యాదాద్రి జిల్లాలో సర్కారు హాస్పిటల్స్ కూ రిజిస్ట్రేషన్

యాదాద్రి జిల్లాలో సర్కారు హాస్పిటల్స్ కూ  రిజిస్ట్రేషన్
  •  ప్రతి దవాఖానకూ ఓ నంబర్​ 
  •  డాక్టర్లు, స్టాఫ్​వివరాల సేకరణ 
  •  మెడికల్​ ఆఫీసర్​ పేర సర్కారు ఆస్పత్రి రిజిస్ట్రేషన్​ 

యాదాద్రి, వెలుగు : నకిలీ డాక్టర్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రైవేట్​ హాస్పిటళ్లతో పాటు ప్రభుత్వ దవాఖానల రిజిస్ట్రేషన్ ను మెడికల్, హెల్త్​ డిపార్ట్​మెంట్​ తప్పనిసరి చేసింది. తెలంగాణ క్లినికల్​ ఎస్టాబ్లిష్​మెంట్​ యాక్ట్​ (టీసీఈఏ) ప్రకారం హాస్పిటళ్లలో అందిస్తున్న సేవలు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్​ స్టాఫ్​ వివరాలు కూడా తీసుకుంటోంది. నకిలీ వైద్యులను నియత్రించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం 2010లో క్లినికల్​ ఎస్టాబ్లిష్​మెంట్​ యాక్ట్​ తెచ్చింది. ఈ చట్టం అమలుకు సంబంధించి రూల్స్​ప్రేమ్​ చేస్తూ తెలంగాణ​ పబ్లిక్​ హెల్త్​, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​ 2022 జూన్​ 14న 64 నంబర్​జీవో తీసుకొచ్చింది. 

ఈ రూల్స్​ ప్రకారం ప్రైవేట్​తో పాటు ఎయిమ్స్​, రైల్వే, జిల్లా, ఏరియా హాస్పిటల్స్, పీహెచ్​సీ, సీహెచ్​సీ, పల్లె, బస్తీ దవాఖాన తప్పని సరిగా రిజిస్ట్రేషన్​ చేయించాలి. ఆయుష్​ దవాఖానాతో పాటు టీ హబ్​, ల్యాబ్​లకు కూడా ఈ రూల్స్​ వర్తిస్తాయి. రిజిస్ట్రేషన్​ నిబంధన నుంచి ఆర్మీ హాస్పిటల్స్​కు మాత్రమే మినహాయింపు ఉంటుంది. 2022లోనే జీవో విడుదలైనా.. వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ జరగలేదు. ఇటీవలే ఈ ప్రక్రియ ఊపందుకుంది. 

 ప్రతి జిల్లాలో డీఆర్​ఏ

ఆస్పత్రుల రిజిస్ట్రేషన్​ కోసం ప్రతి జిల్లాలో డిస్ట్రిక్​ రిజిస్టరింగ్​అథారిటీ(డీఆర్​ఏ) ఏర్పాటు చేసింది. దీనికి జిల్లా కలెక్టర్​ చైర్మన్​గా ఉంటారు. డీఎంహెచ్​వో కన్వీనర్​గా, ఎస్​పీ లేదా డీసీపీ, ఐఎంఏ ప్రెసిడెంట్​, ఇద్దరు అడిషనల్​ కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రేషన్ కోసం అన్ని ప్రైవేట్​, ప్రభుత్వ హాస్పిటల్స్, టీ హబ్, ల్యాబ్​లు​​ డీఆర్​ఏకు అప్లికేషన్​ చేసుకోవాలి. హాస్పిటల్స్​ఉన్న ప్రదేశం, వాటి సేవల ఆధారంగా ఫీజు నిర్ణయించారు. మెట్రో, ఆర్బన్​, రూరల్​, ట్రైబల్​ ఏరియాను బట్టి.. బెడ్స్​సంఖ్య, అందించే సర్వీస్​కు అనుగుణంగా అప్లికేషన్​ ఫీజు రూ. 500 నుంచి రూ. 16 వేల వరకు ఖరారు చేశారు. 

రిజిస్ట్రేషన్​ కోసం డాక్టర్లు, ఇతర స్టాప్​ వివరాలు, డాక్టర్ల మెడికల్​ కౌన్సిల్ సర్టిఫికెట్లు, పారా మెడికల్​ స్టాఫ్​, నర్సులకు సంబంధించి పారా మెడికల్​ బోర్డ్​, నర్సింగ్​ కౌన్సిల్ సర్టిఫికెట్లను అందించాలి. ప్రైవేట్​ హాస్పిటల్స్​ యాజమాన్యాలు స్పెషలిస్ట్​ డాక్టర్లు, స్టాఫ్​ డిటైల్స్​తో పాటు 21 రకాల డాక్యుమెంట్స్​ సమర్పించవలసిఉంటుంది. హాస్పిటల్​ ఓనర్, కల్పిస్తున్న సౌకర్యాలు, ఎక్విప్​మెంట్​,​ బిల్డింగ్​ అనుమతులు, రెంట్ అగ్రిమెంట్​, ఫైర్, పీసీబీ అనుమతులు, బయో మెడికల్​ వేస్టేజ్​ మేనేజ్​మెంట్​ అగ్రిమెంట్, రెండేండ్ల ఆడిట్​ రిపోర్ట్​ఇవ్వాలి.

 ఆస్పత్రిలో ఏ ట్రీట్​మెంట్​కు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారన్న డిస్​ప్లే ఫొటో కూడా జత చేయాలి. హాస్పిటల్​ అప్లికేషన్​ను డీఆర్​ఏ పరిశీలించి ప్రభుత్వ హాస్పిటల్ అయితే మెడికల్​ ఆఫీసర్​, ప్రైవేట్​ హాస్పిటల్​ అయితే ఓనర్ పేరిట రిజిస్ట్రేషన్​ చేసి ఓ నెంబర్​ కేటాయిస్తోంది. హాస్పిటల్స్​ను రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు తిరస్కరించే, రిజిస్ట్రేషన్​ను తాత్కాలికంగా నిలిపివేసే, పూర్తిగా రద్దు చేసే అధికారం కూడా డీఆర్​ఏకు ఉంది. 

 ఈ రిజిస్ట్రేషన్ వల్ల ప్రైవేట్​ దవాఖానాల్లో వసూళ్లు, అనర్హులైన వారితో ట్రిట్​మెంట్​ చేయించడం, నకిలీ డాక్టర్ల వ్యవహారానికి బ్రేక్​ పడుతుందని భావిస్తున్నారు. ఒకే డాక్టర్ వేర్వేరు చోట్ల ట్రీట్​మెంట్​చేస్తున్నా, ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్​ ప్రాక్టీస్​చేస్తున్నా
 తెలిసిపోతుంది. 

 చర్యలు తీసుకోవడ ఈజీ

ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​ రిజిస్ట్రేషన్​కొనసాగుతోంది. దీని వల్ల డాక్టర్లు, హాస్పిటల్స్​కు సంబంధించిన పూర్తి వివరాలు డీఆర్​ఏ వద్ద ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది. తక్షణమే చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. 

 డాక్టర్​ మనోహర్​, డీఎంహెచ్​వో, యాదాద్రి