భద్రాచలం,వెలుగు : వరద బాధితులను వెంటవెంటనే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సబ్ కలెక్టర్ఆఫీసులో సోమవారం ఆయన వరద సహాయక చర్యలపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఉపనదుల నుంచి వరద వస్తోందని, అధికారులు అలెర్ట్‌గా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో మహిళా సంఘాల ద్వారా నాణ్యమైన ఆహారం అందిస్తామన్నారు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఆఫీసర్లకు సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. స్థానికంగా ఉండి వరదబాధితులకు అండగా ఉండాలన్నారు. అంతకు ముందు ఆయన కొత్త కరకట్ట పనులను పరిశీలించారు. మంత్రి వెంట కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, పీవో రాహుల్, ఏఎస్పీ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, ఆర్డీవో దామోదర్, ఇరిగేషన్ సీఈ వెంకటేశ్వర్లు, ఈఈ రాంప్రసాద్ తదితరులు ఉన్నారు.
నిర్వాసితులకు పరామర్శ..
అశ్వారావుపేట : మండలంలో పెద్దవాగు కు గండిపడి నష్టపోయిన నిర్వాసితులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరామర్శించారు. గుమ్మడవల్లి గ్రామాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు. పొంగులేటి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 51 మంది బాధితులకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఇటీవల కొత్తూరు లో కరెంట్ షాక్ తో మృతి చెందిన వేణు మురళి కుటుంబాన్ని పరామర్శించి రూ. 20 వేల నగదును అందజేశారు.
నేలకొండపల్లి : మండలంలో సోమవారం పలు అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. మండల కేంద్రంలో 3 సైడ్ కాల్వల నిర్మాణ, బోదులబండ లో భైరవునిపల్లి క్రాస్ రోడ్ నుంచి పైనంపల్లి, బోదులబండ మీదుగా కోయగూడెం వరకు రహదారుల అభివృద్ధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రహారీ గోడ పనులకు శంఖుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆఫీస్ ఇన్చార్జి తంబూరి. దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.