
మార్ట్ గేజ్ లోన్ పేరుతో రైతులను నిండా ముంచారు కేటుగాళ్లు. భూములు తనాఖా పెట్టి డబ్బులిప్పిస్తామని ఏకంగా రైతుల భూముల్ని రిజిస్ట్రేషన్(సేల్ డీడీ) చేయించుకున్నారు బ్రోకర్లు. నిండా మోసపోయామని గ్రహించిన రైతులు తమ భూమిని తమకు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుల్క చర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు 5-32 ఎకరాల భూమిని 45 లక్షలకు తనాఖా పెట్టారు. షాద్నగర్ కు చెందిన మనోజ్, గణేష్ అనే వ్యక్తులు గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ ద్వారా మధ్యవర్తిత్వం చేశారు. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి రిజిస్ట్రేషన్ పూర్తికాగానే లోన్ డబ్బులు ఇస్తామని నమ్మించి ..హైదరాబాద్ కు చెందిన దేవిరెడ్డి రత్నమ్మకు డైరెక్ట్ సేల్ డీడ్ చేయించారు. అమాయక రైతులు డ్యాకుమెంట్లు చదవకుండా సంతకాలు పెట్టేశారు. రిజిస్ట్రేషన్ పూర్తవ్వగానే డబ్బులు ఇవ్వకుండా 45 లక్షల విలువ చేసే మూడు చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వారం తర్వాత చెక్కులు విత్ డ్రా చేయడానికి వెళ్లగా అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో అవాక్కైన రైతులు తాము మోసపోయామని తెలుసుకున్నారు.
దీంతో గ్రామ మాజీ సర్పంచ్ నిలదీశారు రైతులు. రేపు, మాపు అంటూ ఇలా రెండు నెలలు దాటవేశారు మధ్యవర్తులు. చేసేదేమీ లేక పోలీసులకు, తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు బాధిత రైతులు. ఫిర్యాదు చేసి వారం గడచిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తమ భూములు తమకు ఇప్పించి ఆదుకొవాలని వేడుకుంటున్నారు రైతులు. గ్రామంలో మనోజ్, గణేశ్ రియల్ బ్రోకర్ల ద్వారా మోసపోయిన రైతులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎక్కువగా కుల్కచర్ల, దోమ, గండీడు మండలాల్లోను బాధితులు ఉన్నారు.