ట్రిపుల్​ఆర్ సౌత్ డీపీఆర్కు ఏజెన్సీ ఫైనల్

ట్రిపుల్​ఆర్ సౌత్ డీపీఆర్కు ఏజెన్సీ ఫైనల్

హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ డీపీఆర్ కు టెండర్ ఫైనల్ అయింది. ఐదు కంపెనీలు టెండర్ దాఖలు చేయగా తక్కువకు కోట్ చేసిన ఒక కంపెనీని అధికారులు ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఫైల్ను ఆర్ అండ్ బీ అధికారులు సీఎం ఆమోదానికి పంపారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక టెండర్ దక్కించుకున్న కన్సల్టెంట్ ఏజెన్సీ వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. షీలాదిన్ అసోసియేట్, సీనెక్, ఎస్ఏ ఇన్ ఫ్రా, ఎల్ యూ అసోసియేట్, ఆర్ వీ అసోసియేట్ టెండర్లు దాఖలు చేశాయి. టెండర్ దక్కించుకున్న కన్సల్టెన్సీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ డీపీఆర్కు ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు పిలవగా సరైన స్పందన రాకపోవడంతో రెండో సారి పిలిచారు. సౌత్ పార్ట్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజ్ఞప్తి చేసింది. ఈ రహదారి మంజూరైనప్పుడు ఖరారైన అలైన్‌‌మెంట్‌‌ ప్రకారం చౌటుప్పల్‌‌-–ఆమనగల్‌‌-–సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఆలోచనతో ప్రైమరీ అలైన్‌‌మెంట్‌‌లో మార్పులు చేశారు. దీంతో మరో 11 కిలోమీటర్లు పెరిగి రోడ్డు మొత్తం 200 కిలోమీటర్లు అయింది. ఈ మొత్తానికి డీపీఆర్‌‌ ఇవ్వాలంటూ టెండర్‌‌ నోటీసులోనూ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా ఈ డీపీఆర్ రెడీ చేయాలని టెండర్ దక్కించుకున్న కంపెనీకి స్పష్టం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.