రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్

  • రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్
  • రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన 4 వేల రిజిస్ట్రేషన్లు
  • ఆధార్ వెరిఫికేషన్​లో టెక్నికల్ ఇష్యూ
  • సాయంత్రం దాకా ఎదురుచూసి ఇండ్లకు తిరుగుముఖం 

కరీంనగర్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సోమవారం నాన్ అగ్రికల్చర్ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు నిలిచిపోయాయి. ఆధార్, ఈకేవైసీ, థంబ్‌‌ ఇంప్రెషన్ వెరిఫికేషన్ కు సంబంధించిన సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయిందని ఆ శాఖ ఆఫీసర్లు వెల్లడించారు. ఉదయం రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటి నుంచే ఈ సమస్య తలెత్తింది. దీంతో రోజుకు సగటున 3,500పైగా అయ్యే రిజిస్ట్రేషన్లు సోమవారం 150 మాత్రమే అయ్యాయి. 

స్లాట్ బుక్ చేసుకున్న భూములు, ఇండ్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వేచి చూడాల్సి వచ్చింది. సాయత్రం దాకా వేచి చూసి ఇండ్లకు వెళ్లిపోయారు.నిలిచిపోయిన 4వేల రిజిస్ట్రేషన్లుశ్రావణ సోమవారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4వేల మంది రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్స్ బుక్ చేసుకున్నారు. సర్వర్ డౌన్ కారణంగా వారందరికీ నిరాశే ఎదురైంది. రిజిస్ట్రేషన్ కోసమని ఉద్యోగాలు, ఇతర పనులు మాని ఆఫీసులకు వచ్చిన వారికి టైమంతా వృథా అయింది. చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.