యాదాద్రి : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తిరిగి మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా రాయగిరి బాధితులు ఆందోళన బాటపట్టారు. బ్యానర్లు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ యాదాద్రి కలెక్టరేట్‌లోకి దూసుకొచ్చారు. గ్రీవెన్స్‌లో కలెక్టర్ పమేలా సత్పతిని చట్టుముట్టి భైఠాయించారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుస్తూ ఆగస్టు 23న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మారిన అలైన్మెంట్తో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోనే దాదాపు 71 మంది రైతులకు సంబంధించిన 242.10 ఎకరాలను సేకరించాల్సిఉంటుంది. మారిన అలైన్మెంట్ కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని రాయగిరి రైతు కుటుంబాలు రోడ్డెక్కాయి.
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా గ్రీవెన్స్ హాలులోకి దూసుకెళ్లారు. కొంతమందికోసం మొదటి అలైన్మెంట్మార్చి మా భూములు లాక్కుంటారా.? అంటూ ప్రశ్నించారు. పంటలు పండించుకుంటున్న భూములను లాక్కుంటే మేమేలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని ఇది తమ పరిధిలో లేని అంశమని, అలైన్మెంట్ విషయంలో వెంటనే ప్రభుత్వానికి లెటర్ రాస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన
విరమించారు.