హెల్త్ కార్డు చెల్లట్లే.. రీయింబర్స్​మెంట్ రావట్లే

హెల్త్ కార్డు చెల్లట్లే.. రీయింబర్స్​మెంట్ రావట్లే
  • రాష్ట్రంలో అమలుకాని ఈహెచ్‌ఎస్‌
  • ఏడాదిగా ఫండ్స్ రిలీజ్ చేయని సర్కారు
  • ప్రైవేటు ఆస్పత్రులకు రూ.200 కోట్ల బకాయిలు
  • ఉద్యోగులకు రూ.150 కోట్ల బిల్లులు ఇవ్వలే
  • స్టేట్‌ లెవల్‌లోనే 30 వేల మంది బిల్లులు పెండింగ్
  • జిల్లా స్థాయిలోనూ భారీగా బిల్లులు ఆగినయ్
  • హెల్త్ కార్డులను యాక్సెప్ట్ చేయని ప్రైవేటు హాస్పిటళ్లు

వరంగల్​కు చెందిన హరిబాబు హెల్త్ డిపార్ట్​మెంట్​లో పని చేస్తున్నరు. కిందటేడాది కరోనా రావటంతో హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో చేరారు. ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయారు. అప్పటికే హాస్పిటల్ బిల్లు రూ.18 లక్షలు అయింది. మొత్తం బిల్లు కడితేనే డెడ్ బాడీ ఇస్తామని హాస్పిటల్ మేనేజ్​మెంట్ చెప్పటంతో అప్పులు తెచ్చి మరీ డబ్బులు కట్టారు కుటుంబసభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డు చెల్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంప్లాయీస్‌‌ హెల్త్ స్కీమ్‌‌ (ఈహెచ్‌‌ఎస్) సరిగ్గా అమలు కావడం లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమకు సర్కారు రూ.200 కోట్లు బకాయి పడిందని చెబుతున్న ప్రైవేట్‌‌, కార్పొరేట్ హాస్పిటళ్లు.. హెల్త్ కార్డులను యాక్సెప్ట్ చేయడంలేదు. మరోవైపు తమ సొంత డబ్బులతో ట్రీట్​మెంట్ చేయించుకున్న ఉద్యోగులకు.. ప్రభుత్వం రీయింబర్స్​మెంట్ ఇవ్వడం లేదు. దీంతో అటు హెల్త్ కార్డులు పనిచేయక, ఇటు మెడికల్ రీయింబర్స్‌‌మెంట్ బిల్లులు విడుదల కాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి మరీ ట్రీట్​మెంట్ చేయించుకుంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మందికి పైగా ఉద్యోగుల బిల్లులు ఏడాదిగా పెండింగ్​లో ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు మెడికల్ బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

ఎంప్లాయీస్‌‌ హెల్త్ స్కీమ్‌‌కు సంబంధించి ప్రైవేట్‌‌, కార్పొరేట్ హాస్పిటళ్లకు సర్కార్ రూ.200 కోట్లు బకాయి పడింది. ఆరేడు నెలలుగా బిల్లులు రిలీజ్ చేయడం లేదు. దీంతో హాస్పిటళ్లు ఈహెచ్‌‌ఎస్‌‌ కార్డులను యాక్సెప్ట్ చేయడం లేదు. ఎమర్జెన్సీలో ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌కు వెళ్తున్న ఉద్యోగులు, రిటైర్డ్‌‌ ఉద్యోగులు సొంత డబ్బులతో ట్రీట్‌‌మెంట్ చేయించుకుంటున్నారు. ఈ ట్రీట్‌‌మెంట్‌‌కు సంబంధించిన బిల్లుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.50 వేల కంటే తక్కువ బిల్లులు జిల్లా లెవల్‌‌లో, అంతకంటే ఎక్కువ బిల్లులైతే స్టేట్‌‌ లెవల్​లో పరిశీలించి రీయింబర్స్‌‌ చేయాల్సి ఉంటుంది. రీయింబర్స్‌‌మెంట్ కోసం ప్రతి నెలా స్టేట్‌‌ కమిటీకి సగటున 3 వేల మంది దరఖాస్తు చేసుకుంటుండగా, జిల్లాలోనూ ఇదే స్థాయిలో అప్లికేషన్లు వస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఏడాదిగా వీటిని క్లియర్ చేయడం లేదు. స్టేట్‌‌ లెవల్‌‌లోనే 30 వేల మంది ఉద్యోగుల బిల్లులు పెండింగ్‌‌లో ఉండగా, జిల్లా స్థాయిలోనూ ఇదే స్థాయిలో బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి. రీయింబర్స్‌‌మెంట్ కోసం ఉద్యోగులు కోఠిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చుట్టూ, తమ హెడ్డాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రూ.50 వేల కంటే పైబడిన బిల్లులను కోఠిలోని డీఎంఈ ఆఫీసులో ప్రాసెస్‌‌ చేసి, ఎన్ని డబ్బులు రీయింబర్స్ చేయవచ్చో డాక్టర్ల కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఫైళ్లను సంబంధిత శాఖకు పంపిస్తుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో, ఆ బిల్లులు ఆయా శాఖల వద్దే పెండింగ్‌‌లో ఉంటున్నాయి. ఇలా సుమారు రూ.150 కోట్లకు పైగా బిల్లులను ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ బకాయిపడింది.

ఉద్యోగుల రిక్వెస్ట్​ను పట్టించుకోని సర్కార్

ఈహెచ్‌‌ఎస్ కింద ట్రీట్‌‌మెంట్ చేయాలని కోరితే, హాస్పిటళ్ల యాజమాన్యాలు, స్టాఫ్‌‌ తమను అవమానించేలా బిహేవ్ చేస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాయి. దీనికి ఓ పరిష్కార మార్గాన్ని కూడా ఉద్యోగులే ప్రతిపాదించారు. ఈహెచ్‌‌ఎస్ కోసం తమ వంతుగా నెలకు కొంత చెల్లించడానికి ముందుకొచ్చారు. మూడేళ్లుగా పలుమార్లు దీనిపై ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు. తాము డబ్బులు ఇవ్వడం వల్ల, ప్రతి నెల హాస్పిటళ్లకు ఫండ్స్ రిలీజ్‌‌ అయి, మంచి ట్రీట్‌‌మెంట్ అందుతుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై తన నిర్ణయాన్ని ప్రకటించకుండా మౌనం వహిస్తోంది. మొన్నటి పీఆర్సీ కమిటీ రిపోర్ట్‌‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది.

కరోనాతో లక్షలు లాస్‌‌

ఈహెచ్‌‌ఎస్ కార్డులు ఉన్నాయని.. ప్రభుత్వ ఉద్యోగులెవరూ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌‌లు తీసుకోలేదు. కరోనా సమయంలో ప్రైవేట్‌‌ కార్డులు పనిచేసినా, ఈహెచ్‌‌ఎస్ కార్డులను ఆస్పత్రులు యాక్సెప్ట్ చేయలేదు. గతేడాది వందల మంది సర్కార్ ఎంప్లాయీస్‌‌ కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ దవాఖాన్లకు వెళ్లేందుకు భయపడి, కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స తీసుకున్నారు. చాలా మంది లక్షల్లో బిల్లులు చెల్లించారు. అయితే కొంతమేర రీయింబర్స్‌‌మెంట్ అయినా వస్తుందని భావించారు. కానీ కరోనా రీయింబర్స్‌‌మెంట్ రూ.లక్షకు మించి ఇవ్వబోమని సర్కార్ ప్రకటించింది. దీంతో ఏండ్లకు ఏండ్లు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము, హాస్పిటళ్లకే పెట్టుకున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీది అదే దుస్థితి

ఉద్యోగులతోపాటు పేదల హెల్త్ స్కీమ్‌‌ ఆరోగ్యశ్రీని కూడా సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. హాస్పిటళ్ల యాజమాన్యాలు ధర్నాలు, ఆందోళనలు చేసినప్పుడు మాత్రమే డబ్బులు రిలీజ్ చేసి, తర్వాత యథావిధిగా వందల కోట్లు పెండింగ్‌‌లో పెడుతోంది. ప్రస్తుతం రూ.300 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయని నెట్‌‌వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. డబ్బులు లేకుండా తాము ట్రీట్‌‌మెంట్ ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. కరోనాతో సర్కార్ ఇన్‌‌కమ్ దెబ్బతినడంతోనే బిల్లుల విడుదల ఆలస్యం అవుతున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారని, తమ ఆదాయం కూడా దెబ్బతిన్న విషయం వాళ్లకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 2019లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటి దాకా సర్కార్ నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్యాకేజీలను సవరిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈహెచ్ఎస్ కింద ట్రీట్​మెంట్ చేస్తలే

మా కుటుంబ సభ్యులకు వైద్యం కోసం హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ఈహెచ్ఎస్ ఉంది. కానీ ప్రభుత్యం నుంచి డబ్బులు రావడం లేదని చెప్పి, ఈహెచ్ఎస్ కింద వైద్యం చేయడం లేదు. సొంత ఖర్చులు పెట్టుకోవాలని చెప్తున్నారు. ట్రీట్​మెంట్ చేయించేందుకు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న.

– సైదులు, టీచర్, ఖమ్మం

బిల్లు రాలే

నా భార్యకు హెల్త్ బాగాలేక గతేడాది జూన్​లో హాస్పిటల్ పోతే.. కరోనా కారణంగా ఈహెచ్ఎస్ కింద చేర్చుకోవట్లేదని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ లో హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయించా. మెడికల్ రీయింబర్స్​మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. జులైలో అప్లై చేసుకున్నాం. కానీ ఇప్పటిదాకా డబ్బులు రాలే.

– భీమనాదుల మహేశ్వర్, టీచర్, దహెగాం, ఆసిఫాబాద్ జిల్లా

లక్షన్నర వసూలు చేసిన్రు

కడుపుల నొప్పి, మోషన్స్ అని సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు పోయినం. ఈహెచ్‌‌ఎస్ కార్డు చెల్లదని చెప్పిన్రు. ఒక్క రోజులో రూ.87 వేలు బిల్లు వేశారు. రెండో రోజు సాయంత్రానికి లక్షన్నర చేశారు. దీంతో మా వల్ల కాదని డిశ్చార్జ్ అయి ప్రైవేట్ నర్సింగ్ హోంకు పోయినం. ఆ తర్వాత రీయింబర్స్‌‌మెంట్ కోసం బిల్లు పెట్టుకున్నం. నాలాగే ఎంతో మంది ఉద్యోగుల ఈహెచ్ఎస్ బిల్లులు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ దగ్గర పెండింగ్ లో ఉన్నయి. అసలు రిలీజ్ చేయటం లేదు. చేసినా.. ఏడెనిమిది లక్షల బిల్లు అయితే, ఒకట్రెండు లక్షలు మాత్రమే ఇస్తున్నారు. మిగతాదంతా ఉద్యోగులే భరించాలె.

– మురళీ మోహన్, ప్రభుత్వ ఉద్యోగి, ఖైరతాబాద్

ఎవ్వరూ జవాబిస్తలే

మెడికల్ రీయింబర్స్​మెంట్ కు అప్లై చేసి 8 నెలలు గడిచినా ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ట్రీట్​మెంట్ కోసం 50 వేలు ఖర్చు అయింది. వాటికి సంబంధించిన బిల్లులు గతేడాది ఆగస్ట్ లో సబ్మిట్ చేశాం. కానీ ఇప్పటిదాకా ఈ బిల్లు మంజూరు చేయలేదు. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని అధికారులను అడిగినా.. ఎవరు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు.

– ఇ.రూప, టీచర్, దమ్మచెరువు, సిద్దిపేట జిల్లా

10 నెలల బిల్లులు రావాలె

నాకు పది నెలల నుంచి ఒక్క రూపాయి కూడా రాలె. కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టి, ఆదాయం లేకుండా ఎన్ని రోజులు ట్రీట్‌‌మెంట్ ఇవ్వగలం? బిల్లులు రిలీజ్ అవ్వక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. బిల్లులు ఇవ్వకపోయినా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌‌ఎస్‌‌ కింద ట్రీట్‌‌మెంట్ చేసుకుంటూ పోతే మా స్టాఫ్‌‌కు శాలరీలు ఎట్ల ఇవ్వాలి? అందుకే క్యాష్‌‌ కట్టి ట్రీట్‌‌మెంట్ చేయించుకోవాలని చెబుతున్నాం.

– వరంగల్‌‌కు చెందిన ఓ హాస్పిటల్‌‌ డైరెక్టర్‌‌‌‌