
- 40 రోజుల్లో సర్వే కంప్లీట్ చేయాలని టార్గెట్
మెదక్, సంగారెడ్డి, గజ్వేల్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెడ్తోంది. రోడ్ అలైన్మెంట్ సర్వే చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. రెవెన్యూ డివిజన్ల వారీగా భూసేకరణ జరుగనుంది. ఇందుకోసం ఆర్డీవోల ఆధ్వర్యంలో ల్యాండ్సర్వే డిపార్ట్మెంట్డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందితో స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి.. సర్వేపై అవగాహన కోసం మీటింగ్లు నిర్వహించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సర్వే పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3వేల ఎకరాలు
ఆర్ఆర్ఆర్ మొదటి దశలో 158 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుండగా, ఇందులో 105 కిలో మీటర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని 63 గ్రామాల మీదుగా 100 మీటర్ల వెడల్పుతో రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. నాలుగు చోట్ల భారీ జంక్షన్లు నిర్మిస్తారు. ఇందుకోసం మూడు జిల్లాల పరిధిలో 3,429 ఎకరాల భూమి సేకరించాలని గుర్తించి.. ఆయా రెవెన్యూ డివిజన్ల వారీగా భూసేకరణ కోసం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే మార్కింగ్చేసి హద్దులు పాతారు. ఏఏ గ్రామంలో.. ఏ రైతుకు సంబంధించిన భూమి ఎంత సేకరించాలో అలైన్మెంట్ సర్వే ద్వారా సర్వే, రెవెన్యూ అధికారులు తేల్చనున్నారు.
ఏ డివిజన్లో ఎంత ?
సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని సంగారెడ్డి, చౌటకూర్, హత్నూర మండలాల్లోని 20 గ్రామాల మీదుగా 26 కిలోమీటర్ల పొడవున్న ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగనుంది. గ్రామాల్లో 1,250 ఎకరాల భూమి సేకరించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ లోని నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో 29 కిలోమీటర్ల పొడవున రింగ్ రోడ్డు నిర్మాణం జరుగనుంది. ఇందుకుగాను 757 ఎకరాల భూమి సేకరించనున్నారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లోని వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్ మండలాల్లో 8 గ్రామాల పరిధిలో 14 కిలోమీటర్ల పొడవున రింగ్ రోడ్డు నిర్మాణం జరుగనుంది. 442 ఎకరాల భూమి సేకరించనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయపోల్, వర్గల్, గజ్వేల్, మర్కూక్, జగదేవ్ పూర్ మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో 36 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ నిర్మించనుండగా, 980 ఎకరాల భూమి సేకరించనున్నారు.
త్రిపుల్ఆర్ బాధితులకు భూమికి భూమి ఇవ్వాలి
యాదగిరిగుట్ట, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)లో భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారానికి బదులు గ్రామశివారులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని దాతారుపల్లికి రైతులు కోరారు. భూమికి భూమి కేటాయించాలని కోరుతూ సోమవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ రాములు నాయక్ కు వారు వినతిపత్రం అందజేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ కోసం దాతరుపల్లి రైతులు వందల ఎకరాలు కోల్పోయారని గుర్తుచేశారు. మళ్లీ రీజినల్ రింగ్ రోడ్ కోసం సర్వే చేసి తమ భూముల్లో హద్దులు ఏర్పాటు చేశారని, తమ భూములు తీసుకుంటే బతుకులు ఆగమైతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న భూములన్నీ సాగులో ఉన్నవేనన్నారు. రీజినల్ రింగ్ రోడ్ కోసం భూమి తీసుకుంటే దానికి బదులు దాతరుపల్లి శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని తమకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాతరుపల్లి సర్పంచ్ బైరపాక పుల్లయ్య గౌడ్, ఎంపీటీసీ కాల్నే అయిలయ్య, బాధితులు పాల్గొన్నారు.
స్పీడ్ గా సర్వే పనులు
నర్సాపూర్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు సర్వే పనులను స్పీడ్ గా చేయాలని నర్సాపూర్ ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ ఆర్డీవో ఆఫీస్ లో ఆయన భూసేకరణపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నర్సాపూర్ డివిజన్లోని 17 గ్రామాల మీదుగా ఆర్ ఆర్ ఆర్ పోతుందని, దీనికోసం దాదాపు 750 ఎకరాల భూమి సేకరించనున్నట్లు తెలిపారు. అలైన్మెంట్ సర్వే కోసం ఐదు టీములను ఏర్పాటు చేశామని, 40 రోజుల్లో సర్వే కంప్లీట్ చేయాలని టార్గెట్పెట్టుకున్నట్టు తెలిపారు. భూమి కోల్పోతున్న వారికి చట్టప్రకారం పరిహారం ఇస్తామన్నారు.