
న్యూఢిల్లీ: దేశంలో రిజిస్టర్ అయిన ఎంఎస్‌ఎంఈల (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ల) సంఖ్య 2029 నాటికి 9 కోట్లను దాటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు బుధవారం పేర్కొన్నారు. ప్రస్తుతం 6 కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉద్యమ్, ఉద్యమ్ అసిస్ట్ (యూఏ) పోర్టల్‌లో నమోదు అయ్యాయని అన్నారు. ‘ఇండియాలో అన్ని ఎంఎస్‌ఎంఈలను ఫార్మల్ సెక్టార్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము.
2029 నాటికి రిజిస్టర్ అయిన ఎంఎస్‌ఎంఈల సంఖ్య 9 కోట్లకు చేరుకుంటుందని అంచనా’ అని అస్సోచామ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఎంఎస్‌ఎంఈ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఎపావో వివరించారు. జీడీపీలో 30 శాతానికి పైగా ఎంఎస్‌ఎంఈ సెక్టార్ నుంచి ఉంది. మొత్తం తయారీ రంగంలో 36 శాతం ఉత్పాదకత, ఎగుమతుల్లో 45 శాతం ఈ సెక్టార్ నుంచి ఉన్నాయి. పెద్ద కంపెనీల కంటే ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే లోన్లు వేగంగా డిస్‌బర్స్ అవుతున్నాయని మెర్సీ అన్నారు.