టీయూ వీసీ పవర్స్​కు కత్తెర..

  • ఈసీ మీటింగ్ నిర్ణయం
  • మీటింగ్ కు వీసీ రవీందర్ గైహాజర్

నిజామాబాద్, వెలుగు: టీయూ వర్సిటీలో రిజిస్ట్రార్​ అపాయింట్​మెంట్​ వివాదం కొలిక్కి రాగా పాలన వ్యవహారాలపై పట్టు సాధించడంపై ఈసీ (పాలక మండలి) దృష్టి సారించింది. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతిపైసా ఖర్చుకు వారం ముందే ఈసీ ఆమోదం తీసుకోవాలని నిర్ణయించారు.  శుక్రవారం హైదరాబాద్​లో నిర్వహించిన మీటింగ్​లో కీలక అంశాలపై మెజారిటీ సభ్యులు తీర్మానాలు చేశారు.  ఇప్పటివరకు నోట్​ఫైల్​పై సంతకాలు చేసే అధికారం  వీసీకి మాత్రమే ఉండగా ఇక నుంచి మరింత పారదర్శకత కోసం ఈసీకి పవర్స్​ బదలాయించారు. వీసీ రవీందర్ నేరుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చెక్​పెట్టారు. 

​నిర్మలాదేవీ నోటీసులు రద్దు 

ఏప్రిల్​ 19, 26, మే 5 తరువాత శుక్రవారం ఈసీ మీటింగ్​ జరిగింది.  రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్​ నవీన్​మిట్టల్​ అధ్యక్షతన జరిగిన మీటింగ్​కు మొత్తం 10 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రొఫెసర్​ నసీమ్​, వసుంధర అసోసియేట్​ ప్రొఫెసర్​ రవీందర్​రెడ్డిపై రిజిస్ట్రార్​ హోదాలో నిర్మలాదేవీ జారీచేసిన షోకాజ్​ నోటీసులను రద్దు చేస్తూ ఈసీ తీర్మానం చేసింది.  రిజిస్ట్రార్​గా యాదగిరి బాధ్యతలు తీసుకున్నాక జరిగిన పేమెంట్​లను ఆమోదించారు. 

ఫండ్స్​ వినియోగంపై చర్చ

గత 17 నెలల కాలంలో  పాలకమండలికి తెలియకుండా చేసిన నిధుల ఖర్చుపై చర్చించారు.  రిజిస్ట్రార్​లుగా శివశంకర్​, విద్యావర్థిని చేసిన ఖర్చులను వాపసు తీసుకోవాలని నిర్ణయించారు. వారి ఆదేశాలతో జరిగిన అన్ని అపాయింట్​లు రద్దు చేశారు.  ఇద్దరిపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని రిజిస్ట్రార్​ యాదగిరిని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ప్రమోషన్​లు రద్దు చేసిన ఈసీ అధిక జీతాలను రికవరీ చేయాలని నిర్ణయించారు. 

శివశంకర్​ ఈ యాడాది ఆరంభంలో రిటైర్​కాగా విద్యావర్థిని ప్రొఫెసర్​గా కొనసాగుతున్నారు. వీరిద్దరినీ వీసీ రవీందర్​గుప్తా రిజిస్ట్రార్​లుగా నియమించి అవినీతికి పాల్పడ్డారని ఈసీ భావిస్తోంది. పుప్పాల రవి ఇటీవల పొందిన డాక్టరేట్ పట్టాపై  వసుంధరాదేవీ, గంగాధర్​గౌడ్​, ప్రవీణ్​కుమార్​ నేతృత్వంలోని త్రీమెన్​ కమిటీ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ రెండేళ్ల బడ్జెట్​పై విజిలెన్సు అండ్​ ఎన్​ఫోర్స్​ కమిటీ ఏసీబీ విచారణ కోరుతూ రాసిన లెటర్​లకు కట్టుబడి ఉన్నట్టు తేల్చారు. 

 వీసీ డుమ్మా

శుక్రవారం ఈసీ మీటింగ్​కు వెళ్తానని వీసీ రవీందర్​గప్తా వెలుగుతో చెప్పి డుమ్మాకొట్టారు. న్యాయవాదుల సలహా మేరకు ఆయన గైర్హాజర్​ అయినట్టు సమాచారం. తాను లేకుండా నిర్వహిస్తున్న మీటింగ్​లు, నిర్ణయాలపై  ఆయన ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. కేసు వాపసు తీసుకుంటేనే శుక్రవారం సమావేశానికి రావాలని ఈసీ సభ్యులు ఆయనకు సూచించారు. ఒకవేళ వీసీ వెళ్తే ఆయన అధ్యక్షతన మీటింగ్​ జరిగేది. తనకు వ్యతిరేకంగా సభ్యులు తీసుకునే నిర్ణయాలను దగ్గరుండి చూసే బదులు దూరంగా ఉండడం మేలని ఆయన భావించారు.  

25నాడు మళ్లీ మీటింగ్​

ఈనెల 25న మళ్లీ సమావేశం కావాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు సభ్యులు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు చేయాలని రిజిస్ట్రార్​ యాదగిరిని ఆదేశించారు. గత 17 నెలల కాలానికి చెందిన జమాఖర్చు రికార్డులతో మరుసటి మీటింగ్​కు రావాలని సూచించారు.