ట్రిపుల్​ ఆర్​ నార్త్​ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జనవరిలో టెండర్లు

హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్త్​పార్ట్​కు  నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ ​సౌత్ భాగం నిర్మాణానికి నిధుల కోసం ప్రపంచ బ్యాంకు, జైకా, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) సహా వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. మామునూరు విమానాశ్రయాన్ని 8 నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఒక్క రోజు మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రలు చేయడంకాదని, దమ్ముంటే 3 నెలలు నల్గొండలో మూసీ వద్ద నిద్ర చేయాలని సవాల్ విసిరారు. 

సోమవారం సెక్రటేరియెట్​లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ అరెస్ట్​అయినా.. ఇంకెవరైనా చట్ట ప్రకారం ముందుకు పోతం. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్​గా ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనను నియమించాం. భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో గ్రీన్ ఫిల్డ్ ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని, మామునూరు, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం కలిపి మొత్తం మూడు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులన వుచ్చే 4 ఏండల్లో అందుబాటులోకి తెస్తం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్​ను ఏడాదిన్నరలో అందుబాటులోకి తీసుకువస్తాం.  

మంగళవారం వరంగల్ జిల్లాకు వెళ్తున్న సీఎం రేవంత్​ రెడ్డి దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఒక్క ఆర్ అండ్ బీ పరిధిలోనే రూ.569 కోట్ల పనులున్నాయి’’ అని మంత్రి కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాదని.. గల్లీ మంత్రిలాగా 27 రోజులుగా హైదరాబాద్​ గల్లీలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బషీర్​ బాగ్ లో  రైతులపై కాల్పులు జరిపించిన కేసీఆర్.. ఇప్పుడు రైతులపై దొంగప్రేమను ఒలకబోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.