బతికుండగానే చంపేసిన్రు..గద్వాల జిల్లా కేటిదొడ్డిలో కబ్జాదారుల బాగోతం.. ఆఫీసర్ల సపోర్ట్​

బతికుండగానే చంపేసిన్రు..గద్వాల జిల్లా కేటిదొడ్డిలో కబ్జాదారుల బాగోతం.. ఆఫీసర్ల సపోర్ట్​
  •     డాక్యుమెంట్లు లేకుండా ఇతరుల పేరుతో భూమి రిజిస్ట్రేషన్
  •     రెవెన్యూ ఆఫీసర్ల మాయాజాలంతో చేతులు మారుతున్న కోట్ల ప్రాపర్టీ
  •     ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

గద్వాల, వెలుగు :  రెవెన్యూ ఆఫీసర్లు, లీడర్లు, దళారుల మాయాజాలంతో సామాన్య ప్రజలు తిప్పలు పడుతున్నారు. రికార్డుల్లో ఉన్న భూములను సంబంధం లేని వారి పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. పొలాలు లేకున్నా ఉన్నట్లు ధరణిలో ఎక్కిస్తున్నారు. గద్వాల టౌన్ లోని సర్వేనెంబర్ 780లో కలెక్టరేట్  సమీపంలో ఉన్న భూమిని సంబంధం లేని వ్యక్తుల పేర్లపై ఎక్కించి కోట్ల రూపాయల ప్రాపర్టీని కొట్టేశారనే ఆరోపణలున్నాయి. తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్, తహసీల్దార్  ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కోర్టుకు వెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కళ్ల ముందే తమ భూములను ఇతరులకు కట్టబెట్టి, తమను కోర్టుకు వెళ్లాలని చెప్పడం ఏమిటని వారు నిలదీస్తున్నారు.

కోట్ల ప్రాపర్టీని కొట్టేసిన్రు..

గద్వాల పట్టణం కలెక్టరేట్  ఆఫీస్ కు అనుకొని ఉన్న  కోట్ల విలువ చేసే ప్రాపర్టీని రెవెన్యూ ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై కొట్టేశారనే ఆరోపణలున్నాయి. సర్వేనెంబర్ 780లో 16 ఎకరాల ఒక గుంట భూమి ఉంది. చిన్న తిమ్మన్న, కరె తిమ్మన్న, తెలుగు సాయన్న, తిప్పన్న పేర్లపై ఈ భూములున్నాయి. 1983లో కలెక్టరేట్  కోసం 9 ఎకరాల 13 గంటల భూమి సర్కార్  తీసుకుంది. వీరిలో చిన్న తిమ్మన్న, కరె తిమ్మన్న, తిప్పన్న మిగిలి పొలాలను అమ్ముకున్నారని తెలుగు సాయన్న వారసులు చెబుతున్నారు. మూడెకరాల ఆరు గంటల భూమి తీసుకోగా, మిగిలిన భూమి ఉందని పేర్కొన్నారు.

అయితే రెవెన్యూ ఆఫీసర్లు భూమితో సంబంధం లేని చిన్న తిమ్మన్న వారసులకు ఎకరా భూమిని ధరణిలో మార్పు చేసి పాస్​ బుక్​ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అందరూ కుమ్మక్కై రూ.5 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కొట్టేశారని వాపోయారు. ఇలా చిన్నపాటి లిటిగేషన్​ ఉన్న భూముల విషయం తెలియగానే దళారులు వాలిపోయి ఆఫీసర్లు, బీఆర్ఎస్  లీడర్లతో కుమ్మక్కై స్వాహా చేస్తున్నారు. ఇలా గద్వాల పట్టణ పరిసరాల్లో రూ.30 కోట్ల ప్రాపర్టీని కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. 

ఈమె పేరు సూగమ్మ.. కేటిదొడ్డి మండలం నందిని శివారులో సర్వే నంబర్  213ఎ/1లో ఈమె భర్త జంబన్న పేరుపై మూడెకరాల 15 గుంటల భూమి ఉంది. వాళ్లు బతుకుదెరువు కోసం కర్నాటకలోని రాయచూర్ కు పదేండ్ల కింద వలస వెళ్లారు. జంబన్న ఐదేండ్ల కింద చనిపోగా, అప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన నర్సప్పకు ఆ భూమిని కౌలుకు ఇచ్చారు. ఆ భూమిని కాజేసేందుకు కుట్ర పన్నారు. ఈ ఏడాది జులై14న నర్సప్ప ద్వారా ఆ భూమి తమదేనంటూ దరఖాస్తు పెట్టించారు. అప్పటి తహసీల్దార్, ఆర్ఐకి అప్లికేషన్​ ఫార్వర్డ్​ చేశాడు. అదే నెల 27న జంబన్నకు వారసులు లేరంటూ రిపోర్టు వచ్చింది. దీంతో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే మూడెకరాల 15 గుంటల భూమిని నర్సప్ప పేరుపై మార్చేశారు.

విషయం తెలుసుకున్న బాధితులు తహసీల్దార్  ఆఫీస్ కు వెళ్లగా, కలెక్టర్  ఆఫీస్ కు పోవాలని చెప్పారు. కలెక్టర్  ఆఫీసులో బాధితులు కంప్లైంట్ చేశారు. తమ పొలం కౌలుకు ఇస్తే పొలమే కాజేశారని, తాను బతికే ఉన్నా లేరని రిపోర్టు ఇచ్చి అన్యాయం చేశారని సూగమ్మ వాపోతుంది. ఇదిలాఉంటే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ పొలాన్ని వెంట వెంటనే ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్  చేసేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా గద్వాల జిల్లాలో కోట్ల విలువ చేసే భూములు రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో కాజేస్తున్నారు. 

వెరిఫై చేస్తాం..

డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేషన్  చేసిన విషయంపై వెరిఫై చేస్తాం. 280ఎ/1 సర్వే నంబర్లు పాత పాస్  బుక్​లు ఉండడంతో కలెక్టర్​ అప్రూవల్ తో రిజిస్ట్రేషన్  చేసినట్లు ఉన్నారు. దీనిని రెండు, మూడు సార్లు రిజిస్ట్రేషన్  చేసినట్లు నా దృష్టికి రాలేదు. దీనిపై వెరిఫై చేసి బాధితులకు న్యాయం చేస్తాం.

సరితా రాణి, తహసీల్దార్, కేటిదొడ్డి