ వైపే ఓటర్లు
ఒడిశాలో నవీన్ పట్నాయక్ వరుసగా అయిదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, నేచురల్ రీసోర్సెస్ సద్వినియోగం, తుఫాన్ తదితర బీభత్సాల్లో సరైన చర్యలు చేపట్టడం నవీన్‌కి కలిసొస్తున్నాయి. తండ్రి బిజూ పట్నాయక్ వారసుడిగా నవీన్ రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన స్థాపించిన బిజూ జనతా దళ్ (బీజేడీ) 2000లో మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చింది. అప్పటినుంచి జరిగిన అయిదు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ గెలుస్తూ వస్తోంది. మొదట్లో ఎన్డీయేలో ఉండేవారు నవీన్ పట్నాయక్. అయితే, కాంధమల్లో 2007లో మతపరమైన హింస జరగడంతో ఆయన బయటకొచ్చేశారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ సీఎం పీఠాన్ని నిలుపుకుంటున్నారు. ఈ టర్మ్ కూడా పూర్తి చేసుకుంటే వరుసగా 24 ఏళ్ల 293 రోజులపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు నవీన్ పట్నాయక్‌కి దక్కుతుంది. ఇప్పటివరకు ఉన్న రికార్డు పవన్‌కుమార్ చామ్లింగ్ (24 ఏళ్ల 165 రోజులు) పేరు మీద ఉంది.
ఏపీలో వచ్చిందీ రీజనల్ పార్టీనే
అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ టీడీపీని ఓడించి ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రాంతీయ పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 36 ఏళ్లనాటి తెలుగు దేశం పార్టీని… పదేళ్ల వయసైనా లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మట్టి కరిపించింది. 175 సీట్ల ఏపీ అసెంబ్లీలో 151 స్థానాలు గెలుచుకుని ఎవరూ ఊహించనివిధంగా అధికారానికొచ్చింది. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు మచ్చుకు ఒక్క సీటైనా దక్కలేదు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ సీపీ కేండిడేట్లు కొత్తవాళ్లయినాగానీ మంచి మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో కులాల మధ్య బాగా చిచ్చు రేగింది. రాజధాని అమరావతి విషయంలో ఒక కులానికే చంద్రబాబునాయుడు కొమ్ము కాస్తున్నారని జనం భావించారు. రాష్ట్రంలో బలంగా ఉన్న కాపులు తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న కసితోకూడా టీడీపీని ఓడించారు.