రియల్టర్ల​ మాయాజాలం..ఫేక్​ డ్యాకుమెంట్లతో రిజిస్ట్రేషన్లు

రియల్టర్ల​ మాయాజాలం..ఫేక్​ డ్యాకుమెంట్లతో రిజిస్ట్రేషన్లు

నారాయణపేట/ ఊట్కూర్, వెలుగు:ధరణి లోపాలను ఆసరా చేసుకుంటున్న కొంతమంది రియల్టర్లు పట్టాదారులకు తెలియకుండా భూములు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్​ మండలంలో రియల్టర్లు అసలు పట్టాదారుడికి తెలియకుండా భూమిని కాజేశారు. 2013 మార్చి 1న నారాయణపేట మండలం బోయిన్ పల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మికి ఊట్కూర్​ మండలం దంతన్​పల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 24 లో 11 ఎకరాల 21 గుంటల భూమి ఉంది. ఈ భూమిని అప్పటి కృష్ణాజిల్లా విజయవాడ గుణదలకు చెందిన మహ్మద్ జమాల్ తండ్రి రహమతుల్లా కొనుగోలు చేశారు. తెలంగాణ ఏర్పాటు తరువాత మహ్మద్​ జమాల్  ఆధార్  లింక్​ చేయకపోవడంతో ఆయన పట్టా ధరణి పెండింగ్​ లిస్టులో ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన రియల్టర్లు, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఊట్కూర్​లోని అదే పేరు, తండ్రి పేరు ఉన్న వ్యక్తిని అసలు పట్టాదారుడిగా చూపిస్తూ గత ఏడాది అక్టోబర్​లో ఆధార్​ అప్​డేట్​ చేయించారు. ఆధార్​ అప్​డేట్​ చేయించిన రెండు నెలల తరువాత ఊట్కూర్​కు చెందిన జమాల్​ను సాక్షి సంతకం పెట్టాలని, తహసీల్దార్​ ఆఫీసుకు పిలిపించి శివకుమార్​ అనే వ్యక్తి పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్​ చేయించారు. గత ఏడాది డిసెంబర్ 1న ఈ భూమిని శివకుమార్  రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సప్పగూడకు చెందిన నీరటి మల్లయ్య పేరిట రిజిస్ట్రేషన్​ చేయించారు. ఇదిలాఉంటే ఈ భూమి ఎవరిదనే విషయం ఊట్కూర్​కు చెందిన జమాల్, రెండోసారి రిజిస్ట్రేషన్​​చేసిన శివకుమార్​కు తెలియకపోవడం గమనార్హం. 

ఆధార్​ అప్​డేట్, రిజిస్ట్రేషన్​ సమయంలో పట్టాదారుల ఫొటోలు చూడకుండా రెవెన్యూ సిబ్బంది రిజిస్ట్రేషన్​ ఎలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రియల్టర్లకు​రెవెన్యూ సిబ్బంది సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇలాగే పట్టాదారులకు తెలియకుండా మరిన్ని భూములను కాజేశారనే అనుమానాలున్నాయి. ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. 

ఏపీ సీఐడీ ఆరా!

ఈ భూములు అగ్రి గోల్డ్​​కంపెనీకి చెందినవని స్థానికులు భావిస్తుండగా, ఇటీవల ఏపీ సీఐడీ ఆఫీసర్లు ఈ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్​ నిర్వాహకులు ఊట్కూర్​ మండలంలో భూములు కొన్నారు. అప్పట్లో విజయవాడకు చెందిన కొందరిపై రిజిస్ట్రేషన్లు చేశారు. కంపెనీ దివాలా తీసిన తరువాత అగ్రిగోల్డ్​ సంస్థ సభ్యులు ఎవరూ ఇక్కడి భూములపై దృష్టి సారించలేదు. ఆధార్​ అప్​డేట్​ కూడా చేసుకొలేదు. దీంతో ధరణి వచ్చిన తరువాత రియల్టర్లు ఈ భూముల గురించి ఎవరూ అడగరని భావించి ఈ దందాకు తెర లేపినట్లు చెబుతున్నారు. 

వక్ఫ్ బోర్డు భూములపై కన్ను?

రెవెన్యూ ఆఫీసర్లు సహకరిస్తుండడంతో కొందరు అక్రమారులు వక్ఫ్ బోర్డు భూములపై కన్నేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఊట్కూర్​ మండలంలో 330 ఎకరాల భూమి వక్ఫ్​బోర్డు పేరిట ఉండగా, బోర్డుకు చెందిన కొంత మంది గ్రామానికి చెందిన కొందరికి భూమి అమ్ముతున్నట్లు పేపర్లపై అగ్రిమెంట్​ చేసినట్లు తెలిసింది. ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్టేషన్లు చేసే పనిలో ఉన్నారని, దీనిని ఆపాలని మైనారిటీలు కోరుతున్నారు. 


ష్యూరిటీ కోసం రమ్మన్నరు..

ఊట్కూర్​కు చెందిన దోస్తులు ఓ భూమి రిజిస్ట్రేషన్​ ష్యూరిటీ సంతకం పెట్టడానికి తహసీల్దార్​ ఆఫీసుకు తీసుకెళ్లిన్రు. నాకు సర్వే నంబర్​ 24లో 11 ఎకరాల భూమి లేదు. అసలు పట్టాదారుడిని నేనెందుకు అవుతా. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు.
 - జమాల్, ఊట్కూర్

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..

సర్వే నెంబర్ 24 లో పట్టాదారుడు కాకుండా, వేరే వ్యక్తిని పెట్టి భూమి అమ్మిన విషయం నా దృష్టికి రాలేదు. ఈ విషయంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపడతాం. రెవెన్యూ సిబ్బంది రియల్టర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వాస్తవం​కాదు.
- ఎన్.తిరుపతయ్య, తహసీల్దార్, ఊట్కూర్