పాత బండ్లు వదిలేస్తే.. కొత్త బండ్లకు రిజిస్ట్రేషన్​ ఫీజు మాఫీ

పాత బండ్లు వదిలేస్తే.. కొత్త బండ్లకు రిజిస్ట్రేషన్​ ఫీజు మాఫీ
  • పాత బండ్లు వదిలేస్తే రాయితీ
  • కొత్త స్క్రాపేజీ పాలసీని ప్రారంభించిన ప్రధాని మోడీ
  • రిజిస్ట్రేషన్​ ఫీజు మాఫీ.. రోడ్డు పన్నులోనూ డిస్కౌంట్
  • కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కకుండా స్క్రాపేజీ పాలసీ
  • దేశ మొబిలిటీ, ఆటో సెక్టార్‌‌కు కొత్త గుర్తింపు
  • ‘వేస్ట్ టు వెల్త్’ ప్రోగ్రామ్​లో కీలకం

కాలం చెల్లిన వాహనాల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం కొత్త పాలసీ తీసుకొచ్చింది. లైఫ్​ టైమ్​ అయిపోయిన బండ్లను స్క్రాప్​కు అప్పగించినోళ్లకు రాయితీలు అందించనుంది. పాతది ఇచ్చేసి కొత్త బండ్లు కొనుక్కున్నపుడు రిజిస్ట్రేషన్​ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని హామీ ఇస్తోంది. రోడ్డు పన్నులోనూ కొంత డిస్కౌంట్​ ఇస్తామని వివరించింది. శుక్రవారం గుజరాత్​లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్​లో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​గా పాల్గొని కొత్త స్క్రాపేజీ పాలసీని ప్రారంభించారు.

గాంధీనగర్: మీ పాత బండ్లను వదిలేస్తే కొత్త బండ్ల కొన్నపుడు రిజిస్ట్రేషన్​ ఫీజును ప్రభుత్వం మాఫీ చేస్తోంది.. కాలం చెల్లిన వాహనాల సంఖ్య తగ్గించేందుకు కొత్త పాలసీ లో పలు రాయితీలు ప్రకటించింది. లైఫ్​ టైమ్​ అయిపోయిన బండ్లను స్క్రాప్​కు అప్పగించినోళ్లకు ఓ సర్టిఫికెట్​ ఇస్తామని కేంద్రం చెప్తోంది. ఆ సర్టిఫికెట్​తో కొత్త బండ్లు కొనుక్కున్నపుడు రిజిస్ట్రేషన్​ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని హామీ ఇస్తోంది. అంతేకాదు.. రోడ్డు పన్నులోనూ కొంత డిస్కౌంట్​ ఇస్తామని వివరించింది. ఈమేరకు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన కొత్త స్క్రాపేజీ పాలసీతో పాత, కాలం చెల్లిన బండ్లన్నీ తుక్కు కావాల్సిందేనని పేర్కొంది. గుజరాత్​లో జరిగిన ఇన్వెస్టర్స్ సమిట్​లో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​గా పాల్గొని, ఈ పాలసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ప్రయాణంలో నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీ ఓ మైలురాయి అని చెప్పారు. ఈ కార్యక్రమం ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా మారుస్తుందన్నారు. పాత, కాలం చెల్లిన, కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను రీసైకిల్ చేసేందుకు సంబంధించిన ఈ పాలసీ.. ఇండియా మొబిలిటీ, ఆటో సెక్టార్‌‌‌‌కు కొత్త గుర్తింపు ఇస్తుందని అన్నారు.

సైంటిఫిక్ పద్ధతిలో స్క్రాప్
కాలం చెల్లిన వాహనాలను సైంటిఫిక్ పద్ధతిలో రోడ్డెక్కకుండా చేయడంలో కొత్త స్క్రాప్ పాలసీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. 21వ సెంచరీలో క్లీన్, రద్దీ లేని, సులువుగా వెళ్లగలిగే ప్రయాణాల కోసం పని చేయాలన్నారు. కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించడంలో, ‘వేస్ట్ టు వెల్త్’ ప్రోగ్రామ్‌‌లో కొత్త పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ఈ పాలసీ ద్వారా 10 వేల కోట్లు ఇన్వెస్ట్‌‌మెంట్లు వస్తాయని, వేలాది ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని మోడీ చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌‌లో యువత, స్టార్టప్స్‌‌ భాగం కావాలని కోరారు. 

దిగుమతులు తగ్గుతయ్
‘‘మనం పోయినేడు రూ.23 వేల కోట్ల స్క్రాప్ స్టీల్‌‌ను దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే మన దేశంలో మెటల్స్ రికవరీ  అనుకున్నంత మేర లేదు. ఇప్పుడు తెచ్చిన కొత్త పాలసీతో అరుదైన లోహాలు కూడా సైంటిఫిక్ పద్ధతిలో రికవర్ చేయొచ్చు. మనం దిగుమతులపై ఆధారపడటం ఆపేయాలి. ఇందుకోసం స్టీల్ ఇండస్ట్రీ మరింత ఎఫర్ట్స్ పెట్టాలి” అని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునే విషయంలో ఇండస్ట్రీ లీడర్లు తమ పంథా మార్చుకోవాలని, రాబోయే 25 ఏళ్లకు రోడ్‌‌ మ్యాప్‌‌తో రావాలని పిలుపునిచ్చారు. గుజరాత్, అస్సాంలో స్క్రాపేజ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఏర్పాటు చేసేందుకు సంబంధించి ఈ సమ్మిట్‌‌లో 7 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 

అందరికీ ప్రయోజనం: గడ్కరీ
దేశంలో కోటి వెహికల్స్‌‌ను వెంటనే రీసైకిల్ చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘‘కొత్త స్క్రాపేజీ పాలసీతో అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఇది తయారీని ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగాలు సృష్టిస్తుంది. జీఎస్టీతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.40 వేల కోట్ల చొప్పున లబ్ది పొందడంలో సాయపడుతుంది” అని చెప్పారు. ‘‘స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి తీసుకునే రా మెటీరియల్ కాస్ట్ తక్కువ. తద్వారా వెహికల్స్ తయారీ ఖర్చు తగ్గి, కొత్త బండ్ల రేట్లు తగ్గుతాయి. సేల్స్ పెరుగుతాయి. జీఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది” అని అన్నారు.

స్క్రాప్ చేయించినోళ్లకు.. 

  • కొత్త పాలసీ ప్రకారం.. స్క్రాప్ చేసేందుకు తమ వెహికల్‌‌ను ఇచ్చే వారికి ప్రభుత్వం ఓ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్లు కొత్త బండి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయరు. అలాంటి వారికి రోడ్ ట్యాక్స్ విషయంలోనూ రాయితీ ఇస్తారు.
  • స్క్రాపింగ్‌‌కు పంపాలా వద్దా అనేది.. వెహికల్ తయారు చేసిన సంవత్సరంతో సంబంధం లేకుండా.. ఫిట్‌‌నెస్ పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు.
  • కమర్షియల్‌‌ వెహికల్స్‌‌కి 15 ఏళ్లు, ప్యాసింజర్‌‌ వెహికల్స్‌‌కి 20 ఏళ్లు దాటితే తుక్కుగా పరిగణిస్తారు. ఈ కాలపరిమితి దాటిన వాహనాల గుర్తింపు ఆటోమేటిక్‌‌గా రద్దవుతుంది.
  • 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల (4 వీల్‌‌, ఆపై)ను తుక్కుగా పరిగణిస్తారు.